బ్రిజేష్ తీర్పుతో కాంగ్రెస్ కి కొత్త సంకటం

 

తమ అభిప్రాయాలతో నిమిత్తం లేకుండా రాష్ట్ర విభజన జరుగుతుండటంతో ఆత్మాభిమానం దెబ్బతిన్నసీమాంధ్ర ప్రజలకు ఇప్పుడు బ్రిజేష్ మిశ్రా ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు పుండు మీద కారం చల్లినట్లయింది. అదేవిధంగా తెలంగాణా ఇస్తామని చెపుతూనే రోజుకొక ప్రతిపాదనతో అనుమానాస్పదంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ పై రగిలిపోతున్న తెలంగాణావాదులు కూడా ఈ ట్రిబ్యునల్ తీర్పుతో ఒక్కసారిగా భగ్గుమన్నారు.

 

రాష్ట్ర విభజన కీలకదశ చేరుకొన్న ఈ తరుణంలో, రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగించే ఈ ట్రిబ్యునల్ తీర్పు వెలువడటంతో, అది ప్రతిపక్షాలకు ఆయుధంగా అందిరాగా, కేంద్ర, రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వాలకి ఊహించని విధంగా కొత్త ఇబ్బందులను సృష్టించింది. రాష్ట్రంలో రాజకీయ పార్టీలు బ్రిజేష్ ట్రిబ్యునల్ తీర్పుకి వ్యతిరేఖంగా పోరాటాలకి సిద్దం అవుతూనే, మరో వైపు దానిని కూడా రాజకీయం చేస్తూ ఒకరిపై మరొకరు బురద జల్లుడు కార్యక్రమం కూడా మొదలుపెట్టేసాయి.

 

ఇప్పటికే, రాష్ట్ర విభజన అంశంపై చేతులు కాల్చుకొని బాధపడుతున్న కాంగ్రెస్ అధిష్టానం, ఆ సమస్య నుండి గౌరవప్రదంగా బయటపడేందుకు దారులు వెదుకుతుంటే ఈ బ్రిజేష్ ట్రిబ్యునల్ తీర్పుతో మరో సరికొత్త సమస్య తలకు చుట్టుకొంది. అదికూడా సరిగ్గా అసెంబ్లీ మరియు పార్లమెంటు సమావేశాలు మొదలయ్యే ముందు ఈ తీర్పు వెలువడటంతో మరింత ఇబ్బంది తప్పదు.

 

రాష్ట్రం కలిసున్నపుడే ఇరుగుపొరుగు రాష్ట్రాలతో నీటి యుద్దాలు తప్పడంలేదని, విడిపోతే ఇక తెలుగు ప్రజలు కూడా ఒకరితో ఒకరు నీటి కోసం యుద్ధాలు చేసే పరిస్థితులు వస్తాయని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చేస్తున్న వాదనలకు బలం చేకూరుస్తున్నట్లు బ్రిజేష్ మిశ్రా ట్రిబ్యునల్ తీర్పు వెలువడటం, అది కూడ సరిగ్గా అసెంబ్లీ సమావేశాలకు ముందుగా వెలువడటంతో, ఆయన ఇదే అంశం ఆధారంగా అసెంబ్లీలో గట్టిగా వాదనలు వినిపించవచ్చును.

 

ఈ తీర్పు ఆధారంగా సమైక్యవాదం బలంగా వినిపిస్తున్నలగడపాటి వంటి యంపీలు సైతం పార్లమెంటులో గట్టిగా వాదించవచ్చును. అయితే, పెద్ద పెద్ద కుంభకోణాలు బయటపడినప్పుడే ఏ మాత్రం చలించని కాంగ్రెస్ పార్టీ, ఇటువంటి అంశాలకు భయపడే అవకాశం లేదు. దానికి ఇదొక ఇబ్బందే తప్ప అవరోధం కాబోదు.