TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

నేపాలీ పనిమనుషులతో జాగ్రత్త...పోలీసుల హెచ్చరిక

Published on: Tue May 12, 2026 2:54PM

 

హైదరాబాద్ నగరంలో మాజీ ఐపీఎస్‌ అధికారి భార్య హత్య–దోపిడీ కేసు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ కేసులో పోలీసులు ఇప్పటికే ఇద్దరు నిందితులను అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. అయితే ఇలా నేపాల్ వ్యక్తులు బడా బాబులను టార్గెట్‌గా చేసుకొని వారి ఇళ్లల్లో పని మనుషులుగా చేరి... అదును చూసుకొని హత్య, దోపిడీకి పాల్పడుతున్న ఘటనలు జరుగుతూ ఉండడంతో పోలీసులు కీలక ప్రకటన విడుదల చేశారు. ముఖ్యంగా ఇళ్లలో నేపాలీ పనిమను షులను పనిచేయిస్తున్న కుటుంబాలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. 

హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో పని చేస్తున్న నేపాలీ పనిమనుషులపై పూర్తి సమాచారం సేకరణకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు నేపాలీ పనిమనుషులను నియమించుకున్న ఇళ్లకు నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలోనే పోలీసులు ఇంటి యజమానులకు కొన్ని సూచనలు చేశారు.తమ వద్ద పని చేస్తున్న నేపాలీ పనిమను షుల పూర్తి వ్యక్తిగత వివరాలు అంద జేయాలి. వారి తాజా ఫోటోలు సమర్పించాలి. వారు ఎవరి ద్వారా వచ్చి ఉద్యోగంలో చేరారనే వివరాలు ఇవ్వాలి.

ఈ సమాచారాన్ని స్థానిక పోలీస్ స్టేషన్‌లో సమర్పించి అధికారిక వెరిఫికేషన్ చేయించుకోవాలని ఇంటి యజమానులకు పోలీసులు విజ్ఞప్తి చేశారు. ఈ ప్రక్రియ ను త్వరితగతిన పూర్తి చేయాలని పోలీసులు సూచించారు. ఇది నగర భద్రతను మరింత బలోపేతం చేయడానికి తీసుకుంటున్న చర్యలలో భాగమని పోలీసులు తెలియజేశారు. ప్రస్తుతం జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్, గచ్చిబౌలి, రాయ దుర్గం ప్రాంతాల్లో ప్రము ఖులు మరియు ధనవంతుల ఇళ్లలో పని చేస్తున్న నేపాలీ పనిమనుషుల వివరాలను పోలీసులు ప్రత్యేకంగా సేకరిస్తున్నారు. పౌరులు పోలీసులతో సహకరించాలని, అనుమానాస్పద వ్యక్తులపై వెంటనే సమాచారం అందించాలని పోలీసులు కోరుతున్నారు.