Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...కేసీఆర్ జాతీయ ఆకాంక్షలు మెగ్గలోనే తుంచేయడానికి కమలం వ్యూహాలు
posted on: Jul 6, 2022 7:54AM
తెలంగాణలో బీజేపీ రాజకీయ బల ప్రయోగానికి సిద్ధపడింది. తెలంగాణలో అధికారం చేపట్టడమొక్కటే లక్ష్యం కాదు. రాష్ట్రంలో టీఆర్ఎస్ పై చేయి సాధించి ఊరుకోవడం కాదు. ఆ పార్టీ అధినేత జాతీయ ఆశలకు చెక్ పెట్టడం. ఇంకో మాటలో చెప్పాలంటే.. కేసీఆర్ జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పాలన్న ఆకాంక్షకు సమాధి కట్టేయడం. జాతీయ స్థాయిలో బీజేపీయేతర శక్తులను ఏకతాటిపైకి తీసుకురావడానికి ప్రయత్నాలు కేసీఆర్ తోనే మొదలు కాలేదు.
కేసీఆర్ తోనే అంతం కావు. అయినా బీజేపీ కేసీఆర్ నే ఎందుకు టార్గెట్ చేసింది. జాతీయ స్థాయిలో బీజేపీయేతర శక్తుల ఏకీకరణ విషయంలో కేసీఆర్ కంటే తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ ఒకింత శక్తిమంతంగా ముందుకు సాగుతున్నారు. ఆమె వెనుక జాతీయ రాజకీయాలను ప్రభావితం చేయగలిన శరద్ పవార్ వంటి నేతలూ ఉన్నారు. అయినా బీజేపీ కేసీఆర్ నే ఎందుకు టార్గెట్ చేసింది. ఈ ప్రశ్నలకు రాజకీయ పరిశీలకులు చెబుతున్న జవాబు దక్షిణాదిన పార్టీ పునాదులు బలంగా పడాలంటే కర్నాటక ఒక్కటే చాలదు.. తెలంగాణలో అధికారాన్ని చేజిక్కించుకుంటే.. ఏపీలో వేళ్లూనుకోవడానికి ఆ పార్టీకి ఒక బేస్ దొరుకుతుంది. ఏపీలో అధికార వైసీపీ ఇప్పటికే కమలం చెప్పు చేతల్లో నడుస్తోంది. ఇక తెలంగాణలో కేసీఆర్ ను నిలువరిస్తే చాలు. ఇప్పటికే ఎనిమిదేళ్లుగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ మరో సారి రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకునేందుకు పావులు కదుపుతోంది.
ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించడానికి అభివృద్ధి అజెండాను బలంగా ప్రచారం చేసుకుంటోంది. అదే సమయంలో కేంద్రంలో కూడా గత ఎనిమిదేళ్లుగా అధికారంలో ఉన్న మోడీ సర్కార్ పై కూడా అసంతృప్తి జ్వాలలు ఎగసి పడుతున్నాయి. అయినా మరో సారి కేంద్రంలో జెండా ఎగురవేయగలమన్న ధీమా కమలనాధుల్లో వ్యక్తం కావడానికి విపక్షాల అనైక్యతే అధికారాన్ని పువ్వుల్లో పెట్టి అందిస్తుందన్న విశ్వాసమే. రాష్ట్రపతి ఎన్నిక విషయంలో ఆ సంగతి మరోసారి ప్రస్ఫుటమైంది. అయితే ఇక్కడే కేసీఆర్ తన వ్యూహాలతో కేంద్రంలో మూడో సారి అధికారం అన్న కమలనాథుల కలలకు చెక్ పెట్టేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ బలహీనంగా ఉందనడంలో సందేహం లేదు. ఇక విపక్షాల ఐక్యత ఎండమావే.. కానీ ప్రాంతీయ పార్టీలను ఐక్యం చేసే వ్యూహంతో కేసీఆర్ కదుపుతున్న పావులు తమ కాళ్లకు అడ్డం వస్తాయని కమలనాథులు భావిస్తున్నారు.
కేసీఆర్ వ్యూహాత్మకంగా మోడీ టార్గెట్ గా విమర్శలు గుప్పించడం.. మోడీ విధానాలకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల్లో అసువులు బాసిన వారి కుటుంబాలను పరామర్శించి వారికి ఆర్థిక సహాయం చేయడం వంటి చర్యలతో జాతీయ స్థాయి మీడియాను అట్రాక్ట్ చేశారు. గుజరాత్ సీఎంగా మోడీ ఏరకంగా అయితే జాతీయ స్థాయిలో పాపులర్ అయ్యారో... ఇప్పుడు అదే దారిలో కేసీఆర్ పాపులర్ కావడానికి ప్రయత్నిస్తున్నారు. తెలంగాణ చేసింది.. దేశం అనుసరిస్తోంది అన్న అర్ధం వచ్చేలా జాతీయ మీడియాలో ప్రకటనలు గుప్పించి తన జాతీయ రాజకీయ ప్రవేశానికి ఒక వాతావరణాన్ని కల్పించుకునే ప్రయత్నం బలంగా చేశారు. సరే జాతీయ స్థాయిలో పార్టీలు కలసిరాకపోవడం వేరే సంగతి అయితే బీఆర్ఎస్ అంటూ కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి బలంగా మోడీని ఎదుర్కొనేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
దేశ రాజకీయాలలో బీజేపీ వినా మరో జాతీయ పార్టీ బలంగా కనిపించని పరిస్థితి. అయితే దేశ వ్యాప్తంగా దాదాపు అన్ని రాష్ట్రాలలోనూ ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయి. ఆయా పార్టీల సిద్ధాంతాలూ, ఆకాంక్షలు వేటికవి భిన్నమే అయినా.. కేసీఆర్ ఆ పార్టీల మధ్య సయోధ్య సాధించి 2024 ఎన్నికల నాటికి ఒక బలమైన పోటీదారుగా వచ్చే అవకాశాలున్నాయన్నది కమలనాథుల అంచనా. అందుకే కేసీఆర్ జాతీయ రాజకీయాలపై దృష్టి సారించే అవకాశం లేకుండా చేయడమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. ఇందుకు వ్యూహరచన నుంచి కార్యాచరణ వరకూ కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అన్నీ మోడీషా ద్వయమే. ఒక నిర్దుష్ట సిద్ధాంతం పునాదిగా ఆవిర్భవించినట్లు చెప్పుకునే బీజేపీ ఇప్పుడు తెలంగాణలో చేరికలను ప్రోత్సహించడానికి సిద్ధపడిపోయింది.
ఈ చేరికల సమన్వయ బాధ్యతలను టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి తమ గూటికి చేరిన ఈటలకు అప్పగించింది. అంటే అర్ధమేమిటి? ఈటల టీఆర్ఎస్ లో తన పరిచయాలనూ, పలుకుబడినీ ఉపయోగించి ఆ పార్టీ నుంచి కమలం పార్టీలోని వలసలను ప్రోత్సహించడం. తెలంగాణలో టీఆర్ఎస్ విజయానికి అవకాశాలు సన్నిగిల్లుతున్నాయన్న వాతావరణాన్ని కల్పిస్తే కేసీఆర్ ఇక జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టే అవకాశం ఉండదు. ఆయన పూర్తిగా తెలంగాణకే పరిమితమవ్వాల్సిన అనివార్యత ఏర్పడుతుంది. బీజేపీ చేసింది, చేస్తున్నది అదే. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితి కారణంగా కేసీఆర్ పూర్తిగా తెలంగాణపైనే దృష్టి సారించినా ఇక్కడ మరో సారి అధికారం చేజిక్కించుకునేందుకు చెమటోడ్చక తప్పని పరిస్థితి. ఇప్పటికే తెలంగాణలో అటువంటి వాతావరణం ఏర్పడింది. దానిని కొనసాగించడమే బీజేపీ లక్ష్యంగా చెబుతున్నారు. ఒకే దెబ్బకు రెండు పిట్టలన్న సామెతలా కేసీఆర్ ఇటు తెలంగాణలో అధికారానికి దూరం చేయడం, అటు జాతీయ రాజకీయాలపై దృష్టి సారించే అవకాశం లేకుండా చేయడం లక్ష్యంగా బీజేపీ వ్యూహాలను అమలు చేస్తున్నది. మరో వైపు రాష్ట్రంలో కాంగ్రెస్ బలోపేతమై కేసీఆర్ కు సవాల్ విసురుతుండటం కూడా కమలానికి కలిసి వస్తున్నది.



.webp)


