TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తిరుమల లడ్డూ ప్రసాదం పేరుతో ఉత్పత్తులు.. టీటీడీ లీగల్ నోటీసులు

Published on: Sat Jun 7, 2025 11:16AM

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం పేరును అనధికారికంగా వాడుకుంటూ, భౌగోళిక సూచిక హక్కులను ఉల్లంఘిస్తున్న పుష్ మై కార్ట్ సంస్థ కు తిరుమల తిరుపతి దేవస్థానం నోటీసులు జారీ చేసింది. ఒక్క పుష్ మై కర్డ్ సంస్థకే కాకుండా ఇలా లడ్డూ ప్రసాదం పేరును, పవిత్రతను అనధికారికంగా ఉపయోగించుకుంటున్న పలు ఇతర సంస్థలపై కూడా చట్టపరమైన చర్యలకు తిరుమల తిరుపతి దేవస్థానం సిద్ధమై లీగల్ నోటీసులు జారీ చేసింది.  

కోట్లాది మంది భక్తులు అత్యంత పవిత్రంగా భావించే ఈ ప్రసాదం పేరుతో వ్యాపారం చేస్తున్నపుష్ మై కార్ట్ సహా పలు సంస్థలకు లీగల్ నోటీసులు జారీ చేసింది.  తిరుమల శ్రీవారి లడ్డూకు 2009 సెప్టెంబరులోనే చెన్నైలోని జియోగ్రాఫికల్ ఇండికేటర్ రిజిస్ట్రీ ద్వారా పేటెంట్ హక్కులు లభించాయి.  అంతకుముందే 1999లో జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ ఆఫ్ గూడ్స్ చట్టం కింద టీటీడీ ఈ హక్కులను పొందింది.  అయితే పలు మిఠాయి దుకాణాలు, ఆన్‌లైన్ సంస్థలు 'శ్రీవారి లడ్డూ పేరుతో  ఉత్పత్తులను విక్రయిస్తున్నాయి. దీనిపైనే ఇప్పుడు టీటీడీ కన్నెర్ర చేసింది.  ఇలా శ్రీవారి లడ్డూ పేరుతో ఉత్పత్తులను విక్రయిస్తున్న పుష్‌ మై కార్ట్, ట్రాన్సాక్ట్‌ ఫుడ్స్‌ లిమిటెడ్‌, ఇండియా స్వీట్‌ హౌస్‌ వంటి సంస్థలకు టీటీడీ గత నెల 31న లీగల్ నోటీసులు జారీ చేసింది.  ఈ నోటీసులకు పుష్‌ మై కార్ట్‌ సంస్థ  స్పందించి తమ ఉత్పత్తుల జాబితా నుంచి శ్రీవారి లడ్డూ ప్రసాదం పేరును తొలగించింది. ఈ మేరకు టీటీడీకి సమాచారం అందించింది. 

దీనిపై టీటీడీ ఈవో శ్యామలరావు మాట్లాడుతూ  తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కోట్లాది మంది భక్తుల విశ్వాసం అని పేర్కొన్నారు. అలాంటి విశ్వాసాన్ని వ్యాపారంగా మార్చుకునేందుకు ఎంత మాత్రం అంగీకరించబోమని స్పష్టం చేశారు.  భక్తుల మనోభావాలను కాపాడేందుకు అవసరమైన అన్ని చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.  లడ్డూ పవిత్రతను, ప్రాశస్థ్యాన్ని కాపాడేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం కట్టుబడి ఉందని శ్యామలరావు అన్నారు.