బ్రహ్మానందాన్ని పూరీ పక్కన పెట్టాడా?

 

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో యంగ్ టైగర్ జూ.యన్టీఆర్ నటిస్తున్న ‘టెంపర్’ సినిమా త్వరలో విడుదల కాబోతోంది. ఆ సినిమా టైటిల్ 'టెంపర్' పేరు వింటేనే అదొక యాక్షన్ సినిమా అని అర్ధమవుతోంది. అందులో తను చాలా కసితో పనిచేశానని యన్టీఆర్ చెప్పారు. కానీ ఎంత కసిగా చేసినా ఇప్పుడు సినిమాలలో కామెడీ, అందునా బ్రహ్మానందం లేకపోతే అది ఎంత గొప్పగా ఉన్న ప్రేక్షకులను మెప్పించడం కష్టం. అందుకే అందరు దర్శకులు తమ సినిమాలలో కామెడీకి చాల ప్రాధాన్యం ఇస్తున్నారు. కానీ ‘టెంపర్’లో బ్రహ్మానందాన్ని పక్కనబెట్టి యాక్షన్ హీరోగా పేరు పొందిన యన్టీఆర్ చేతనే కామెడీ కూడా చేయించేస్తున్నాడు పూరి.

 

యన్టీఆర్ యాక్షన్ హీరో అయినప్పటికీ అతను కూడా మంచి కామెడీ చేయగలదని తన ‘అదుర్స్’ సినిమాలో చూపించాడు. బహుశః అందుకే దర్శకుడు పూరీ జగన్నాథ్ పూర్తిగా యన్టీఆర్ మీదనే ఆధారపడి యాక్షన్, కామెడీ రెండూ కూడా చేయించేయాలని ప్రయత్నిస్తున్నట్లుంది. కానీ అదుర్స్ సినిమాలో ఒక్క యన్టీఆర్ వల్లనే కామెడీ పండలేదు. బంగారానికయినా గోడ చేర్పు అవసరమన్నట్లుగా యన్టీఆర్ పక్కన బ్రహ్మానందం అతని గురువుగారిగా వేయడంతో వారి కామెడీ అద్భుతంగా పండింది. ఇక వారిరువురికీ యం.యస్. నారాయణ, రఘుబాబు వంటి వారందరూ చేరి అత్యద్భుతంగా కామెడీ పండించారు. నిజానికి ఆ సినిమాకి అటువంటి గొప్ప కామెడీ ట్రీట్ మెంట్ ఇవ్వకపోయి ఉంటే అదొక పాత మూస సినిమాగా తేలిపోయి ఉండేది.

 

మరి కామెడీకి దానికి మారుపేరుగా ఉన్న బ్రహ్మానందానికీ ఉన్న ప్రాధాన్యత గురించి తెలిసీ కూడా మరి పూరీ జగన్నాథ్ యన్టీఆర్ తో ఎందుకు ఆడుకొంటున్నాడో తెలియదు. కానీ ఈ సినిమా కూడా ఫెయిల్ అయితే ఇరువురికీ చెడ్డ పేరే వస్తుంది. పైగా ఫ్లాపులతో సతమతమవుతున్న వారిరువురికీ చాలా పెద్ద దెబ్బే అవుతుందని సినీ పండితులు అభిప్రాయ పడుతున్నారు.

 

ఇక బ్రహ్మానందాన్ని పక్కనబెట్టి యాక్షన్ హీరో చేత కామెడీ చేయించి అభాసుపాలయితే సినీ పరిశ్రమలో అది మరీ కామెడీగా ఉంటుంది. బ్రహ్మానందానికి డేట్స్ కుదరకనో, లేకపోతే ఆయన అడిగినంతా ముట్టజెప్పకపోవడం వలననో లేక మరే ఇతర కారణాల చేతనో ఆయనని పూరీ పక్కన బెట్టి ఉండవచ్చును. కానీ ఆయనకీ లక్కీ స్టార్ అని చెప్పుకొనే ఆలీని కూడా ఎందుకో పక్కనబెట్టేసారు ఈసారి.

 

మరి ఇదంతా ఎవరి ‘టెంపర్’ వల్ల జరుగుతోందో తెలియదు కానీ మళ్ళీ పూరీ-బ్రహ్మానందం-ఆలీ కాంబినేషన్ లో సినిమా ఎప్పుడు వస్తుందా అని జనాలు ఎదురు చూసే పరిస్థితి వచ్చింది. ప్చ్!