TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఢిల్లీలో కుప్ప కూలిన మరో భవనం.. శిథిలాల కింద జనం

Published on: Sat Jul 12, 2025 12:39PM

ఢిల్లీ ఆజాద్ మార్కెట్‌లో ఓ బిల్డింగ్ కుప్పకూలిన 30 గంటల్లోనే సీలమ్‌పూర్ ఏరియాలో మరో బిల్డింగ్ కూలిపోయింది. శనివారం ఉదయం ఏడు గంటల ప్రాంతంలో నాలుగు అంతస్తుల భవనం ఉన్నట్లుండి కుప్పకూలింది. ఈ మధ్య కాలంలో భవనాలు కుప్పకూలుతున్న సంఘటనలు తరచుగా జరుగుతున్నాయి. ఓ సంఘటన మరువక ముందే మరో సంఘటన చోటు చేసుకుంటోంది. దేశ రాజధాని ఢిల్లీలో రెండు రోజుల వ్యవధిలో రెండు బిల్డింగులు కూలిపోయాయి. శుక్రవారం తెల్లవారుజామున ఆజాద్ మార్కెట్ ఏరియాలో ఓ బిల్డింగ్ కూలిపోయింది. ఈ దుర్ఘటనలో 45 ఏళ్ల పప్పు అనే వ్యక్తి చనిపోయాడు. బిల్డింగ్ సమీపంలో మెట్రో నిర్మాణ పనులు జరుగుతున్నాయి. మెట్రో పనుల కారణంగా బిల్డింగ్ కుప్పకూలిపోయి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు.
ఇక ఆజాద్ మార్కెట్‌లో బిల్డింగ్ కూలిన 30 గంటల్లోనే సీలమ్‌పూర్ ఏరియాలో మరో బిల్డింగ్ కూలిపోయింది.   శనివారం (జులై 12) ఉదయం ఏడు గంటల ప్రాంతంలో నాలుగు అంతస్తుల భవనం ఉన్నట్లుండి కుప్పకూలింది. ఈ భవన శిథిలాల కింద పలువురు చిక్కుకున్నారు.  సమాచారం అందుకున్న ఢిల్లీ ఫైర్ డిపార్ట్‌మెంట్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద చిక్కుకుపోయిన నలుగురిని రక్షించారు.

వారిని వెంటనే చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. శిథిలాల కింద ఇంకా పలువురు ఉన్నట్లు సమాచారం. వారిని బయటకు తీసుకువచ్చేందుకు సహాయక చర్యలు జరుగుతున్నాయి. అయితే..  ప్రమాదానికి గల కారణాలు  తెలియరాలేదు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలోని భీకర దృశ్యాలు కలచి వేస్తున్నాయి. నాలుగు అంతస్తుల బిల్డింగ్ కుప్పకూలి పక్కన ఉన్న ఇళ్లపై పడింది. దీంతో ఆ ఇళ్లులు కూడా బాగా దెబ్బతిన్నాయి. స్థానికులు పెద్దఎత్తున అక్కడికి చేరుకుని సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు.