బీజేపీ కూటమిలో కొత్త ఆశావాదం
posted on Nov 7, 2015 12:12PM

బీహార్ ఎన్నికలు ముగిశాయి. అటు బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే కూటమి, ఇటు నితీష్ కుమార్ నాయకత్వంలోని లౌకిక కూటమి ఈ ఎన్నికలలో హోరాహోరీగా పోరాడాయి. ఈ ఎన్నికలలో గెలుపు ఓటములు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రతిష్ఠ మీద ప్రభావం చూపించే అవకాశం వుండటంతో ఆయనతోపాటు ఎన్డీయే శక్తులన్నీ బీహార్ ఎన్నికల మీద దృష్టిని కేంద్రీకరించాయి. అయితే రెండు రోజుల క్రితం చివరి విడత పోలింగ్ ముగిసిన అనంతరం కొన్ని సర్వే సంస్థలు విడుదల చేసిన ఎగ్జిట్ పోల్ ఫలితాలు బీహార్‌లో నితీష్ కుమార్ పాలన మళ్ళీ రాబోతోందని చెప్పడంతో బీజేపీ వర్గాలు నిరాశలో కూరుకుపోయాయి. అయితే ఒక రోజు తర్వాత శుక్రవారం నాడు వెలువడిన మరో ఎన్నికల సర్వే ఫలితం ఎన్డీయే కూటమికి అనుకూలంగా వుండటంతో బీజేపీ వర్గాలు మళ్ళీ ఆశావాదంలోకి వచ్చేశాయి.
ప్రముఖ మీడియా సంస్థ ఎన్డీటీవీ తాను నిర్వహించిన ఎన్నికల సర్వే ఫలితాలను వెల్లడించింది. ఈ ఎన్నికలలో బీహార్లో ఎన్డీయే కూటమి 125 సీట్లను గెలుచుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఎన్డీటీవీ తెలిపింది. అలాగే లౌకిక కూటమి 110 స్థానాలతో సరిపెట్టుకోవాలని తేల్చింది. 243 సీట్లున్న బీహార్‌లో ప్రభుత్వాన్ని స్థాపించాలంటే 124 సీట్ల మెజారిటీ అవసరం. అంటే ఎన్డీయే కూటమికి మెజారిటీ కంటే ఒక్క సీటు ఎక్కువగా వస్తుందన్నమాట. దాదాపు ఏడు సర్వే సంస్థలు బీహార్లో లౌకిక కూటమి అధికారంలోకి వస్తుందని చెబితే నిరాశలో కూరుకుపోయిన బీజేపీ వర్గాలు ఒక్క ఎన్డీటీవీ సర్వే ఫలితాలు తమకు అనుకూలంగా రావడంతో ఉత్సాహంతో ఉరకలు వేస్తోంది.