రాష్ట్ర విభజన కిం కర్తవ్యమ్?

 

అందరూ అనుకోన్నట్లే రాష్ట్ర విభజన సమస్య మళ్ళీ మొదటికి వచ్చింది. మళ్ళీ రాష్ట్రంలో మూడు ప్రాంతాల నేతలతో మొదటి నుండి చర్చలు ప్రారంభించాల్సి ఉందని, దానికి నిర్దిష్ట గడువు కూడా చెప్పలేమని కేంద్రం ప్రకటనతో తెలంగాణా ప్రాంతంలో అగ్నికీలలు రాజుకోనుండగా, మిగిలిన ప్రాంతాలలో పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకొంటాయి. అయితే, పోరుగింటికి నిప్పంటుకొంటే అది పక్కనున్న ఇంటికీ అంటుకోక మానదు.

 

 

అయితే, సమస్యను పరిష్కరించవలసిన కేంద్ర ప్రభుత్వం నాన్పుడు ధోరణితో సాగదీస్తోందనే వాదన అర్ధ రహితం. రాష్ట్రవిభజన చాలా క్లిష్టమయిన సమస్య అని ప్రతీ రాజకీయనాయకుడికీ స్పష్టంగా తెలిసి ఉన్నపటికీ, ఆ విషయాన్నీ బహిరంగంగా మాత్రం ఒప్పుకోరు. ఎందుకంటే ఎవరి రాజకీయ ప్రయోజనాలు వారివి. ఈ రోజు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచమనో, విభజించమనో వీదులకెక్కి పోరాటాలు చేసేవారెవరూ కూడా ఒక్కనాడయినా సమస్యని సామరస్యంగా పరిష్కరించుకోవాలని అనుకోలేదు. అలాగా అనుకొంటే ఈ సమస్యకి పరిష్కారం డిల్లీలో కాక రాష్ట్రంలోనే దొరికి ఉండేది. గానీ, తమను తాము మహా మేధావులుగా భావించుకొనే మన రాజకీయ నాయకులు గత పదేళ్ళబట్టి ఉద్యమాలు జరుగుతున్నా కూడా ఇంతవరకు ఇటువంటి చర్చలకు శ్రీకారం చుట్టకపోవడమే వారిలో చిత్తశుద్దిలేదని నిరూపిస్తోంది.

 

దేశంలో దరిద్రం ఉన్నంతకాలం వోటు బ్యాంకు పదిలంగా ఉన్నట్లే, ఈ సమస్య ఉన్నంత కాలం ప్రజలలో భావోద్వేగాలూ ఉంటాయి, వాటిని ఎప్పుడుకావలనుకొంటే అప్పుడు రాజేసుకోని వోట్ల రూపంలో మార్చుకోవచ్చును. అవసరం లేనప్పుడు ఉద్యమ నాయకులుగా అదే సమాజం మీద దాష్టికం చేయవచ్చును. ఉద్యామాలు, రాష్ట్ర విభజన అంశాలు ఇంతవరకూ ఊరుపేరులేని ఎందరో అనామకులకు కొత్త గుర్తింపు, కొత్త హోదాలను కల్పిస్తున్నాయంటే అవి ఏ స్థాయికి దిగాజారేయో అర్ధం అవుతుంది.

 

 

రాజకీయ పార్టీల మద్య సంప్రదింపులతో పరిష్కారం కావలసిన ఇటువంటి సున్నితమయిన సమస్యని గోటితో పోయే దానిని గొడ్డలి వరకూ తీసుకువచ్చాయి. రాష్ట్రం విడిపోవాలా,వద్దా అనే పంచాయితీని అసలు కేంద్రం వద్దకి తీసుకుపోవడమే మొదటి తప్పు. సామాజిక,రాజకీయ,ఆర్దిక ఇత్యాది విషయాలపై సంపూర్ణ అవగాహన కలిగిన ఎందరో మేధావులు, సాంకేతిక నిపుణులు మనకి ఉండగా అటువంటి వారి సేవలు, సలహాలు తీసుకొని సమస్యని పరిష్కరించుకొనే ప్రయత్నం చేయకపోగా, తమ స్వార్ద రాజకీయ ప్రయోజనాలకోసం సమస్యని కేంద్రం పైకి నెట్టేసి పరిష్కరించలేదని రాజకీయ పార్టీలు కేంద్రాన్ని నిందిస్తున్నాయిప్పుడు.

 

 

మన రాష్ట్రం సమస్యని మనమే కూర్చొని పరిష్కరించుకొనేందుకు ఆసక్తి చూపనప్పుడు కేంద్రాన్నితప్పు పట్టడం కూడా తప్పే అవుతుంది. మన రాజకీయ ప్రయోజనాలు మనకి ముఖ్యమయినప్పుడు దేశాన్ని పాలిస్తున్న కాంగ్రెస్ పార్టీకి కూడా తన ప్రయోజనాలు తనకీ ముఖ్యమే అని మన రాజకీయ పార్టీలు గ్రహించాలి. కాంగ్రెస్ పార్టీ ఈ సమస్యని ఎన్నికల వరకు సాగదీసి ప్రయోజనం పొందాలని చూస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తూనే, అదే తమకీ మేలనే ఆలోచన చేస్తున్నాయి. అందుకే, కేంద్రం ప్రకటన వెలువడగానే రాబోయే ఎన్నికల గురించి మాట్లాడటం మొదలుపెట్టాయి.

 

 

 ఒక తీవ్ర సమస్య మన రాష్ట్రాన్ని ఇంతగా వేదిస్తున్నపుడు దానిని ఏవిదంగా పరిష్కరించావచ్చును, అందుకు మనం ఏమి చేయాలి అని ఏరాజకీయ నాయకుడు, ఏ పార్టీ గానీ మాట్లాడటం లేదిప్పుడు. ఒక వైపువారు ఓడినట్లు,మరొక వర్గంవారు గెలిచినట్లు భావిస్తున్నారు తప్ప, సమస్య పరిష్కారం చేసుకోలేకపోయమనే విచారం ఎవరికీ కలగలేదు. తద్వారా రాష్ట్రం మరింత సమస్యలలో చిక్కుకొంటుందనే ఆలోచన, భయం కూడా ఎవరిలో లేదు. ఎవరి స్వార్ద రాజకీయ ప్రయోజనాలు వారివే. రాష్ట్రం, ప్రజల గురించి ఆలోచించే అవసరం, ఆసక్తి, ఓపిక ఎవరికీ లేవు.

 

 

మన రాజకీయ పార్టీలలో ఈ సమస్యని చిత్తశుద్దితో పరిష్కరించాలని ఆలోచన కలగనంతవరకూ కేంద్రం మరెంత కాలం చర్చలు జరిపినా, మరెన్ని సమావేశాలు నిర్వహించినా కూడా ఈ సమస్యకి పరిష్కారం దొరకడం కూడా కష్టమేనని చెప్పక తప్పదు.

 

 

ఇప్పటికయినా విజ్ఞత చూపి, బేషజాలు, స్వీయ రాజకీయ ప్రయోజనాలు, విద్వేషాలు పక్కన పెట్టి మన రాజకీయ పార్టీలు సమస్య పరిష్కారానికి కృషిచేస్తే తప్పకుండా పరిష్కారం దొరుకుతుంది. అయితే, మన రాజకీయ పార్టీలనుండి ఇంత ఆశించడం దురాశే అవుతుందని మనకి తెలుసు. ఇటువంటి రాజకీయనాయకుల చేతుల్లో ఉన్న మన రాష్ట్రాన్ని ఇక దేవుడే కాపాడాలి.