బీపీ తగ్గేందుకు సులువైన మార్గం

 

రక్తపోటు! ఈ జబ్బు గురించి ఇప్పుడు ప్రత్యేకించి చెప్పుకోనవసరం లేదు. ఇంటికొకరు ఇప్పుడు రక్తపోటుతో బాధపడుతున్నారు. కానీ మన పూర్వీకులలో ఈ సమస్య ఇంతగా ఉండేది కాదు కదా! మరి ఇప్పుడు రక్తపోటు ఇంతగా ఎందుకని వేధిస్తోంది? ఇది రాకుండా చూసేందుకు, వచ్చినా చటుక్కున తగ్గించుకునేందుకు వేరే మార్గమేదీ లేదా? అంటే అబ్బో చాలా సులువైన మార్గమే ఉందంటున్నారు కాలిఫోర్నియాకు చెందిన Alicia McDonough అనే ఆహార నిపుణులు...

 

పూర్వీకుల తిండిలో...

మన పూర్వీకుల ఆహారంలో దుంపలు, కూరగాయలు, పళ్లు, ఆకుకూరలు, తృణధాన్యాలు, పప్పులు... అన్నీ సమృద్ధిగా ఉండేవి. వీటిలో పొటాషియం ఎక్కువగానూ, సోడియం (ఉప్పు) శాతం చాలా తక్కువగానూ ఉండేది. దాంతో మన నాలుకలు మరింత ఉప్పు కోసం తపించిపోవడం మొదలుపెట్టాయి. ఈ జిహ్వచాపల్యాన్ని తీర్చేందుకు రోజువారీ ఆహారంలో ఎక్కువ ఉప్పుని చేర్చడం మొదలుపెట్టాము. ఆహారసంస్థలు కూడా వినియోగదారులని ఆకట్టుకునేందుకు తమ ఉత్పత్తులలో ఎక్కువ ఉప్పుని చేర్చసాగాయి. చివరికి విపరీతంగా ఉప్పు తినే అలవాటుని చేసుకున్నాము. కానీ ఆ కారణంగా మన శరీరం పడుతున్న ఇబ్బందిని గ్రహించలేకపోయాము. శరీరంలో సోడియం నిల్వలు పెరిగిపోయి అవి రక్తపోటుకి దారితీస్తున్నాయి.

 

కిం కర్తవ్యం!

ప్రపంచంలో దాదాపు నూరుకోట్ల మంది రక్తపోటుతో బాధపడుతున్నారంటే అందుకు ముఖ్య కారణం మన ఆహారంలో వచ్చిన మార్పులే! గుండెజబ్బుతో చనిపోయేవారిలో సగం కేసులు అధిక రక్తపోటువే! ప్రస్తుతానికి రక్తపోటు తగ్గించడానికి వాడే మందులు మన శరీరంలోని సోడియం స్థాయిని తగ్గించే ప్రయత్నం చేస్తున్నాయి. ఇందుకు బదులుగా పొటాషియం అధికంగా ఉన్న ఆహారం తీసుకుంటే సరిపోతుందంటున్నారు Alicia McDonough. శరీరంలో పొటాషియం ఎక్కువైతే అధికంగా ఉన్న పొటాషియం నిల్వలను మూత్రం ద్వారా బయటకి పంపే ప్రయత్నం జరుగుతుంది. దాంతో పాటుగా అధిక సోడియం కూడా బయటకు వెళ్లిపోతుంది. ఒక్కమాటలో చెప్పాలంటే రక్తపోటు మరీ తీవ్రంగా ఉన్నప్పుడు వాడే ‘లాసిక్స్’ వంటి మందులు ఎంత ప్రభావం చూపుతాయో.... పొటాషియం అధికంగా ఉండే ఆహారం వల్ల అంతే ఉపయోగం ఉంటుంది.

 

ఆహారంలో చిన్నపాటి మార్పులు

పొటాషియం అధికంగా ఉండే అరటిపళ్లు, చిలగడదుంపలు, చేపలు, ఖర్జూరాలు, బీన్స్ వంటి పదార్థాలు తరచూ తినడం వల్ల శరీరంలోని సోడియం, పొటాషియం నిష్పత్తి సరిగ్గా ఉంటుంది. మరింత ఉప్పు తినాలన్న తపనా క్రమేపీ తగ్గుతుంది. బీపీమందులు వేసుకుంటే ఎంత లాభం ఉంటుందో, పొటాషియం అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల అంతే లాభం ఉంటుందని బల్లగుద్ది మరీ చెబుతున్నారు Alicia McDonough. ఈ మాట మన ప్రకృతి వైద్యులు ఎప్పుడోనే చెప్పారుగా! మనం వింటేనా!!!

- నిర్జర.