మునిసిపోల్స్ కి అభ్యర్థులను ఖరారు చేయాలి.. విచారణకు రాలేను.. కేసీఆర్
posted on: Jan 30, 2026 8:45AM
.webp)
ఫోన్ ట్యాపింగ్ కేసులో తాను విచారణకు హాజరు కాలేనని మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు సిట్ అధికారులకు సమాచారం అందించారు. రాష్ట్రంలో మునిసిపల్ ఎన్నికల దృష్ట్యా తాను విచారణకు హాజరు కాలేననీ, సిట్ విచారణకు హాజరయ్యేందుకు తనకు సమయం కావాలని ఆయన కోరారు. కాగా కేసీఆర్ అభ్యర్థనకు సిట్ అంగీకరించింది.
ఫొన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరయ్యేందుకు కేసీఆర్ కు మరింత సమయం ఇవ్వాలని సిట్ నిర్ణయించింది. అదే సమయంలో విచారణకు హాజరయ్యే విషయంలో కేసీఆర్ ప్రస్తావించిన పలు అంశాలపై న్యాయ సలహా తీసుకోవాలని నిర్ణయించింది. వారి సలహాను అనుసరించి కేసీఆర్ విచారణకు మరో తేదీ, విచారణ జరిపే ప్రాంతం పై నిర్ణయం తీసుకుని మరోసారి ఆయనకు నోటీసులు జారీ చేసే అవకాశం ఉందని అంటున్నారు.
కాగా ఫోన్ ట్యాపింగ్ కేసులో శుక్రవారం (జనవరి 30) మధ్యాహ్నం మూడు గంటలకు విచారణకు హాజరు కావాల్సిందిగా కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే తెలంగాణలో మునిసిపల్ ఎన్నికల నామినేషన్ కు తుది గడువు కూడా శుక్రవారం (జనవరి 30) కావడంతో తమ పార్టీ అభ్యర్థుల ఖరారులో తాను బిజీగా ఉన్నాననీ పేర్కొన్న కేసీఆర్.. ఆరు పదుల వయస్సు దాటిన వృద్థులను విచారణ నిమిత్తం పోలీసు స్టేషన్ కు పిలవరాదన్న నిబంధనను ప్రస్తావించిన కేసీఆర్.. తనను ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లోనే విచారించాలని సిట్ ను కోరారు.










