దేవుడా.. ఓట్లు ఇలా కూడా అడుగుతారా..!

 

సాధారణంగా రాజకీయ నాయకులు ఓట్లు కావాలంటే ఎలా అడుగుతారు. ఎన్నికల ప్రచారాల్లో పాల్గొంటారు. అమ్మా.. అయ్యా అని దండాలు పెడతారు. ఒక్క సారి అవకాశం ఇవ్వండి అని బతిమాలుకుంటారు. అధికారం కోసం ఏదైనా చేయడానికి సిద్దపడతారు. అలాంటిది.. ఇక్కడ ఓ రాజకీయ నేత మాత్రం... బెదిరిస్తూ ఓట్లు అడుగుతున్నాడు. ఈ విచిత్రమైన ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. ఉత్తర్‌ప్రదేశ్‌లో నవంబర్ నెలాఖరున స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో బరబంకి స్థానం నుంచి బీజేపీ కౌన్సిలర్‌ రంజిత్‌కుమార్‌ శ్రీవాస్తవ భార్య శశి శ్రీవాస్తవ పోటీ చేస్తున్నారు. ఈ సందర్బంగా తన భార్య తరపున ప్రచారంలో పాల్గొన్న రంజిత్ కుమార్ శ్రీవాత్సవ 'ఇదేమీ సమాజ్‌వాదీ పార్టీ ప్రభుత్వం కాదు. మీకు ఎవరూ సహాయం చేయలేరు. నా భార్యకు ఓట్లు వేసి గెలిపించకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుంది. అందుకే మాకు ఓట్లు వేయండి. మీరు మాకు ఓట్లేస్తే.. ప్రశాంతంగా ఉండగలుగుతారు. లేదంటే కష్టాలు తప్పవు.' అని హెచ్చరించారు. అంతే ఇప్పుడు రంజిత్ కుమార్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగుతోంది. రంజిత్ వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు  తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ... అతనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.

 

మరోవైపు సొంత పార్టీ నేతలే రంజిత్ కుమార్ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. రంజిత్ కుమార్ మాట్లాడుతున్నప్పుడు అక్కడే ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఇద్దరు మంత్రులు దారాసింగ్‌ చౌహాన్‌, రమాపతి శాస్త్రి వేదికపైనే ఉన్నారు. దీంతో రంజిత్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి చౌహాన్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు. మొత్తానికి ఆఖరికి రాజకీయ నాయకులు బెదిరించి మరీ ఓట్లు అడిగే పరిస్థితి ఏర్పడింది. ఇలానే ఉంటే పరిస్థితి ఇంకెంత దూరం వెళుతుందో చూద్దాం...