షర్మిలపై రాయి విసరబోతే...

 

గౌరవప్రధమయిన పీసీసీ అధ్యక్షపదవిలో బొత్ససత్యనారాయణ వంటి ఒక ‘లిక్కర్ మాఫియా డాన్’ న్ని కాంగ్రెస్ కూర్చోబెట్టిందని షర్మిల విసిరిన బాణం సూటిగా బొత్స గుండెల్లో గుచ్చుకొంది. ఆ దెబ్బకి ఆయన విలవిలలాడేరు. ఆమె చేసిన ఆరోపణలని ఖండించడమో లేకపోతే వాటిని నిరూపించమనో సవాలు విసిరితే పోయేదానికి, ఆయన నేరకపోయి షర్మిల భర్తను ఒక కేసు నుండి తానే కాపాడానని చెప్పడంతో, ఇప్పుడు మరో కొత్త సమస్యలో ఇరుకొన్నాడు పాపం. వైయస్సార్ కుటుంబం అంటే మొదటి నుంచి గిట్టని వీ.హనుమంత రావు, బొత్స బాబుకి వంత పాడుతూ, “వైయస్సార్ కుటుంబం గురించి ఆయనకి ఇంకా చాలా చాలా రహస్యాలు తెలుసు. ఇప్పుడు ఆయన వదిలింది కేవలం చిన్న శాంపిల్ బాణమే. అటువంటివి ఆయన దగ్గర చాలానే ఉన్నాయి” అని సగర్వంగా ప్రకటించడంతో, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా ఇందులోకి లాగబడింది.

 

తల్లీ పిల్ల కాంగ్రెస్ పార్టీల మధ్య అనైతిక రహస్య ఒప్పందాలున్నాయని మొదటి నుండి ఆరోపిస్తున్న తెదేపా, మరియు ఇతర ప్రతిపక్ష పార్టీలు, వారి మాటలను పట్టుకొని, “ఆయన బ్రదర్ అనిల్ కుమార్ ను ఏ కేసు నుండి కాపాడారు? అనిల్ కుమార్ ఏ నేరం చేసాడు? నేరం చేసిన వాడిని ఆయన ఎందుకు కాపాడవలసి వచ్చింది? అసలు వైయస్సార్ గురించి బొత్సకు, హనుమంత రావుకి తెలిసిన రహస్యలేమిటి?” అవన్నీ వెంటనే బయటపెట్టాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేయడం మొదలుపెట్టాయి.

 

కొండనాలికకు మందేస్తే ఉన్న నాలిక ఊడినట్లుందీ వ్యవహారం. షర్మిలకు ఘాటుగా జవాబీయబోయిన బొత్సబాబు ఆ ఆత్రంలో తన పార్టీని కూడా మద్యలో ఇరికిస్తే, ఏదో ఉడతా భక్తిగా తనూ ఓ చేయేద్దామనుకొన్న హనుమంతన్నకాంగ్రెస్ పార్టీని ఫిక్స్ చేసేసారు. అయితే ఇటువంటి ఆరోపణలు, ప్రత్యారోపణలు, ఇరుక్కోవడాలు అన్ని కాంగ్రెస్ లో కామనే. రెండు రోజులు పోతే, మరో కొత్త టాపిక్ వస్తే అంతా దీనిని మరిచిపోతారు.