అవినీతి "ఐఏఎస్‌"లపై ప్రజల చేతికి కొరడా..

పెద్ద పెద్ద హోదాలు..అంతులేని అధికారాలు..అడుగడుక్కూ పరిచారకులు..లంకంత బంగ్లాలు..విదేశీ ప్రయాణాలు..అత్యున్నత నిర్ణయాధికారం.. ఇవి భారత్‌లో ఐఏఎస్ అధికారుల వైభవానికి తార్కాణాలు. ఇలాంటి సౌకర్యాలు ఉన్నప్పటికి కొందరు అధికారులు అవినీతికి పాల్పడి ఈ వ్యవస్థకే మాయని మచ్చ తెస్తున్నారు. వీరికి గల రాజ్యాంగపరమైన రక్షణలు ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవడానికి ప్రతిబంధకాలుగా మారాయి. తాజాగా ఐఏఎస్‌ అధికారులపై విచారణ జరపమని ప్రతిపాదించే అధికారాన్ని సామాన్య ప్రజలకు కల్పిస్తూ కేంద్రప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. 2012లో అప్పటి ప్రధాని మన్మోహన్‌‌సింగ్‌పై సుబ్రమణ్యస్వామి వేసిన ఒక కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ పబ్లిక్ సర్వెంట్లు తప్పు చేశారని భావిస్తే సామన్య ప్రజలు కూడా విచారణ జరపాలని సమర్ధ అధికార కేంద్రం వద్ద ప్రతిపాదించవచ్చని, దాన్ని నిరోధించే చట్టాలేవీ లేవని చెప్పింది.

 

ఆ తీర్పును ఆధారంగా చేసుకున్న కేంద్ర సిబ్బంది, శిక్షణ శాఖ మార్గదర్శకాలను విడుదల చేసింది. ఎలాంటి ఆధారాలు, పత్రాలు చూపించకుండానే అవినీతిపరులని భావించిన ఐఏఎస్‌ అధికారులపై విచారణ కోరుతూ సిబ్బంది శాఖకు ప్రజలు ప్రతిపాదనలు పంపవచ్చు. అధికార యంత్రాంగం విధి నిర్వహణలో నిక్కచ్చిగా వ్యవహరించినపుడే సుపరిపాలన సాధ్యపడుతుందన్నది జాతిపిత అన్నమాట. అందుకే పాలన నేతలదైనా..నడిపించేది మాత్రం ఐఏఎస్‌లే. దేశవ్యాప్తంగా 5 వేల మంది ఐఏఎస్‌‌లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో సేవలందిస్తున్నారు. మెజిస్టీరియల్ అధికారాలను నిర్వహించే స్థాయిని రాజ్యాంగం ఐఏఎస్‌లకు కల్పించి, పాలనాపరంగా విశేషాధికారాలను ఇచ్చింది.  మరేదేశంలోనూ లేని విధంగా ఇక్కడ ఐఏఎస్‌లకు పూర్తి స్థాయి రక్షణ కల్పించారు. నిర్భయంగా పనిచేయడానికి, నిస్సంకోచంగా మనసులో మాట చెప్పడానికి, నాయకులు చెప్పేది తప్పయితే వ్యతిరేకించడానికి అవకాశమిచ్చారు. ఐఏఎస్‌ల వద్ద అపరిమితమైన అధికారం కేంద్రీకృతమై ఉంటూంటే వారి నోటి మాటలు రాజాజ్ఞలుగా చెలామణి అవుతాయి. అందుకే ఎన్ని తప్పులు చేసినా ఐఏఎస్‌లు ఆడింది ఆట పాడింది పాట.

 

దానికి తోడు వారికి మరింత అధికారమిచ్చే నిర్ణయాన్ని మోడీ సర్కార్ తీసుకుంది. ఐఏఎస్, ఐపీఎస్ ఇతర సివిల్ సర్వీస్ అధికారులను ఏకపక్షంగా సస్పెండ్ చేయకుండా రాష్ట్ర ప్రభుత్వాలను కట్టడి చేసింది. ఒకవేళ సస్పెండ్ చేసినా ఆ విషయాన్ని 48 గంటల్లోగా కేంద్రప్రభుత్వానికి తెలియజేయాలి. అవినీతి కేసుల్లో ఆ అధికారులపై విధించే సస్పెన్షన్ రెండేళ్లకు మించరాదు. ఇక కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని అధికారులపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలంటే ప్రధాని అనుమతి తీసుకోవాలి. దీనిని బట్టి చూస్తే ఐఏఎస్‌, ఐపీఎస్‌ల జోలికి వెళ్లే సాహసం ఏ ప్రభుత్వమూ చేయలేదు. ప్రభుత్వాలే చూసి చూడనట్టు వ్యవహరిస్తుంటే ప్రజల పరిస్థితి వేరే చెప్పక్కర్లేదు.

 

తాజాగా కేంద్రం విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం..ఒక పౌరుడు సిబ్బంది శాఖకు పంపించిన ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక దర్యాప్తు జరిపి, నిజమని తేలితే సంబంధిత పత్రాలతో సమగ్ర నివేదిక పంపించాలి. అందులో సంబంధిత అధికారి వివరణ కూడా తీసుకోవాలి. ఆ వివరాలన్నింటిని కేంద్ర సిబ్బంది శాఖకు పంపాలి. అధికారి తప్పేమీ చేయలేదని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తే ఫిర్యాదు చేసిన పౌరుడికి అదే సమాచారాన్ని అందజేయాలి. దానిపై పౌరుడికి అభ్యంతరం ఉంటే న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చు. అవినీతి నిరోధక చట్టం కింద అధికారి తప్పు చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రాథమిక విచారణలో తేలితే, పౌరుడి ఫిర్యాదునే అవినీతి అధికారిపై చర్యకు ప్రతిపాదనకు భావించి, నిబంధనల ప్రకారం ముందుకు వెళ్లాల్సి ఉంటుంది.