దట్ ఈజ్ బొత్స

 

ఇంతకాలం రాష్ట్ర విభజనపై తన అభిప్రాయం చెప్పకుండా ఈ అంశం కేంద్రం పరిధిలో ఉందని చెప్పుకొస్తూ రోజులు దొర్లించేసిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, మొన్న కోర్ కమిటీ సమావేశంలో సమైక్యాంధ్రకి అనుకూలంగా గట్టిగా వాదించడంతో, ఇంతవరకు ఆయన చుట్టూ తిరిగిన పార్టీలోని తెలంగాణా నేతలు ఇప్పుడు తెరాస, టీ-జేయేసీల విమర్శలకు జడిసి ఆయనతో కలిసి మీడియా ముందుకి రావడానికి కూడా భయపడుతున్నారు.

 

ఇటువంటి సమయంలో చాలా తెలివిగా మసులుకొనే బొత్స సత్యనారాయణ, బహుశః తెలంగాణా వాదుల దాడి నుండి తప్పించుకోవడానికి రాష్ట్రం విభజిస్తే నక్సలిజం పెరిగిపోతుందని ముఖ్యమంత్రి అభిప్రాయంతో తానూ విభేదిస్తున్నానని మీడియాకు చెప్పుకొన్నారు. తద్వారా తాను కూడా తెలంగాణా వాదుల వాదనలతో ఏకీభవిస్తున్నానని చెప్పకనే చెపుతూ వారు తనమీదకు అస్త్రాలు ఎక్కుపెట్టకుండా జాగ్రత్తపడ్డారు.

 

పనిలోపనిగా సమైక్యవాదులను కూడా మంచి జేసుకోవడానికి, పెద్ద పెద్ద పరిశ్రమలన్నీ కేవలం హైదరాబాదులోనే స్థాపించబడటం వలన రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాలు ఏమాత్రం అభివృద్దికి నోచుకోకుండా చాలా వెనుకబడిపోయాయని, అయితే పరిస్థితులు ఇంతవరకు వచ్చిన తరువాత ఇప్పుడు దీని గురించి ఆలోచించడం వల్ల ఏ ఉపయోగమూ ఉండదని, అందువల్ల రాష్ట్ర విభజన అనివార్యమయితే, హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించి, సీమంధ్రకు రాజధాని ఏర్పాటు చేసుకొని, కొత్త రాష్ట్రం అన్నివిధాల స్థిరపడేవరకు అంటే కనీసం ఓ 20సం.ల పాటు హైదరాబాద్‌ను ఉమ్మడి రాష్ట్రంగా ఉంచాలని కోరినట్లు ఆయన చెప్పుతున్నారు.

 

బొత్స రాజకీయంగా చాలా చక్కగా వ్యవహరిస్తున్నారని అంగీకరించక తప్పదు. అయితే, రాష్ట్ర ప్రభుత్వంలో, పార్టీలో గత నాలుగేళ్ళుగా కీలకమయిన బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆయన మరి ఈ నాలుగేళ్ళ కాలంలోతన విజయనగరం జిల్లా అభివృద్దికి ఎన్ని కొత్త పరిశ్రమలు, విద్యా సంస్థలు, ఆసుపత్రులు, మౌలిక వసతులు తీసుకు వచ్చారని ప్రశ్నిస్తే అందుకు సమాధానం ఉండదు. కానీ ఆయన కూడా రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాలు వెనుకబడిపోయాయని బాధపడటం విడ్డూరం.