ఎన్డీయేలో సీట్ల పంపకం పూర్తయినట్లే!
posted on Sep 14, 2015 7:47AM
.jpg)
మాజీ బీహార్ ముఖ్యమంత్రి జితన్ రామ్ మంజీ స్థాపించిన హిందూస్తాన్ అవామ్ మోర్చా (హెచ్.ఎ.యం.) పార్టీ త్వరలో జరుగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో ఎన్డీయే కూటమితో జత కట్టింది. కానీ నిన్నటి వరకు వాటి మధ్య సీట్ల పంపకంలో ప్రతిష్టంభన నెలకొని ఉంది. హెచ్.ఎ.యం.కి మొదట 13సీట్లు మాత్రమే బీజేపీ ఇవ్వజూపింది. కానీ హెచ్.ఎ.యం.లో ఉన్న 19మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటు అధనంగా మరో పది సీట్లయినా తమకు కేటాయించాలని లేకుంటే ఎన్డీయే కూటమి నుండి తప్పుకొంటామని జితన్ రామ్ మంజీ హెచ్చరించారు. ఒకవేళ ఆయన ఎన్డీయే కూటమి నుండి బయటకు వచ్చి తమ సమాజ్ వాది పార్టీతో చేతులు కలిపినట్లయితే ఆయననే ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటిస్తామని ఆ పార్టీ అధినేత ములాయం సింగ్ ప్రకటించడంతో బీజేపీ అప్రమత్తమయింది. జితన్ రామ్ మంజీ కోరినట్లే హెచ్.ఎ.యం.కి 20 సీట్లు కేటాయించింది. అదనంగా మరో ఐదు సీట్లు కూడా కేటాయించింది. కానీ ఆ ఐదు స్థానాలలో బీజేపీ టికెట్ పైనే పోటీ చేయవలసి ఉంటుంది. అందుకు జితన్ రామ్ మంజీ కూడా అంగీకరించారు.
ఇక కేంద్రప్రభుత్వంలో మంత్రిగా ఉన్న రామ్ విలాశ్ పాశ్వాన్ కి చెందిన లోక్ జన్ శక్తి పార్టీకి 40సీట్లు కేటాయించడానికి బీజేపీ అధిష్టానం సూత్రప్రాయంగా అంగీకరించడంతో ఎన్డీయే కూటమిలో సీట్ల పంపకాల ప్రక్రియ సజావుగా పూర్తయినట్లే భావిస్తున్నారు. బీహార్ అసెంబ్లీలో మొత్తం 243సీట్లలో లోక్ జన్ శక్తి పార్టీకి 40, హెచ్.ఎ.యం.కి 25 సీట్లు ఇవ్వగా మిగిలిన స్థానాలలో బీజేపీ పోటీ చేసే అవకాశం ఉంది. సీట్ల పంపకంపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఈరోజు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.