TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రాష్ట్ర విభజనతో వైయస్సార్ కాంగ్రెస్ నష్టపోయిందా

Published on: Thu Aug 29, 2013 8:31AM

 

 

జగన్ మోహన్ రెడ్డిని రాజకీయంగా దెబ్బ తీయడానికే కేంద్రం రాష్ట్రవిభజన చేస్తోందని వైయస్సార్ కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఆ ఆరోపణలు నిజమనుకొంటే, బహుశః వైకాపా అందుకే విభజనను వ్యతిరేఖిస్తూ తీవ్ర ఉద్యమాలు చేస్తోందనుకోవలసి ఉంటుంది. ఒకవేళ నేటికీ ఆ పార్టీ తెలంగాణాలో తన పార్టీ ఉనికిని నిలుపుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటే, ఆ ఆరోపణలకు అర్ధం ఉండేది. కానీ, ఆపార్టీ తెలంగాణాను పూర్తిగా వదులుకొని సమైక్య ఉద్యమాలు కొనసాగిస్తూ, సీమాంధ్ర ప్రాంతంపై పూర్తి పట్టు సాధించేందుకు కృషి చేస్తూ కాంగ్రెస్ ఎత్తుకి పైఎత్తు వేసింది గనుక, ఇక ఆ ఆరోపణలకు విలువలేకుండా పోయినట్లే భావించవచ్చును.

 

ఇక అటువంటప్పుడు ఆ పార్టీ ఎత్తుకొన్న ‘సమన్యాయ రాగం’ కూడా అర్ధ రహితమే. తెలంగాణాలో పార్టీని నడిపే ఉద్దేశ్యం లేనప్పుడు, ఆప్రాంతానికి న్యాయం జరగాలని వైకాపా ఇంతగా పోరాటాలు చేయవలసిన అవసరం లేదు. గనుక, ఇప్పుడు ఆ పార్టీ కోరుతున్న ‘సమన్యాయం’ అంటే ‘సీమాంధ్ర ప్రాంతానికి న్యాయంగా’ అర్ధం చేసుకోవలసి ఉంటుంది. నేరుగా ఆ మాట చెపితే రాజకీయంగా వచ్చే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొనే వైకాపా తన పోరాటాలకి సమన్యాయమనే కలరింగ్ ఇస్తోందని చెప్పవచ్చును. అందుకే, సీమాంధ్ర ప్రాంతానికి ‘(సమ)న్యాయం’ చేయలేకపోయినట్లయితే రాష్ట్రాన్నివిభజించకుండా యధాతధంగా ఉంచమని డిమాండ్ చేస్తోంది. 

 

కానీ, ఆ పార్టీ తెలంగాణాను వదులుకొన్న తరువాత కూడా రాష్ట్ర విభజనను వ్యతిరేఖిస్తూ ఎందుకు పోరాటాలు చేస్తోందంటే సీమంధ్రపై రాజకీయంగా పూర్తి పట్టు సాధించేందుకే. ఆ పార్టీ ‘సమన్యాయం’ అంటూ మొదలుపెట్టిన ‘సమైక్య ఉద్యమాల’తో సీమాంధ్రలో బాగానే పుంజుకొందని సర్వేలన్నీ తేటతెల్లం చేస్తున్నాయి. అంటే రాష్ట్ర విభజన వల్ల, ఆ పార్టీ కేవలం తను బలంగా లేని తెలంగాణాను వదులుకొంది తప్ప ఏవిధంగాను నష్టపోలేదని అర్ధం అవుతోంది.

 

ఇంతవరకు తెరాస తెలంగాణా సెంటిమెంటుని ఉపయోగించుకొని ఆ ప్రాంతంలో తిరుగులేని శక్తిగా ఎలా ఎదిగిందో, ఇప్పుడు వైకాపా కూడా ‘సమన్యాయం-సమైక్యాంధ్ర’ నినాదంతో సీమాంధ్ర ప్రాంతంలో తిరుగులేని శక్తిగా ఆవిర్భవించాలని ప్రయత్నిస్తోంది.

 

తెదేపా, కాంగ్రెస్ పార్టీలు వైకాపా కంటే ఎన్నోరెట్లు బలమయినవయినప్పటికీ, రెండు ప్రాంతాలలోతమ పార్టీలను నిలుపుకోవాలని తిప్పలు పడుతున్నకారణంగా, కేవలం సీమంధ్రకే పరిమితమయిన వైకాపా ముందు మోకరిల్లక తప్పడం లేదు.

 

రాష్ట్ర విభజన చేసి కాంగ్రెస్ పార్టీ తన ప్రత్యర్దులయిన తెదేపా,తెరాస, వైకాపాలను దెబ్బ తీయాలనుకొంటే, వైకాపా చేసిన ఈ ఉపాయంతో సీన్ రివర్స్ అయ్యి సీమంధ్రలో వైకాపా, తెలంగాణాలో తెరాస బలపడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ రాబోయే ఎన్నికలలో రెండు ప్రాంతాలలో గెలవాలంటే తప్పనిసరిగా తెరాస, వైకాపాలతో పొత్తులకు చేయి చాపక తప్పదు.