ఢిల్లీ అసెంబ్లీకి మళ్ళీ ఎన్నికలు?
posted on Nov 3, 2014 1:56PM

ఢిల్లీలో ఆమ్ ఆద్మీ అరవింద్ కేజ్రీవాల్ మూణ్ణాళ్ళ ముచ్చట ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత అక్కడ అప్పటి నుంచి ఇప్పటి వరకు రాష్ట్రపతి పాలన కొనసాగుతోంది. రాష్ట్రపతి పాలనలో ఉన్న ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటుపై దృష్టి పెట్టాలంటూ గత వారం సుప్రీంకోర్టు సూచించిన నేపథ్యంలో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ పార్టీలతో చర్చలు చేపట్టారు. మైనార్టీ ప్రభుత్వాన్ని అయినా ఏర్పాటు చేయాలంటూ కోర్టు సూచించడంతో అందరూ బీజేపీకి అవకాశం లభిస్తుందని అనుకున్నారు. బిజేపీ కూడా మొదట్లో ఆ దిశగా ప్రయత్నించింది. అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాత్రం ఎన్నికలకే మొగ్గు చూపుతున్నట్లు బీజేపీ వర్గాలు వెల్లడించాయి. ఇతరుల మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేసే బదులు సొంతంగా బలం తెచ్చుకొని ప్రభుత్వం ఏర్పాటు చేస్తేనే బాగుంటుందని నరేంద్ర మోదీ అభిప్రాయపడుతున్నట్లు బీజేపీ నేతలు తెలిపారు. ప్రస్తుతం పరిస్థితి ఆశావహంగా ఉండడం, ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడకపోవడం తదితర పరిణామాలను అనుకూలంగా మార్చుకోవాలనేది మోదీ వ్యూహాంగా కనిపిస్తోంది. దాంతో ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటుకు మేము సుముఖంగా లేము అని బీజేపీ నేతలు సోమవారం లెప్ట్నెంట్ గవర్నర్తో అన్నట్లు సమాచారం.