ఆ  త‌ల్లి  ప్రేమ ఆకాశ‌మంత‌!

చంద‌మామ రావే.. జాబిల్లి రావే.. వెన్న‌ముద్ద తేవే.. అంటూ చంటిపిల్ల‌ల‌కు ప్ర‌తీ త‌ల్లి పాల‌బువ్వ పెడుతుంది. అదో ఆనందం, అదో అనిర్వ‌చ‌నీయ అనుభూతి. పిల్ల‌ల‌కు చంద్రుడిని చూపించ‌డం అందులో పిల్లి ఉంద‌ని క‌థ‌లు చెప్ప‌డం మాత్రం త‌రాలు మారినా ఆ క‌థ‌లు మాత్రం మార‌వు. అదుగో అలా క‌థ‌లు వినే ఉంటాడు మాథ్యూ గాల‌గ‌ర్‌. అత‌నికి చంద‌మామ అంటే మ‌హా యిష్టం. పెద్ద‌య్యాక చంద్రుడి మీద‌కి వెళ్లి నిజంగానే పిల్లితో ఆడాల‌ని మ‌హాకోరిక‌. కానీ అనుకున్న‌వేవీ జీవితంలో జ‌ర‌గ‌వు. జ‌ర‌గాల్సిన‌వే జ‌రుగుతాయి. మాథ్యూకీ అంతే. అత‌ని ప‌ద‌కండో ఏట జ‌బ్బు చేసి చ‌నిపోయాడు. అత‌ని త‌ల్లి కోరీ మాత్రం ఆకాశం వేపు చూసిన‌పుడ‌ల్లా పోనీ అక్క‌డ‌కి వెళ్లాల‌నే వెళ్లాడ‌నే అనుకుంటోంది.. దుఖాన్ని మింగుతూ. పిల్లాడి చితాభ‌స్మాన్ని చంద్రుడి మీద‌కి పంప‌డానికి సిద్ధ‌ప‌డింది కోరి. వ‌చ్చే ఏడాది ఆమె కోరిక ఫ‌లించ‌వ‌చ్చు.

ఫ్లారిడాకి చెందిన స్కాట్‌, కోరి ల పిల్ల‌వాడు మాథ్యూ. పిల్లాడు ఊహించ‌నివిధంగా ప‌ద‌కండేళ్ల‌కే క‌నుమూశాడు. వారి దుఖానికి అంతే లేదు. వాడికి అంత‌రిక్షం, చంద‌మామ గురించి తెలుసుకోవ‌డం మ‌హా స‌ర‌దాట‌. వాడు మ‌మ్మ‌ల్ని విడిచి చంద‌మామ‌తో ఉండ‌డానికే ముందుగా వెళిపోయాడు.. అంటున్నారు మాథ్యూ బంధుగ‌ణం. అయితే వాడి చితాభ‌స్మం పంపితే మేము వాడిని పంపిన‌ట్ట‌వుతుంద‌ని ఆ త‌ల్లిదండ్రులు భావిస్తున్నారు. 

అయితే అలా మ‌నిషి అయినా, చితాభ‌స్మం పంపించాల‌న్నా చాలా క‌ష్టం. దానికి భ‌రించ‌లేని ఖ‌ర్చ‌వుతుంది. కానీ మాథ్యూ ప‌ట్ల ఆ త‌ల్లిదండ్రుల ప్రేమ కంటే అదేమంత పెద్ద ఖ‌ర్చుకాదు. కోరీ మాత్రం ఆమె బంధువులు, స్నేహితులు చెప్పిన‌ట్లు  ఆర్దిక స‌హాయం చేసేవారిని తిర‌స్క‌రించ‌వ‌ద్ద‌నే అనుకుంది. నాసా వారి స్పేస్ ఎక్స్‌లో పంప‌డానికి ఏర్పాట్ల గురించి నెట్‌లో స‌మాచా రాన్ని సేక‌రించింది. సంబంధిత అధికారుల‌ను క‌లిసింది. లూనా ప్ల‌యిట్‌లో పంపాల‌ని నిశ్చ‌యించుకున్నారు. కానీ దానికి 12,500 డాల‌ర్లు అవుతుంది. ఆ సంగ‌తి తెలుసుకుని మాథ్యూ బంధువులు, స్నేహితులు, కోరి దంప‌తుల  స్నేహితులు అంద‌రూ తోచినంత ఎక్కువగానే స‌హాయం చేశారు. 

ఇప్ప‌టికి 14వేల డాల‌ర్లు స‌మ‌కూరాయి. ఫ్ల‌యిట్ వ‌చ్చే ఏడాది వెళుతుంది. మా పిల్ల‌వాడి బంగారు క‌ల వ‌చ్చే ఏడాది ఫ‌లించ‌నుంది అని స్కాట్ అంద‌రితో చెబుతున్నాడు.  అన్ని స‌న్న‌ద్ధం చేశారు. చితాభ‌స్మాన్ని పంప‌డ‌మంటే పిల్లాడి ఆశ‌లు ఫ‌లించిన‌ట్టేన‌ని కోరీ అన్న‌ది. ఇంత‌కంటే ఏ త‌ల్లీ ప్రేమ‌ను ప్ర‌క‌టించ‌లేదేమో!

Online Jyotish
Tone Academy
KidsOne Telugu