Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...తెలంగాణపై బీజేపీ నజర్.. కేసీఆర్ కు ఇక చిక్కులు తప్పవా?
posted on: May 11, 2022 4:18PM
తెలంగాణ లో బీజేపీయే టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం అన్న విశ్వాసాన్ని ప్రజలలో కల్పించే యత్నంలో బాగంగా ఆ పార్టీ రాష్ట్ర నాయకులు పార్టీ అగ్ర నేతలను రంగంలోనికి దింపుతున్నారు. రాష్ట్రంలో బీజేపీ బలోపేతానికి ఉన్న అవకాశాలను అంచనా వేసిన అగ్ర నేతలకు కూడా అందుకు సుముఖంగా ఉన్నారు. తరచూ రాష్ట్ర పర్యటనలతో తెలంగాణ బీజేపీ క్యాడర్ లో ఉత్సాహాన్ని నింపుతున్నారు.
ఇప్పటికే బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పర్యటన, ఆ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో రాజకీయ వేడిని పెంచాయి. ఇక ఈ నెల 14న అమిత్ షా రా ష్ట్ర పర్యటన ఈ కాకను మరింత పెంచే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. తెలంగాణపై బీజేపీ ప్రత్యేక దృష్టి పెట్టిందా? రాజకీయంగా బలపడటమే కాకుండా, కేంద్రంపై విమర్శలతో విరుచుకు పడుతున్న కేసీఆర్ కు చెక్ పెట్టేందుకు పావులు కదుపుతోందా? ఈ ప్రశ్నలకు బీజేపీ అగ్ర నేతలు ఒకరి వెంట ఒకరుగా తెలంగాణకు క్యూ కడుతుండటం చూస్తుంటే ఔననే సమాధానం చెప్పుకోవలసి ఉంటుంది. ఇటీవల బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రాష్ట్రంలో పర్యటించారు. మరి కొద్ది రోజులలో కేంద్ర హోంమంత్రి, బీజేపీ మాజీ అధ్యక్షుడు అమిత్ షా రానున్నారు. ఆ తరువాత ఈ నెల చివరిలో లేదా జూన్ మొదటి వారంలో ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణలో పర్యటించనున్నారు. వీరు కాకుండా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వంటి వారు కూడా తరచుగా తెలంగాణలో పర్యటించేందుకు షెడ్యూల్ రూపొందించుకుంటున్నారు.
తెలంగాణలో కేసీఆర్ పాలనలోని లోపాలను ఎత్తి చూపడమే కాకుండా.. రాష్ట్రంలో కమలం పార్టీ బలోపేతానికి తీసుకోవలసిన చర్యలపై వీరు రాష్ట్ర నాయకత్వానికి మార్గ నిర్దేశనం చేయనున్నారు. ఇప్పటికే గతంలో కంటే రాష్ట్రంలో బీజేపీ బలపడిందన్న అంచనాలు ఉన్నాయి. ఈటల రాజేందర్, రఘునందర్ వంటి వారి చేరికకు తోడు రానున్న రోజులలో మరి కొందరు ప్రముఖులు కూడా కాషాయి నీడన చేరే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు. కోమటి రెడ్డి రాజగోపాలరెడ్డి, కొండారెడ్డి త్వరలో బీజేపీలో చేరుతారని, వారి చేరికతో కమలం పార్టీ మరింత బలోపేతమౌతుందని అంటున్నారు. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడంతో పాటు కేసీఆర్ దూకుడుకు కళ్లెం వేసేందుకు కూడా బీజేపీ అగ్రనాయకత్వం కృత నిశ్చయంతో ఉన్నట్లు కనిపిస్తున్నదని పరిశీలకులు చెబుతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో ధాన్యం సేకరణ, మిల్లర్ల మాయాజాలంపై ఎఫ్ సీఐ దర్యాప్తు మొదలు పెట్టింది. తనిఖీలు ముమ్మరం చేసింది.
దీని ఆధారంగా సీబీఐ విచారణకు కేంద్రం ఆదేశించే అవకాశాలున్నాయని అంటున్నారు. అలాగే కాళేశ్వరం అవినీతిపై కూడా కేంద్రం దృష్టి సారించిందంటున్నారు. ఈ నేపథ్యంలోనే బీజేపీ జాతీయ అధ్యక్షుడు తన ఇటీవలి పర్యటనలో కేసీఆర్ కు కాళేశ్వరం ఏటీఎంలా మారిందని విమర్శించారు. కాళేశ్వరంలో అవినీతిపై ఉన్నత స్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం అవినీతిపై కూడా కేంద్ర దర్యాప్తు సంస్థ చే దర్యాప్తు జరిపించాలన్న యోచనలో కేంద్రం ఉందని అంటున్నారు. త్వరలోనే కేసీఆర్ జైలుకు వెళ్లడం ఖాయమంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు తరచుగా చెబుతుండటమే ఇందుకు నిదర్శనంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇలా అన్ని వైపుల నుంచీ కేసీఆర్ ను చక్రబంధంలో బిగించే విధంగా బీజేపీ పావులు కదుపుతున్నది. వీటన్నిటినీ తట్టుకుని కేసీఆర్ జాతీయ స్థాయిలో తన ముద్ర వేసేలా ముందుకు సాగుతారా? అందుకు పరిస్థితులు అనుకూలిస్తాయా అన్న సందేహాలు రాజకీయ వర్గాలలో వ్యక్తమౌతున్నాయి. ముందు రాష్ట్రంలో పార్టీని కాపాడుకోవడంతో పాటు మరో మారు అధికారం చేజిక్కించుకునేందు వ్యూహాత్మకంగా బీజేపీకి దాసోహం అంటారా అన్న అనుమానాలు కూడా వ్యక్తమౌతున్నాయి. ఏది ఏమైనా బీజేపీ మాత్రం ముఖ్యమంత్రి కేసీఆర్ కు చెక్ పెట్టే విధంగా వేగంగా అడుగులు వేస్తున్నదనడంలో సందేహం లేదు. ఎనిమిదేళ్ల పాటు అధికారంలో ఉన్న కేసీఆర్ ఇప్పుడు వేగంగా ప్రజా మద్దతును కోల్పోతున్నారన్న అంచనాతో ఉన్న బీజేపీ ఇదే అదునుగా తన దూకుడు పెంచింది. అదే సమయంలో కేంద్ర నాయకత్వం కూడా తెలంగాణలో బీజేపీ బలోపేతంపై దృష్టి సారించింది. దక్షిణాదిలో కర్నాటక వినా మరే రాష్ట్రంలోనూ బీజేపీకి ఇప్పటి వరకూ పట్టు చిక్కలేదు.
తొలి సారిగా తెలంగాణలో పట్టు సాధించే అవకాశాలు ఉన్నాయన్నది ఆ పార్టీ అగ్ర నేతల అంచనా. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి బీజేపీ మద్దతు పలకడం, కాంగ్రెస్ వైఫల్యాలు, టీఆర్ఎస్ పట్ల ప్రజలలో పెరుగుతున్న వ్యతిరేకతలే అలంబనగా రాష్ట్రంలో బీజేపీ దూకుడు పెంచింది. జీహెచ్ఎంసీ ఎన్నికలలో అనూహ్యంగా పెద్ద సంఖ్యలో సీట్లు గెలుచుకోవడం, హుజూరాబాద్, దుబ్బాక ఉప ఎన్నికలలో విజయం బీజేపీలో ధీమాను పెంచాయి. అదే సమయంలో పార్టీ అధిష్టానంలో తెలంగాణపై ప్రత్యేక దృష్టి సారించేలా చేశాయి.






