బొత్స హడావుడి దేనికో

 

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అధిష్టానాన్నిధిక్కరించి మరీ చేస్తున్న సమైక్యవాదనతో సీమంధ్రలో ఆయన రేటింగ్స్ అమాంతం పెరిగిపోవడంతో, అనేక మంది మంత్రులు కలవరపడుతున్నారు. తాము ఎంత ప్రయత్నించినా ప్రసన్నం చేసుకోలేని ఉద్యోగులను, ముఖ్యమంత్రి ఒకే ఒక మీడియా సమావేశం నిర్వహించి తన వైపుకి తిప్పుకొంటున్నరనే దుగ్ధ వారి మనసులో ఉంది. ఒకవైపు అధిష్టానం నిర్ణయంతో తమ రాజకీయ భవిష్యత్ అగమ్యగోచరంగా మారుతుంటే, మరోవైపు కిరణ్ కుమార్ రెడ్డి తమ అందరినీ కలుపుకొని పోకుండా ఒంటరిగా తన సమైక్యవాదంతో తన ఇమేజ్ పెంచుకోవడం చాల మందికి జీర్ణం కావడం లేదు. అందుకే ఇటీవల కొందరు సీమంధ్ర మంత్రులు ప్రత్యేక సమావేశం అవడం, గవర్నర్ ను కలవడం వంటివి మొదలయ్యాయి.

 

ఎప్పటికయినా ముఖ్యమంత్రి కావాలని కలలుకంటున్నబొత్స సత్యనారాయణ, ఇంతకాలం ఏమిచేయాలో పాలుపోక చేతులు ముడుచుకొని కూర్చొన్నపటికీ, ఇంకా అలాగే కూర్చొంటే తన రాజకీయ భవిష్యత్ కూడా అగమ్యగోచరంగా మారుతుందని గ్రహించి రంగంలోకి దూకారు. ఇంతవరకు శాసన సభ్యులను రాజీనామాలు చేయవద్దని వారిస్తూ వచ్చిన ఆయనే స్వయంగా (కేవలం మంత్రి పదవికే) రాజీనామా చేసేసి, ప్రజలలో తన పొలిటికల్ రేటింగ్ పెంచుకోవాలని భావించారు. అయితే మళ్ళీ ఎందుకో మనసు మార్చుకొన్నట్లు సమాచారం.

 

అయితే ఏదో ఒక హడావుడి చేస్తే తప్ప మనుగడ కష్టమని గ్రహించిన ఆయన సోనియా గాంధీకి లేఖ వ్రాసి మీడియాను ఆకట్టుకొన్నారు. రాష్ట్రంలో పరిస్థితి చేయి దాటిపోయేలా ఉందని, కనుక “టీ-నోట్ క్యాబినెట్ సమావేశంలో ప్రవేశ పెట్టక మునుపే” అంటోనీ కమిటీని రాష్ట్ర పర్యటనకు పంపవలసిందిగా ఆయన తన లేఖలో సోనియమ్మను అభ్యర్దిoచారు. అంతే గాక నేరుగా పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్-చార్జ్ దిగ్విజయ్ సింగ్ తో హాట్ లైన్లో మాట్లాడి ఆయనను సూత్రప్రాయంగా అంగీకరింపజేసినట్లు కూడా వార్తలకెక్కారు.

 

“టీ-నోట్ క్యాబినెట్ సమావేశంలో ప్రవేశ పెట్టక మునుపే” అనే షరతు లేదా విన్నపాన్నికాంగ్రెస్ అధిష్టానం గనుక మన్నిస్తే, ఆయన కూడా ‘రాష్ట్ర విభజనకు (ఆపలేకపోయినా) బ్రేకులేసిన హీరో’గా ప్రజల ముందుకు రాగలిగే అవకాశం ఉంటుంది. అందువల్ల ఇక కాంగ్రెస్ పార్టీలో కొనసాగాలనుకొనే మిగిలిన మంత్రులు కూడా, తమ రాజకీయ మనుగడ కోసం ఎవరికి తోచిన మార్గాలను వారు అన్వేషించుకోక తప్పదు.