TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఉప ఎన్నికల్లో సత్తా చాటిన టీఆర్ఎస్

Published on: Wed Mar 21, 2012 12:49PM

హైదరాబాద్: ఉప ఎన్నికల్లో ఊహించినట్లుగానే కారు దూసుకుపోయింది. తెలంగాణలోని ఆరు స్థానాల్లో నాలుగు స్థానాలను తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) కైవసం చేసుకుంది. ఆరో స్థానంలో తెరాస బలపరిచిన స్వతంత్ర అభ్యర్థి నాగం జనార్దన్ రెడ్డి విజయం సాధించారు. మహబూబ్‌నగర్‌లో తెలంగాణవాదాన్ని బలంగా వినిపించిన బిజెపి విజయం సాధించింది. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి విజయం సాధించారు. రెండు ప్రధాన పార్టీలు కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు ఓటమి చవి చూశాయి. కామారెడ్డిలో తెరాస అభ్యర్థి గంప గోవర్ధన్ భారీ ఆధిక్యతతో విజయం సాధించారు. ఆయన కాంగ్రెసు అభ్యర్థిపై 44 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ డిపాజిట్ గల్లంతయింది.

వరంగల్ జిల్లా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో తెరాస అభ్యర్థి టి రాజయ్య 32 వేల భారీ ఆధిక్యతతో తెలుగుదేశం అభ్యర్థి కడియం శ్రీహరిపై విజయం సాధించారు. ఇక్కడ కాంగ్రెసు అభ్యర్థి డిపాజిట్ కోల్పోయింది. ఆదిలాబాద్ నియోజకవర్గంలో తెరాస అభ్యర్థి జోగు రామన్న విజయం సాధించారు. తెలంగాణవాదం బలహీనంగా ఉన్న దక్షిణ తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లాలో కూడా తెరాస విజయం సాధించింది. కొల్లాపూర్‌లో తెరాస అభ్యర్థి జూపల్లి కృష్ణారావు విజయం సాధించారు. కాంగ్రెసు, తెలుగుదేశం రెండు, మూడు స్థానాలను దక్కించుకున్నాయి. మంత్రి డికె అరుణ ప్రతిష్టాత్మకంగా తీసుకుని పోరాడినప్పటికీ జూపల్లి కృష్ణారావు విజయాన్ని అడ్డుకోలేకపోయారు. నాగర్ కర్నూలులో నాగం జనార్దన్ రెడ్డి విజయం సాధించారు.

 

ఓట్ల లెక్కింపు వివరాలు
* కామారెడ్డి : టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గంపగోవర్థన్‌రెడ్డి 44,466 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
* నాగర్ కర్నూల్ : ఏడో రౌండ్ ముగిసేసరికి స్వతంత్ర అభ్యర్థి నాగం జనార్థన్‌రెడ్డి 18,651 ఓట్ల ఆధిక్యంతో విజయం
* కొల్లాపూర్ : టీఆర్ఎస్ అభ్యర్థి జూపల్లి కృష్ణారావు 15,013 ఓట్ల ఆధిక్యంతో విజయం
* స్టేషన్ ఘన్‌పూర్ : టీఆర్ఎస్ అభ్యర్థి రాజయ్య 32,638 ఓట్ల మెజారిటీతో విజయం
* మహబూబ్‌నగర్ : బీజేపీ అభ్యర్ధి ఎన్. శ్రీనివాసరెడ్డి విజయం సాధించారు.
* ఆదిలాబాద్ : టీఆర్ఎస్ అభ్యర్థి జోగురామన్న 27,000 ఓట్ల ఆధిక్యంతో గెలుపు
* కోవూరు : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ 23,362 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు.