TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

బీసీలకు రిజర్వేషన్లు.. బీఆర్ఎస్సే అడ్డం.. అసెంబ్లీలో రేవంత్

Published on: Sun Aug 31, 2025 11:39AM

బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల విషయంలో తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు వీలుగా తెలంగాణ పురపాలక చట్టం-2019కు సవరణలు చేస్తూ రూపొం దించిన బిల్లును ప్రభుత్వం ఆదివారం  (ఆగస్టు 31) అసెంబ్లీలో ప్రవేశ పెట్టింది. ఈ బిల్లుపై చర్చలో పాల్గొన్న రేవంత్ రెడ్డి  స్థానిక సంస్థల ఎన్నికలను సెప్టెంబర్ 30లోపు పూర్తి చేయాలన్న హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో పురపాలక, పంచాయతీ రాజ్ చట్ట సవరణ   బీసీ రిజర్వేషన్ల విషయంలో బీఆర్ఎస్, గవర్నర్ తీరు కారణంగానే జాప్యం జరుగుతోందన్నారు.

గతంలో తమ ప్రభుత్వం బీసీలకు విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించడం కోసం రెండు బిల్లులను అసెంబ్లీలో ఆమోదించి గవర్నర్‌కు పంపిందని రేవంత్ గుర్తుచేశారు. అయితే.. గవర్నర్ వాటిని ఆమోదించకుండా రాష్ట్రపతి పరిశీలనకు పంపారనీ.. గత ఐదు  నెలలుగా ఆ బిల్లులు అక్కడే ఉన్నాయన్నారు. గత ప్రభుత్వం 2018, 2019లో తెచ్చిన పంచాయతీరాజ్, మున్సిపల్ చట్టాలు రిజర్వేషన్లకు గుదిబండగా మారాయనీ,  వాటిని సవరించేందుకు ఆర్డినెన్స్ తీసుకొస్తే..  దానిని కూడా గవర్నర్ రాష్ట్రపతికి పంపారనీ రేవంత్ వివరించారు.

ఈ విషయంపై ప్రధానిపై ఒత్తిడి తెచ్చేందుకు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తే, బీఆర్ఎస్ ఎంపీలు కనీసం అటువైపు కన్నెత్తి కూడా చూడలేదని విమర్శించారు. బీఆర్ఎస్ కు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడం ఇష్టం లేదనీ, అందుకే ఇప్పుడు కూడా సభలో గందరగోళం సృష్టిస్తూ బిల్లు ఆమోదం పొందకుండా అడ్డుకోవాలని చూస్తున్నారని రేవంత్ ధ్వజమెత్తారు.  బీసీలకు రిజర్వేషన్ల కల్పించేందుకు తీసుకువచ్చిన ఈ చట్ట సవరణ బిల్లుకు బీఆర్ఎస్ సహకరించకుంటే భవిష్యత్తులో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని రేవంత్ రెడ్డి హెచ్చరించారు.

మొదట బీసీల వివరాలు సేకరించే బాధ్యతను రాష్ట్ర బీసీ కమిషన్ కు అప్పగించామన్న ఆయన..  రాజ్యసభ సభ్యుడు ఆర్. క్రిష్ణయ్య పిటిషన్ పై హైకోర్టు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా  బీసీల వివరాలు సేకరించే బాధ్యతను డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేసి సర్వే నిర్వహించినట్లు వివరించారు.