తెలుగు రాష్ట్రాలలో కోర్టులకు బాంబు బెదరింపు.. వారం వ్యవధిలో రెండో సారి
posted on: Feb 25, 2026 1:42PM
.webp)
ఉభయ తెలుగు రాష్ట్రాలలో పలు కోర్టులకు మరో సారి బాంబు బెదరింపులు కలకలం రేపాయి. ఇటీవలే తెలుగు రాష్ట్రాలలోని కోర్టులకు ఈ మెయిల్ ద్వారా బెదరింపులు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా మరో సారి తెలంగాణలోని నాంపల్లి కోర్టు, విశాఖ జిల్లా కోర్టులకు బాంబు బెదరింపు లేఖలు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. బాంబ్ స్క్వాడ్, క్లూస్ టీమ్ లు ఆయా కోర్టుల ఆవరణల్లో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. కోర్టులను ఖాళీ చేయించి ఈ తనిఖీలు నిర్వహించారు. ఈ నెల 18న అంటే సరిగ్గా వారం కిందట ఉభయ తెలుగు రాష్ట్రాలలోని పలు కోర్టులకు ఏకకాలంలో బాంబు బెదరింపు మెయిల్స్ కలకలం రేపిన సంగతి తెలిసిందే.
అప్పుడు హైదరాబాద్ నాంపల్లి సీబీఐ కోర్టు సహా కరీంనగర్, రాజమహేంద్రవరం జిల్లా కోర్టులకు బాంబు బెదరింపు ఈమెయిల్స్ వచ్చాయి. ఆ బెదరింపులు వచ్చి వారం గడిచిందో లేదో మళ్లీ బెదరింపులు రావడంతో అధికారులు ఈ బెదరింపుల విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నారు.
ఇటీవల నిఘా వర్గాలు దేశంలో భారీ ఉగ్రకుట్రను భగ్నం చేసిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా ఉగ్రమూకలు దేవాలయాలు, కోర్టు భవనాలను టార్గెట్ చేసుకుని ఉగ్రదాడులకు పథకం పన్నినట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలోనే వారం వ్యవధిలో తెలుగు రాష్ట్రాలలోని కోర్టులకు రెండు పార్లు బాంబు బెదరింపులు రావడంతో నిఘాను పటిష్టం చేయడమే కాకుండా కీలక కోర్టు భవనాల వద్ద బందోబస్తును మరింత పటిష్టం చేశారు.







