అంబేద్కర్... ఆ పేరే ఒక ప్రే"రణం"

 

అంబేద్కర్… ఈ పేరు వినగానే మీకు ఏం గుర్తుకు వచ్చింది? దళితులు, వారిపై జరిగిన అంటరానితనపు అమానుషం, దానికి వ్యతిరేకంగా జీవిత కాలం పోరాడిన ఒక మహానాయకుడు… ఇంతే కదా? కాని, అంబేద్కర్ అంత మాత్రమే కాదు. అంబేద్కర్ ఓ అద్భుతం! అంబేద్కర్ ఓ పోలికంటూ లేని అనుపమానం!

 

డాక్టర్ భీమ్ రావ్ రామ్ జీ అంబేద్కర్… ఓ రణం మాత్రమే కాదు… ప్రేరణం కూడా! అదీ కేవలం దళితులకి మాత్రమే కాదు… అన్ని కులాల వారికి! అన్ని వర్గాల వారికి! ఎక్కడున్న వారైనా సరే… అందరికీ! అంతటి విభిన్న కోణాల విశిష్ట వ్యక్తిత్వం మన రాజ్యాంగ నిర్మాతది!

 

అంబేద్కర్ అంటే దళితవాదం నుంచి బయటకి వచ్చి చూడాలి. అప్పుడే ఆయనెవరో మనకు పూర్తిగా తెలిసేది. మరీ ముఖ్యంగా అంబేద్కర్ మనకు అందించే ప్రేరణ కనిపించేది కూడా అప్పుడే! ఒక అత్యంత పేద కుటుంబం… అందులో పద్నాలుగురు పిల్లల్లో తానొకరు. పైగా అంటరానితనపు దారుణమైన సంకెళ్లు. అయినా అంబేద్కర్ రెక్కల్ని విధి విజృంభింపజేసిన ఈ తుఫానులేవీ … విరిచేయలేకపోయాయి. ఆయన తన గ్రామంలోని దళిత వాడ నుంచి ఏకంగా లండన్ విశ్వవిద్యాలయాల వరకూ దీక్షతో , దక్షతతో ఎగిరాడు. ఎదిగాడు.

 

 

ఈనాటికీ అంబేద్కర్ ప్రతీ పేదవాడికి అందించే జీవిత సూత్రం దీక్షా, దక్షతలే! పట్టుదలతో చదివితే జీవితంలో ఉత్తీర్ణులు కావొచ్చు! బతుకు పరీక్షల్లో వందకు వంద మార్కులు తెచ్చుకోవచ్చు! అంబేద్కర్ ను మొత్తం సమాజం ఏకమై అడ్డుకున్నా ఆయన దూసుకుపోయాడు. దానికి కారణం తీక్షణమైన మేధాస్సు, దానితో సాధించిన చదువు. మనం మహానేతలని తలుచుకునే గాంధీ, నెహ్రుల కంటే అంబేద్కర్ ఎన్నో డిగ్రీలు, పీజీలు, పీహెచ్ డీలు ఎక్కువగా చేశారు. ఆయన ఎకనమిక్స్ లో మహాపండితుడు. అయినా కూడా మన వారు ఎందుకనో నెహ్రునే పండిత్ జీ అన్నారు గాని అంబేద్కర్ ని కాదు! నిజానికి బహుశాస్త్ర పండితుడు అంబేద్కర్!

 

అంబేద్కర్ నుంచి చదువుని అస్త్రంగా, శస్త్రంగా చేసుకుని జీవన రణరంగంలో గెలవటమే కాదు… ఇంకా చాలా నేర్చుకోవచ్చు! ఆయన రాసిన రాజ్యాంగం ఇవాళ్ల నూటా ఇరవై కోట్ల పై చిలుకు భారతీయుల తల రాతల్ని నిర్ధేశిస్తోంది! అదీ విజయం అంటే… ఆయన నుదుటన చిన్నప్పుడు చెడు రాత రాసిన సమాజానికి…తాను చనిపోయేలోగా ఆయన సరికొత్త రాత రాశాడు! 

 

మనం ఏ పాకిస్తాన్ లానో అరాచకంలో కూరుకుపోలేదు. మనకు దేశంపైనా, వ్యవస్థపైనా, ఆ మాటకొస్తే అంబేద్కర్ రాసిన రాజ్యాంగంపైన కూడా అసంతృప్తి వుండవచ్చు. కాని, ఆయన రాసిన ఆధునిక ప్రజాస్వామ్య వేదం ఎంత గొప్పదంటే ఇంత విశాలమైన , విస్తృమైన భారత ఉపఖండం అరవై ఏళ్ల తరువాత కూడా దాని వల్లే భద్రంగా వుంది. ఇది చేసిన రాజ్యాంగ రచయితని ఎలా సామాన్యుడు అనగలం?

 

రాజ్యాంగం లాంటి చారిత్రక అవసరం తీర్చిన అంబేద్కర్ నుంచి సామాన్యులు కఠోర శ్రమని నేర్చుకోవచ్చు! అంతటి మహత్తర కార్యం అంత గొప్పగా మరొకరెవరూ చేసి వుండేవారు కాదు! అంతే కాదు, అంబేద్కర్ అంకిత భావం స్వాతంత్ర్యానికి ముందు, తరువాత కూడా అడుగడుగునా మనకు కనిపిస్తుంది!

 

ఇవాళ్ల మన ఇళ్లలో విద్యుత్ వెలుగులు గొప్పగా వెలిగిపోతున్నాయి. వాట్ని రాజేసింది అంబేద్కరే! ఇండియాలో గ్రిడ్ విధానంలో విద్యుత్ సరఫరా జరగటానికి, పవర్ సప్లై వ్యవస్థ ఏర్పడటానికి అంబేద్కర్ కృషి ఎంతో వుంది. ఆయన వల్లే దామోదర్ వ్యాలీ ప్రాజెక్ట్, హీరాకుడ్ ప్రాజెక్ట్ లాంటి ఎన్నో పెద్ద పెద్ద కట్టడాలు సాకారమయ్యాయి.

 

అంబేద్కర్ వల్లే భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఏర్పడింది. ఆయన వల్లే దేశంలోని కోట్లాది కార్మికులు క్షేమంగా వుంటున్నారు. ఆయన రూపొందించిన లేబర్ లాసే నేటీకి మన సమాజాన్ని నిర్ధేశిస్తున్నాయి!

 

అంబేద్కర్ గురించి చెబుతూ పోతే గ్రంథాలు నిండిపోతాయి… గ్రంథాలయాలు చోటు చాలక ఇరుకైపోతాయి… కాని, ఒక్కటి మాత్రం నిజం! అంబేద్కర్ ఓ ఉద్యమకారుడు కాదు! ఆయనే ఓ మహోద్యమం! ఎన్ని పార్శ్వాల్లో చూస్తే అన్ని విభిన్నత్వాలతో దర్శనమిస్తాడు! అంత ప్రేరణ కూడా ఇస్తాడు!

 

సూర్యుడు సహజంగా అయితే చెమటలు పట్టిస్తాడు. కాని, భక్తిగా మొక్కే వారికి భగవంతుడిలా కనిపిస్తాడు. తెలివిగా వాడుకునే వారికి సౌర విద్యుత్ లా పనికి వస్తాడు! అంబేద్కర్ అలాంటి ఓ సూర్యుడే! ఆయన దేవుడంటూ మొక్కే వారు చాలా మందే వుండొచ్చు! లేదంటే ఆయన దేవుడని ప్రచారం చేసి ప్రసాదాలు మింగేసే వారూ వుండొచ్చు! వాళ్లని పక్కన పెడదాం… అంబేద్కర్ అనే సూర్యుడి నుంచి ప్రేరణ అనే సౌర విద్యుత్ ధగధగ వెలుగుల్ని మన గుండెల్లో నింపుకుందాం! అంబేద్కర్ కూడా ఓ గాంధీ, ఓ నెహ్రు, ఓ పటేల్, ఓ బోస్ లాంటి ‘అందరివాడని’ నిరూపిద్దాం!   


..Jaisimha Chaturvedi