పక్షపాత వైఖరి ప్రదర్శించిన బ్రిజేష్ మిశ్రా ట్రిబ్యునల్

 

ఈ రోజు కృస్ణా జలాల వివాదంపై ఏర్పాటయిన బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ తుది తీర్పు వెలువరిస్తూ రాష్ట్రానికి తీరని అన్యాయం చేసింది. రాష్ట్రానికి మొత్తం 1001 నుంచి 1005 టీఎంసీలను కేటాయించగా, ఆర్డీఎస్ కుడి కాలువకు 4 టీఎంసీలు కేటాయించింది. కర్ణాటక ప్రభుత్వం అక్రమంగా పెంచిన ఆల్మట్టి డ్యాం ఎత్తుకి ట్రిబ్యునల్ ఆమోదముద్ర కూడా వేసింది. నీటి లభ్యత ప్రమాణికతను 75 శాతం నుండి 60శాతానికి కుదించడం ద్వారా ఆల్మట్టి డ్యాంలో 548 టీ.యంసి.లు నీళ్ళు కర్నాటకకు అదనంగా దక్కేలా చేసింది. ప్రభుత్వం అసమర్ధత, అశ్రద్ద వెరసి రాష్ట్రానికి కృష్ణా నది మిగుల జలాలో న్యాయబద్దంగా దక్కవలసిన వాటా కోల్పోయేలా చేసింది.

 

సాధారణంగా దేశంలో వివిధ రాష్ట్రాల మధ్య నదీ జలాల పంపకానికి 75 శాతం నీటి లభ్యతని ప్రామాణికంగా తీసుకొని వాటాలు పంచుతారు. అయితే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ దానిని మరో 15 శాతం తగ్గించి 60శాతంగా నిర్ణయించడంతో గతంలో 2030 టీ.యంసి.గా ఉండే ఈ పరిమితి ఇప్పుడు 2578 టీ.యంసి.గా మార్చబడింది. ఇంతవరకు 2030 టీ.యంసి.గా అదనంగా ఉన్న నీటిని మనం రాష్ట్రం వాడుకొనేవీలు ఉండేది. కానీ కర్ణాటక ప్రభుత్వం గతంలో ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచడం వలన దానిని నీటి నిలువ సామర్ధ్యం కూడా పెరిగింది. ఇప్పుడు ట్రిబ్యునల్ కనీస నీటి లభ్యతని 60శాతంగా మార్చడంతో ఇప్పుడు కర్నాటకకు మరో 548 టీ.యంసి.లు నీళ్ళు ఆయాచితంగా దక్కాయి.

 

అందువల్ల ఇప్పుడు 2578 టీ.యంసి.లకు అదనంగా డ్యాం లో నీళ్ళు ఉన్నపుడే అవి మిగులు జలాలుగా పరిగణింపబడుతాయన్నమాట. ఆ పైన ఉండే నీటిని మాత్రమే మన రాష్ట్రం వాడుకొనే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మిగులు జలాలపై హక్కుల కోసం మన ప్రభుత్వాలు గట్టిగా కోరకపోవడంతో, వాటిపై కూడా కర్నాటక హక్కులు కోరే అవకాశం చేజేతులా కల్పించారు.

 

ఇక మరో చేదు నిజం ఏమిటంటే ఈ మిగుల జలాల లెక్కల మీదనే ఆధారపడి జలయజ్ఞం కింద కృష్ణా బేసిన్‌లో రూ.32 వేల కోట్లతో మొదలుపెట్టిన ప్రాజెక్టుల భవితవ్యం నేటి ట్రిబ్యునల్ తీర్పుతో ప్రశ్నార్థకంగా మారబోతోంది. అటు నీళ్ళు పోగొట్టుకొన్నాము, ఇటు వేల కోట్ల ప్రజాధనం వ్యయం చేసి కట్టిన ప్రాజెక్టులు పనికిరాకుండా పోయే ప్రమాదం ఉంది.

 

గతంలో ప్రభుత్వం బ్రిజేష్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుకి వ్యతిరేఖంగా సుప్రీం కోర్టుని ఆశ్రయిస్తే, ట్రిబ్యునల్ తుది తీర్పు వెలువడిన తరువాత మళ్ళీ రమ్మని పంపించేసింది. గనుక మళ్ళీ ఇప్పుడు న్యాయం కోరుతూ ప్రభుత్వం సుప్రీం కోర్టుని ఆశ్రయించ వలసి ఉంటుంది. అయితే రాష్ట్రం విడిపోతున్న ఈ తరుణంలో ప్రభుత్వం ఆ పనిచేస్తుందని ఆశించలేము. ఇప్పుడు మన రాష్ట్రం కూడా రెండుగా విడిపోతున్నందున మున్ముందు తెలంగాణాలో మరి కొన్ని ప్రాజెక్టులు లేస్తే ఇక దిగువనున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎన్ని నీళ్ళు వస్తాయో ఊహించుకోవచ్చును.