ఈ ప్రభుత్వాలకు జ్ఞానోదయం కలిగేదెప్పుడో

Publish Date:Jul 8, 2013

 

బీహార్ రాష్ట్రం భోధగయలో గల ప్రపంచ ప్రసిద్ధ బౌద్ధ క్షేత్రమైన మహాబోధి ఆలయ పరిసరాలలో ఆదివారం తెల్లవారు జామున 5.30-6.00గంటల మధ్య తొమ్మిది వరుస బాంబు ప్రేలుళ్ళు జరిగాయి. కానీ అవి అంత శక్తివంతమయినవి కాకపోవడంతో ఆలయానికి గానీ, బుద్ధుడు తపస్సు చేసి జ్ఞానోదయం పొందిన భోదీ వృక్షానికి గానీ ఎటువంటి హానీ జరుగలేదు. ఈ ఘటనలో ఇద్దరు బొద్ద సాధువులు మాత్రం తీవ్ర గాయాల పాలయ్యారు. దీనికి ఇండియన్ ముజాహుద్దీన్ తీవ్రవాద సంస్థే కారణం అయిఉండవచ్చునని హోంశాఖ భావిస్తోంది.

 

విచారకరమయిన విషయం ఏమిటంటే, ఇద్దరు తీవ్రవాదులు బౌద్ధ గయలో ప్రవేశించారని వారం రోజుల క్రితమే ఇంటలిజన్స్ విభాగం బీహార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది. పోలీసులు వారి ఆచూకి కనిపెట్టేందుకు ప్రయత్నించారు కానీ సఫలం కాకపోవడంతో వారు ఆలయ అధికారులకు హెచ్చరికలు జారీ చేసి చేతులు దులుపుకొన్నారు. ఇది జరిగిన వారం రోజులకే ఇంటలిజన్స్ హెచ్చరికలను నిజం చేస్తూ ఆలయంలో ప్రేలుళ్ళు జరిగాయి.

 

దీనిని బట్టి ప్రభుత్వాలు, మన పోలీసు వ్యవస్థలు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయో అర్ధం అవుతోంది. ఇటువంటి సంఘటనలలో మనుషులు ప్రాణాలు పోతాయని తెలిసినప్పటికీ ప్రభుత్వాలు, రక్షణ వ్యవస్థలు ఉదాసీనంగా వ్యవహరించడం, ఘటన జరిగిన తరువాత కూడా అంతే ఉదాసీనంగా వ్యవహరించడం చాలా అమానుషం. ప్రజాసేవే తమ జీవిత పరమావధి అన్నట్లు మాట్లాడే రాజకీయ నేతలు, పార్టీలు, ప్రభుత్వాలు ఎన్నికలలో ప్రజల ఓట్లు నొల్లుకొనేందుకు అనేక పధకాలు, వరాలు ప్రకటిస్తుంటాయి. కానీ, ఇటువంటి ఘటనలు జరుగకుండా నివారించి వారి ప్రాణాలు కాపాడాలని మాత్రం ఎన్నడూ ఆలోచించకపోవడం చాల అమానుషం.

 

ఇటువంటి ఉగ్రవాద దాడులు దేశంలో ఎన్నిసార్లు జరుగుతున్నా, ఎంతమంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నా కూడా చలించని జడత్వ స్థితికి చేరుకొన్నాయి మన వ్యవస్థలు. కనీసం వాటి నుండి పాఠాలు నేర్చుకోనప్పుడు, ఇటువంటి ఘటనలను నివారించాలనే ధృడ సంకల్పం అవి కలిగి ఉండాలని ఆశించడం కూడా అడియాసే అవుతుంది.

 

మన దేశంలో ఉగ్రవాదులు జొరబడి విచ్చలవిడిగా విద్వంసానికి పాల్పడుతుంటే దానిని సమర్ధంగా అడ్డుకోవలసిన ప్రభుత్వాలు, వారిని, వారి ఉగ్రవాద చర్యలను కూడా రాజకీయ కోణంలోంచే చూడటం వల్లనే ఇటువంటివి పునరావృతమవుతున్నాయి. దేశంలో ఉగ్రవాదులు జొరబడటం అంటే మనింట్లో దొంగలు జొరబడినట్లేనని ఈ ప్రభుత్వాలు గ్రహించనంత కాలం ఇటువంటి ఘటనలు పునరావృతం అవుతూనే ఉంటాయి.