శ్వాసని పరీక్షిస్తే షుగర్ తెలిసిపోతుంది

50 ఏళ్ల నాగలక్ష్మిగారికి తనకి షుగర్‌ ఉందేమో అని అనుమానం. తను తరచూ వినే షుగర్‌ వ్యాధి లక్షణాలన్నీ తనలో కనిపించడమే ఆ భయానికి కారణం. అలాగని షుగర్‌ పరీక్ష చేయించుకుందామా అంటే ఆమె రక్తమంటే చచ్చేంత భయం. ఒకసారి ఎలాగొలా షుగర్ పరీక్ష చేయించుకున్నా, అది ఉందని తేలితే నెలనెలా చారెడు రక్తం పరీక్షల కోసం ధారపోయాల్సిందే కదా!

 

ఇది కేవలం ఒక్క నాగలక్ష్మిగారి బాధే కాదు. మన దేశంలో చాలామంది తమకు షుగర్‌ ఉందన్న అనుమానం ఉన్నా కూడా, పరీక్షలు చేయించుకోకుండా అశ్రద్ధ వహించడానికి ముఖ్య కారణం ఈ రక్త పరీక్షలే! కానీ అలాంటివారికి ఓ శుభవార్త వచ్చేసింది. ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయానికి చెందిన కొందరు పరిశోధకులు ఇప్పుడు శ్వాస ఆధారంగా షుగర్ పరీక్ష చేసే యంత్రాన్ని రూపొందించే ప్రయత్నంలో ఉన్నారు.

 

ఇప్పుడు ప్రతి రోడ్డు మీదా ఎర్రలైటు పడినప్పుడు ‘బ్రీత్‌ ఎనలైజర్లు’ పట్టుకొని పోలీసులు పరీక్షలు నిర్వహించడం చూస్తున్నాం. రక్తంలో కలిసిన ఆల్కహాల్‌ శాతాన్ని తెలుసుకోవడం తేలిక కనుక ఈ ప్రక్రియ చాలా సులభంగా సాగిపోతోంది. కానీ డయాబెటిస్‌ అలా కాదు. మన తీసుకునే ఆహారం, నీరు వంటి చాలా పదార్థాల వల్ల, కేవలం శ్వాస ద్వారానే డయాబెటిస్‌ ఉందా లేదా అన్నది తెలుసుకోవడం కష్టం. అందుకోసం శాస్త్రవేత్తలు ఒక ఉపాయాన్ని ఆలోచించారు.

 

 

డయాబెటిస్ ఉన్న వ్యక్తులలో జీవక్రియ (మెటాబాలిజం) చాలా అస్తవ్యస్తంగా ఉంటుంది. దీని వలన ఎసిటోన్‌ అనే తరహా రసాయనం అధికమొత్తంలో రక్తంలో పేరుకుపోతూ ఉంటుంది. శ్వాస ద్వారా ఈ ఎసిటోన్ నిల్వలు తెలుసుకునేందుకు ప్రయత్నించారు పరిశోధకులు. అలా తీసుకున్న ఎసిటోన్‌ను ఇన్‌ఫ్రారెడ్‌ లేజర్ కిరణాలతో పరీక్షించి షుగర్‌ నిల్వల స్థాయిని గ్రహించే ప్రయత్నం చేశారు. ఈ తతంగం అంతా పూర్తి చేసేలా ఒక యంత్రాన్ని రూపొందించారు. ఈ యంత్రం ద్వారా వివిధ వ్యక్తుల శ్వాసని పరీక్షించినప్పుడు, వారి షుగర్‌ నిల్వలను దాదాపు ఖచ్చితంగా తెలిశాయి.

 

శ్వాస ద్వారా షుగరు నిల్వలను తెలుసుకోవడం అనేది భారతీయులకు నిజంగా శుభవార్తే! ఎందుకంటే భారతీయులలో దాదాపు ఆరుకోట్ల మంది డయాబెటిస్‌తో బాధపడుతున్నారు. ఈ సంఖ్య అంతకంతకూ పెరిగిపోయే ప్రమాదం లేకపోలేదు. జన్యుపరంగా డయాబెటిస్‌ సంక్రమించే అవకాశం ఎక్కువగా ఉండటం, మన జీవనశైలి మరీ యాంత్రికంగా మారిపోవడం, బియ్యం వంటి చక్కెర ఎక్కువగా ఉన్న ఆహారం మీద ఆధారపడటం వంటి కారణాల వల్ల మన భారతీయులలో డయాబెటిస్ ముప్పు ఎక్కువ. నిజంగానే శ్వాస ద్వారా షుగర్‌ వ్యాధిని తెలుసుకునే పరికరం అందుబాటులోకి వస్తే అశ్రద్ధ చేయకుండా, ఎప్పటికప్పుడు తగిన చికిత్స తీసుకునేవారి సంఖ్య పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.

 

ఒకవేళ ఆక్స్‌ఫర్డ్‌ పరిశోధకులు రూపొందిస్తున్న ఈ యంత్రం సఫలం కాకపోయిన భయం లేదు. ఎందుకంటే కేంబ్రిడ్జికి చెందిన కొందరు పరిశోధకులు ‘ఇసోప్రిన్‌’ అనే మరో రకం రసాయనంతో శ్వాసతో షుగర్‌ని కొలిచే యంత్రాన్ని కనుగొనే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికి ఒక దశాబ్దంలోగా శ్వాసతో షుగర్‌ పరీక్ష అనే కల నిజం కావచ్చు. అప్పుడు నాగలక్ష్మిగారే కాదు ప్రతి ఒక్కరూ షుగర్‌ పరీక్ష చేయించుకునేందుకు ముందుకు వస్తారు. ప్రభుత్వమే సామూహికంగా ఉచితంగా షుగర్‌ పరీక్షలు నిర్వహించే అవకాశమూ ఉంటుంది.

- నిర్జర.