బొత్స నాలుకకు నరం ఉందా?

 

మూడు నాలుగు రోజుల క్రితం రాష్ట్ర విభజన కొరకు రోడ్డు మ్యాప్ చేతిలో పట్టుకొని డిల్లీలో రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులందరినీ కలుస్తూ హడావుడిగా తిరిగిన పీసీసీ అధ్యక్షుడు బొత్ససత్యనారాయణ, నిన్నతిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ “రాష్ట్రం విడిపోకుండా కలిసి ఉండాలని తానూ దేవుడ్ని ప్రార్దించినట్లు” తెలిపారు. “కేవలం కొంత మంది రాజకీయ నేతలకి మంత్రి పదవులు ఏర్పాటు చేసేందుకే రాష్ట్ర విభజన జరుగుతున్నట్లయితే, నేను నా మంత్రి పదవిని, పీసీసీ అధ్యక్ష పదవిని కూడా వదులుకోవడానికి సిద్దం. కుటుంబ పెద్ద తన కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఉండాలని కోరుకొంటున్నట్లే రాష్ట్రం సమైక్యంగా ఉండాలని నేను కోరుకొంటున్నాను. అయితే, అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటాను.” అని అన్నారు.

 

ఇంత కాలం “హిందీ వాళ్ళకు పది రాష్ట్రాలుండగా తప్పు లేనిదీ, తెలుగు వాళ్ళకు రెండు రాష్ట్రాలుంటే తప్పేమిటి?” అని వాదిస్తూ వచ్చిన బొత్స కధ క్లైమక్సుకు వచ్చిన తరువాత ఈవిధంగా రెండు నాలికలతో మాట్లాడటం అటు తెలంగాణా ప్రజలకు, ఇటు సీమంధ్ర ప్రజలకు కూడా ఆగ్రహం తెప్పిస్తోంది.

 

రాష్ట్రం సమైక్యంగా ఉండాలని చెపుతూనే అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పడం చూస్తే ఆయన ప్రస్తుతం సీమంద్రాలో క్రమంగా రగులుతున్న సమైక్యాంధ్ర ఉద్యమాలను దృష్టిలో ఉంచుకొని చేసినవిగానే భావించవచ్చును. తద్వారా తనకు రాష్ట్రం విడిపోవడం ఇష్టం లేదని చెపుతూ వారి మనసులు గెలుచుకోవాలని ప్రయత్నిస్తూనే, మరో వైపు అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పడం ద్వారా తెలంగాణా నేతలని కోపం రాకుండా చూసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు అర్ధం అవుతోంది. అయితే, ఇటువంటి రెండు నాల్కల ధోరణి వల్ల ఆయన ఆశించిన విధంగా ఎవరూ మెచ్చుకోకపోగా ఆయన ధోరణిని ఖండిస్తున్నారు.