మా ఆవిడకి రాజకీయాలొద్దు: బ్రదర్ అనిల్

 

 

బ్రదర్ అనిల్ తన ఒంటికి రాజకీయాలు సరిపడవని, కలుషితమయిన ప్రస్తుత రాజకీయాలలోకి రావాలని తానెప్పుడు కోరుకోవట్లేదని అన్నారు. ఇక, రాజకీయాలు పడవంటూనే, రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ పార్టీ స్పష్టమయిన వివరణ ఇవ్వాలని, ఉభయ ప్రాంత ప్రజలకి సమన్యాయం చేయాలని ఆయన కోరారు. ఇక వైయస్స్ కుటుంబ సభ్యులపై రాజకీయ కక్ష సాధింపులు కొనసాగుతున్నాయని, జగన్మోహన్ రెడ్డిని అన్యాయంగా జైలులో నిర్భందించడమే అందుకు ఉదాహరణ అని ఆయన అన్నారు. స్వర్గీయ వైయస్సార్ చేసిన సేవలు, మంచి పనుల వలన ఆయన కుటుంబ సభ్యులను దేవుడు తప్పక కాపాడుతాడని ఆయన విశ్వాసం వ్యక్తం చేసారు.

 

ఇక, పనిలోపనిగా అయన మరొక సంచలన ప్రకటన కూడా చేసారు. తన భార్య షర్మిల రాజకీయాలలో కలకాలం కొనసాగదని తెలిపారు. గత ఏడాదిగా ఆమె సుదీర్గ పాదయాత్ర చేసి, మళ్ళీ ఇప్పుడు బస్సు యాత్రకు సిద్దపడుతున్న తరుణంలో ఆయన ఈవిధమయిన ప్రకటన చేయడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. మరి ఆయన ఈ ప్రకటనకు షర్మిల ఆమోదం ఉందా లేదా? అనేది తెలియదు.

 

ఒకవేళ జగన్మోహన్ రెడ్డికి వచ్చే నెలలో బెయిలు దొరకకపోయినట్లయితే, అప్పుడు షర్మిలే పార్టీని నడిపించవలసి ఉంటుంది. మరి అటువంటప్పుడు ఆమె భర్త అనిల్ ఆమె రాజకీయాలలో కొనసాగదని ప్రకటించడం చాలా ఆశ్చర్యకరం. ఆమె రాజకీయాలలో కొనసాగడం అతనికి ఇష్టం లేక ఈవిధంగా అన్నారా? లేక పార్టీపై పట్టు కోసం కుటుంబం సభ్యుల మధ్య అంతఃకలహాలున్నట్లు వచ్చిన వార్తలు నిజమేనని ఆయన తన ప్రకటనతో దృవీకరిస్తున్నారా?

 

త్వరలో షర్మిల పార్టీలో కీలక భాద్యతలు నిర్వహించే అవకాశముందని అందరూ భావిస్తున్న తరుణంలో ఆమె అట్టే ఎక్కువ కాలం రాజకీయాలలో కొనసాగదని ఆమె భర్త ప్రకటించడం చాలా ఆశ్చర్యకరమే.