కాల్‌మనీ కథలు-1 - రాజకీయ విభేదాలే రచ్చకీడ్చాయి

కాల్‌మనీ కథలు - 1

రాజకీయ విభేదాలే రచ్చకీడ్చాయి

 


విజయవాడలో బయపడిన కాల్‌మనీ ఫైనాన్స్ వ్యవహారం సంచలనం సృష్టించింది. ఏపీ ప్రజలందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసిన కాల్‌మనీ వ్యవహారం ప్రజలకు కొత్త విషయమేమీ కాదు... బ్లాక్‌మనీ పెరిగిపోయిన బడాబాబులు ఆ డబ్బును వడ్డీలకు తిప్పగల ‘సత్తా’ వున్నవాళ్ళకు డబ్బును మూడు రూపాయల వడ్డీకి ఇస్తారు. ఆ ‘సత్తా’ వున్నవాళ్ళు ఆ డబ్బును ఆరు నుంచి పది రూపాయల వరకు వడ్డీకి తిప్పుతారు. సహజంగానే ఈ స్థాయి వడ్డీలు జనం కట్టలేకపోవడం, చివరికి అప్పులు తీసుకున్నవారి ఆస్తులను స్వాధీనం చేసుకోవడం....! మొన్నటి వరకూ ఈ కాల్‌మనీ వ్యాపారం గురించి అందరికీ తెలిసిన కోణం ఇదొక్కటే. అయితే లేటెస్టుగా బయటపడిన అనేక వ్యవహారాలు దిగ్భ్రాంతిగొలిపేలా వున్నాయి. ధనంతో మాత్రమే లింక్ వున్న వ్యవహారం అనుకున్న కాల్‌మనీ మాన, ప్రాణాలతో కూడా చెలగాటం ఆడేస్థాయికి ఈ వ్యాపారం జరుగుతోందన్న విషయం బయటపడటం సంచలనం సృష్టించింది. దీనికి సంబంధించిన రోజుకో కొత్త విషయం బయటపడుతూ ప్రజల్ని దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో కాల్‌మనీ వ్యవహారానికి సంబంధించిన లోగుట్టును ‘తెలుగువన్’ ‘కాల్‌మనీ కథలు’ పేరుతో పాఠకులకు అందిస్తోంది. ఈ అంశం మీద ‘తెలుగువన్’ చేసిన పరిశోధనలో బయటి ప్రపంచానికి చాలా తక్కువగా తెలిసిన అనేక అంశాలు బయటపడ్డాయి. వాటిని ‘కాల్‌మనీ కథలు’  సిరీస్ ద్వారా పాఠకులకు అందిస్తున్నాం.


కాల్‌మనీ వ్యాపారం చేయడం అనేది ఆంధ్రప్రదేశ్‌ జిల్లాల్లో చాలా మామూలు విషయం. ప్రజలకు డబ్బుతో అవసరం వుంటుంది. అవసరానికి డబ్బు ఇచ్చి ప్రజల్ని ఆదుకోవలసిన బ్యాంకులు రుణాలు మంజూరు చేయడంలో సవాలక్ష రూల్స్ పెడుతూ వుంటాయి. బడాబాబులకు కోట్లకు కోట్లు రుణాలు ఇచ్చి, వాళ్ళు ఎగవేసినా పెద్దగా పట్టించుకోని బ్యాంకులు చిన్నా చితకా ప్రజలకు రుణాలు ఇవ్వాలంటే మాత్రం బ్రహ్మాండం బద్దలయ్యేంత స్థాయిలో రూల్స్ పెడతాయి. అందుకే ప్రజలు తప్పనిసరి పరిస్థితుల్లో కాల్‌మనీ వ్యాపారులను  ఆశ్రయించక తప్పడం లేదు. ఆరు రూపాయల నుంచి పది రూపాయల వరకు వడ్డీ చెల్లించడానికి సిద్ధపడి మరీ అప్పులు తీర్చుకుంటున్నారు. కాల్‌మనీ సాలెగూటిలో చిక్కుకున్న తర్వాత బయట పడటం చాలా కష్టం. ఒక్కసారి ఈ గూటిలో చిక్కారా... ఇక తమ ఆస్తుల మీద ఆశలు వదులుకోవడమే...


విజయవాడ పరిసరాల్లో దాదాపు బడాబాబులకు బినామీదార్లుగా యాభై మందికి పైగా కాల్‌మనీ వ్యాపారం నిర్వహిస్తున్నారు. వీరిలో 20 మంది వరకు మహా యాక్టివ్‌గా ఈ వ్యాపారాన్ని మూడు అప్పులు, ఆరు ఆస్తి స్వాధీనాలు అన్నట్టుగా విజయవంతంగా నిర్వహిస్తున్నారు. విజయవాడ కాల్‌మనీ సెక్స్ రాకెట్ వ్యవహారంలో బయటపడిన ఇద్దరు ప్రజాప్రతినిధులు ఈ వ్యాపారంలో మకుటం లేని మహారాజులు. ఎవరి దారిలో వారు కాల్‌మనీ వ్యాపారం చేస్తూ బాగా ‘డెవలప్’ అయ్యారు. కొద్దికాలం క్రితం వరకూ మధ్యతరగతి జీవితాలను ఈడ్చిన వీరిద్దరూ ఇప్పుడు ప్రజా ప్రతినిధుల స్థాయికి ఎదిగారంటే దానికి ప్రధాన కారణం కాల్‌మనీ వ్యాపారం ద్వారా అడ్డగోలుగా సంపాదించిన డబ్బే.


గతంలో ఛోటా నాయకుడిగా వుండే ఒక వ్యక్తికి కాల్‌మనీ వ్యాపారం ద్వారా సంపాదించిన డబ్బు ఎమ్మెల్యే పదవిని వరప్రసాదంగా ఇచ్చింది. ఆ తర్వాత రాజకీయరంగం అండతో ఆయన గారు తన వ్యాపార చక్రాన్ని మరింత వేగంగా తిప్పడం ప్రారంభించాడు. తన దగ్గర వున్న డబ్బును రొటేషన్ చేయడానికి అనేకమంది అనుచరులను నియమించుకున్నాడు. సదరు అనుచరుల ద్వారా ఆస్తులను గుంజుకోవడంతోపాటు డబ్బు కట్టలేని ఆడవాళ్ళను లోబరుచుకోవడం లాంటి దారుణాల వరకు చేయడం ప్రారంభించాడు. ఈ ఎమ్మెల్యే అనుచరుడు ఒకడు ఒక మహిళకు యాభై లక్షల రూపాయలు అప్పు ఇచ్చాడు. ఆ యాభై లక్షలకు వడ్డీ మాఫీ చేయడం కోసం ఆ మహిళను వేధించి ఆమె శారీరకంగా తమకు లొంగిపోయేలా చేశారు. ఆ మహిళను విలాస వస్తువులాగా అనేకమంది దగ్గరకు పంపించాడు. ఆమె మరికొంత డబ్బు కావాలని ఫోన్ చేసి అడిగింది. దానికి ఎమ్మెల్యే మనిషి నుంచి దుర్మార్గమైన సమాధానం వచ్చింది. బీటెక్ చదువుతున్న నీ కూతుర్ని నాయకుల దగ్గరకు పంపిస్తే నీకు కావలసిన డబ్బు ఇస్తానని ఆ వ్యక్తి పచ్చిగా చెప్పేశాడు. ఆమె ఎవరెవరి దగ్గరకి వెళ్ళాల్సి వుంటుందో ఆ చిట్టా కూడా చదివాడు. ఈ సంభాషణ మొత్తాన్నీ రికార్డు చేసిన ఆ మహిళ స్థానిక పార్లమెంటు సభ్యుడికి ఆ సంభాషణను వినిపించింది. ఆ ఎంపీ దీన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకుని వెళ్ళడంతో కాల్‌మనీ వ్యాపారం వెనుక జరుగుతున్న అత్యంత జుగుప్సాకరమైన అంశాలు బయటపడ్డాయి. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి ఒక దుర్మార్గాన్ని ఆపిన ఆ ఎంపీ నిజంగా చాలా గొప్పవాడు. కాల్ మనీ ద్వారా దారుణాలకు పాల్పడుతున్న వ్యక్తులలో తన పార్టీకి సంబంధించిన వారు వున్నారని తెలిసి కూడా ఉపేక్షించకుండా ఆ విషయాన్ని బట్టబయలు చేసిన ఆయనకు హేట్సాఫ్ చెప్పాలి.

ఈ వ్యవహారం ఇప్పటికీ బయటపడకపోయేదే... ఈ  కేసులో ప్రధాన నిందితుడిగా వున్న ఒక నాయకుడికి ఒకవైపు కాల్‌మనీ ద్వారా వస్తున్న డబ్బు ప్రవాహం.. మరోవైపు అర్హత లేకపోయినా అందివచ్చిన పదవి అహంకారాన్ని పెంచాయి. దాంతో జిల్లాలో సీనియర్‌ నాయకుడిగా వున్న ఒక ఎమ్మెల్సీని నోటికొచ్చినట్టుగా విమర్శించేవాడు. సొంత పార్టీ నాయకుడన్న విచక్షణ కూడా లేకుండా విమర్శలు గుప్పించేవాడు. రాజకీయ రంగంలో ఆరితేరి వున్న ఆయన ఈ నాయకుడిని టార్గెట్ చేసి ఒక పథకం ప్రకారం ఇరికించాడని తెలుస్తోంది. తనను విమర్శిస్తున్న ఆ నాయకుడికి సంబంధించిన అన్ని గుట్టుమట్లూ తన గుప్పిట్లో పెట్టుకుని వాటిని బయటపెట్టి ఇరుక్కుపోయేలా చేసినట్టు సమాచారం. ఈ కాల్‌మనీ నాయకుడు ఆ వ్యాపారాన్ని అడ్డు పెట్టుకుని మహిళలను ఎలా వేధించాడో.. ఎవర్ని వెంటపెట్టుకుని ఎప్పుడెప్పుడే ఏయే దేశాలకు ఎవరెవరితో టూర్లు వెళ్ళాడో లాంటి వివరాలన్నీ  ఆయన వెల్లడి చేసినట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా అధికార పార్టీ నాయకుల మధ్య ఏర్పడిన విభేదాలు, ఒకరినొకరు టార్గెట్ చేసుకోవడం అధికార పార్టీకి కొంత ఇబ్బంది కలిగించే విషయమే. అయినప్పటికీ కాల్‌మనీ వెనుక ఉన్న దారుణమైన విషయాలు బయటపడటానికి ఈ విభేదాలే కారణమయ్యాయి.

(కాల్‌మనీ వ్యవహారానికి సంబంధించిన మరికొన్ని వివరాలు తదుపరి ఆర్టికల్‌లో.....)