Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...లోక్ సభ ఎన్నికల ముందు అజెండా లేక బీఆర్ఎస్ డీలా!
posted on: Feb 28, 2024 1:20PM
భారత రాష్ట్ర సమితిని తెలంగాణ ప్రజలు పూర్తిగా విస్మరించారా? ఎప్పుడైతే పార్టీ పేరులోంచి తెలంగాణను తొలగిస్తూ కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారో అప్పటి నుంచే కేసీఆర్ ప్రభుత్వాన్ని వదిలించేసుకోవాలని తెలంగాణ జనం డిసైడైపోయారా అంటే పరిశీలకుల నుంచి ఔననే సమాధానమే వస్తోంది.
అదలా ఉంటే.. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ పరాజయం పాలై కాంగ్రెస్ సర్కార్ కొలువుదీరిన క్షణం నుంచీ బీఆర్ఎస్ కు వరుసగా షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. పార్టీ నుంచి కాంగ్రెస్ లోకి వలసలూ పెరిగాయి. వలసల జోరు చూస్తుంటే.. బీఆర్ఎస్ మనుగడే ప్రశ్నార్థకంగా మారిపోయింది. పార్టీ మారుతున్న వారిపై విమర్శలు చేయడానికి కూడా ఆ పార్టీ అధినేతకు అవకాశం లేని పరిస్థితి కనిపిస్తోంది. ఆయన పార్టీ మారుతున్న వారిపై ఏమైనా విమర్శలు చేస్తే.. తాను అధకారంలో ఉన్నప్పుడు ఇతర పార్టీల నుంచి వలస వచ్చిన వారికి తలుపులు బార్లా తెరిచి మరీ స్వాగతం పలకడమే కాకుండా, వారికి పదవులు కట్టబెట్టిన సంగతి గుర్తు చేసి నిలదీస్తారన్న భయం ఆయనను మౌనం వహించేలా చేస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
అసెంబ్లీ ఎన్నికలలో ఎదురైన పరాభవాన్ని పక్కన పెట్టి కనీసం లోక్ సభ ఎన్నికలలోనైనా పుంజుకునేలా పార్టీనీ, క్యాడర్ ను సమాయత్తం చేద్దామంటే అందుకూ పరిస్థితులు సానుకూలంగా కనిపించడం లేదు. రాష్ట్రంలో ఉన్న 17 లోక్ సభ నియోజకవర్గాలకూ అభ్యర్థులను ఎంపిక చేయడమే కష్టంగా మారిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ దశలో పదేళ్ల పాటు రాష్ట్రాన్ని కనుసైగతో కంట్రోల్ చేసిన, ప్రత్యర్థుల అంచనాలకు అందకుండా వ్యూహరచనలు చేసిన కేసీఆర్ ఇప్పుడు ఇంత డీలా పడిపోయారేమిటి? అని పరిశీలకులే విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
కేసీఆర్ పరిస్థితి ఇలా ఉంటే మరో వైపు కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం తనకు మాత్రమే ప్రత్యేకమైన దూకుడుతో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉండగా చేసిన పొరపాట్లు, తప్పిదాలను కడిగి పారేస్తున్నారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల విషయంలో జరిగిన అవకతవకలు, అవినీతి, అక్రమాలపై బీఆర్ఎస్ నేతలు సమాధానం చెప్పుకోలేని విధంగా ఆధారాలతో సహా చెరిగిపారేస్తున్నారు. ఈ తరుణంలో లోక్ సభ ఎన్నికలలో కనీసం కొన్ని స్థానాలలోనైనా విజయం సాధించి ఆబోరు కాపాడుకోవాలని కేసీఆర్ తహతహలాడుతున్నట్లు కనిపిస్తోంది. ఏదో విధంగా లోక్ సభ ఎన్నికలలో పుంజుకోవాలని చూస్తున్న ఆయన బీజేపీతో పొత్తుపై పార్టీ పరంగా లీకులు ఇచ్చారు. అయితే కేసీఆర్ ఈ ఎత్తుగడ కూడా ఘోరంగా విఫలమైంది. బీజేపీతో పొత్తు వార్తలపై ఆ పార్టీ సీనియర్ నేత బండి సంజయ్ ఘాటుగా బదులిచ్చారు. బీఆర్ఎస్, బీజేపీ పొత్తు అని ఎవరైనా అంటే చెప్పు తీసుకు కొట్టండి అంటూ ఆయన బహిరంగంగా ప్రకటించారు. దీనికి బీఆర్ఎస్ నుంచి గట్టిగా బదులిచ్చే నేతే లేకపోయారు. దీంతో బీజేపీతో పొత్తు కోసం బీఆర్ఎస్ మాత్రమే తహతహలాడుతోందని అందరికీ తెలిసిపోయింది.
ఈ తరుణంలో రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ఉక్కిరి బిక్కిరి అయ్యే విధంగా లోక్ సభ ఎన్నికలలో కనీసం ఒక్క స్థానంలోనైనా విజయం సాధించి చూపండి అంటూ సవాల్ విసిరారు. అయినా కూడా కేసీఆర్ నుంచి కానీ, బీఆర్ఎస్ కీలక నేతలైన కేటీఆర్, హరీష్ రావుల నుంచి స్పందన లేదు. దీంతో పార్టీ క్యాడర్ లో అసంతృప్తి వ్యక్తం అవుతోంది. మరో వైపు ఎన్నికల ముందు రేవంత్ హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీలనూ ఒకదాని వెంట ఒకటి గా అమలు చేస్తూ తనది మాటల సర్కార్ కాదు, చేతల ప్రభుత్వమని చాటుతున్నారు. తద్వారా లోక్ సభ ఎన్నికలలో కాంగ్రెస్ కు పూర్తి సానుకూల వాతావరణం ఏర్పడేలా చేసుకున్నారు. అదే సమయంలో బీఆర్ఎస్ పరిస్థితి రోజు రోజుకూ అగమ్య గోచరంగా మారిపోతోంది. లోక్ సభ ఎన్నికలలో పోటీకి అభ్యర్థులనే ఎంపిక చేసుకోలేని దయనీయ స్థితికి ఆ పార్టీ దిగజారిపోయింది. అలాగే ఎన్నికల అజెండా కూడా ఇప్పటికీ ఖరారు చేసుకోలేని పరిస్థితిలో ఉంది. మేడిగడ్డ కుంగుబాటు, కాళేశ్వరం వైఫల్యాలు ఆ పార్టీని వదలకుండా వెంటాడుతున్నాయి. మేడిగడ్డ విషయంలో బీఆర్ఎస్ పూర్తిగా డిఫెన్స్ లో పడిపోయింది. ఎంతగా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం మేడిగడ్డ సందర్శనకు ఆహ్వానించినప్పుడు నిరాకరించిన బీఆర్ఎస్.. ఇప్పుడు అదే మేడిగడ్డ సందర్శనకు ముహూర్తం ఖరారు చేసింది. తన వైఫల్యాన్ని జనంలో మరోసారి భూతద్దంలో చూపే ప్రయత్నంగా బీఆర్ఎస్ మేడిగడ్డ సందర్శన కార్యక్రమాన్ని పరిశీలకులు అభివర్ణిస్తున్నారు.
సరిగ్గా ఎన్నికల ముందు.. ఏం చెప్పి ప్రజలను ఓట్లడగాలన్న విషయంలో స్పష్టత లేని అయోమయ స్థితిలో బీఆర్ఎస్ ఉంటే.. అధికార కాంగ్రెస్ కొలువుదీరిన ఈ మూడు నెలలలో అమలు చేసిన వాగ్దానాలను విస్తృతంగా ప్రచారం చేసుకోవడంతో పాటు, అధికారంలో ఉండగా బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతోంది. ఇక బీజేపీకి అయితే రామమందిరం ప్రధాన ప్రచారాస్త్రంగా ఉంది. ఏ అజెండా లేకుండా ఉన్న పార్టీ బీఆర్ఎస్ మాత్రమే. పార్టీ ఈ పరిస్థితిలో ఉన్నా కేసీఆర్ మౌనం వీడకపోవడంతో ఆయన నాయకత్వంపై పార్టీ నేతలే కాదు, క్యాడర్ కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.


.webp)
.webp)


