కాంగ్రెస్ కి కలిసి వచ్చిన బీజేపీ కుమ్ములాట

 

బీజేపీలో అద్వానీ, సుష్మ స్వరాజ్, యశ్వంత్ సిన్హా తదితరులు నరేంద్ర మోడీని వ్యతిరేఖిస్తున్నకారణంగా ఇంత కాలం ఆయనకు నాయకత్వం కట్టబెట్టేందుకు జంకిన ఆపార్టీ, చివరికి దైర్యం చేసి ఆయనను ప్రచార కమిటీ అధ్యక్షుడుగా నియమించింది. అయితే, తనను కాదన్న పార్టీకి అద్వాని కూడా గట్టి షాకే ఇచ్చారు. ఆయన అంత తీవ్రమయిన నిర్ణయం తీసుకొంటారని ఊహించని ఆ పార్టీ నేతలు ఇప్పుడు ఆయనను ప్రసన్నం చేసుకొని ఆయన నిర్ణయం ఉపసంహరింపజేసే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, ఇదే అదనుగా ఆయన పార్టీని తన అదుపులోకి తెచ్చుకొనే ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఆయన తను రాజీనామా ఉపసంహరించుకోవాలంటే సుష్మా స్వరాజ్ ను పార్టీ ప్రధాన మంత్రి అభ్యర్ధిగా ప్రకటించాలని కోరుతున్నట్లు సమాచారం. అవికాక ఆయనకి మరికొన్ని డిమాండ్స్ కూడా ఉన్నట్లు సమాచారం.

 

మరో ఆరు నెలలో నాలుగు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలను, పది నెలలలో సాధారణ ఎన్నికలను ఎదుర్కోవలసిన తరుణంలో బీజేపీలో అగ్రనాయకత్వం మధ్యన బయటపడిన ఈ అంతర్ యుద్ధం పార్టీపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇక, అద్వానీతో బాటు ఆయన మద్దతుదారులు కూడా పార్టీని వీడే ప్రయత్నం చేసినట్లయితే పార్టీ రెండుగా చీలడం ఖాయం. అదే జరిగితే, వరుస కుంభకోణాలతో పరువుపోగోట్టుకొని రాబోయే ఎన్నికలను ఎదుర్కోవడానికి బయపడుతున్న కాంగ్రెస్ పార్టీకి ఇది తీయని వార్తే అవుతుంది. అందుకే, కాంగ్రెస్ పార్టీ నేతలు బీజేపీలో రగిలిన ఈ అంతర్ యుద్దానికి యధాశక్తిన తమ మాటలతో ఆజ్యం పోస్తున్నారు. ఒకవేళ, బీజేపీ గనుక నిలువునా చీలిపోయినట్లయితే, ఇక అప్పుడు దేశంలో కాంగ్రెస్ పార్టీకి తిరుగే ఉండదు. ఇది కాంగ్రెస్ పార్టీకి కలలో కూడా ఊహించని అవకాశమేనని చెప్పవచ్చును.

 

అదేవిధంగా దేశంలోని బీజేపీని వ్యతిరేఖిస్తున్నప్రాంతీయ పార్టీలకు కూడా తమ 3వ ఫ్రంట్ కలలు నిజం చేసుకొనే అవకాశం దక్కింది. దేశ వ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ పార్టీలు స్థానికంగా చాల బలంగా ఉన్నందున అవి బీజేపీకి ప్రత్యామ్నాయంగా నిలబడి కాంగ్రెస్ పార్టీకి గట్టి పోటీ ఇవ్వగలవు. అయితే, వాటికి జాతీయ దృక్పదం కంటే స్వంత ఎజెండాయే ముఖ్యం గనుక వాటి అంత తేలికగా సఖ్యత ఏర్పడే అవకాశం లేదు. ఒకవేళ ఏర్పడినా అది తాత్కాలికమే తప్ప శాశ్వితం కాబోదు. చిన్న పాము నయినా పెద్ద కర్రతో కొట్టాలన్నట్లు కాంగ్రెస్ పార్టీ 3వ ఫ్రంటు ఏర్పడక ముందే దానిని అవలీలగా చిన్నాభిన్నం చేసి తనకు ఎన్నికలలో ఎదురు లేకుండా చేసుకోగలదు. ఇటువంటి పరిస్థితులను సద్వినియోగం చేసుకొనేందుకు కాంగ్రెస్ పార్టీ అకస్మాతుగా మధ్యంతర ఎన్నికలకు వెళ్ళినా ఆశ్చర్య పోనవసరం లేదు. బీజేపీలో చెలరేగిన ఈ అంతర్ యుద్ధం వలన అంతిమంగా లాభపడేది కాంగ్రెస్ పార్టీ మాత్రమే.