కొబ్బరినీళ్లని మించిన కూల్డ్రింక్ లేదు

 

ఎండాకాలం మొదలైందంటే చాలు... కూల్డ్రింక్లకీ, పళ్లరసాలకీ డిమాండ్ పెరిగిపోతుంది. ఇళ్లలో ఫ్రిజ్లన్నీ సీసాలతో నిండిపోతాయి. కానీ ఎన్ని కూల్డ్రింక్స్ తాగినా జేబులు ఖాళీ అవుతాయేమో కానీ దాహం మాత్రం తీరదు. అందుకే కూల్డ్రింక్స్ పక్కన పెట్టి కొబ్బరిబోండాన్ని ఓ పట్టు పట్టమంటున్నారు నిపుణులు. దానికి బోలెడు కారణాలు చూపిస్తున్నారు కూడా!

 

- శీతల పానీయాలు నిలవ ఉన్నా, సీసా మూతలు తుప్పు పట్టినా లేనిపోని రోగాలు వచ్చే అవకాశం ఉంది. కానీ కొబ్బరినీళ్లు sterile waterతో సమానం. అంటే వీటిలో సూక్ష్మక్రిములు ఇంచుమించుగా కనిపించవన్నమాట.

 

- కొబ్బరినీటిలో సోడియం, పొటాషియం, మెగ్నీషియం ఉంటాయి. ఇలాంటి ఖనిజాలని మనం Electrolytes అంటాము. గుండె కొట్టుకోవడం, రక్తపోటు నియంత్రణలో ఉండటం, కండరాలు పనిచేయడం వంటి ముఖ్యమైన జీవచర్యలకు ఇవి చాలా అవసరం. అందుకే శరీరం నిస్సత్తువుగా ఉన్నప్పుడు కానీ, అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు కానీ కొబ్బరినీళ్లు తాగించమని చెబుతుంటారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఎలక్ట్రాల్ పౌడర్ వంటి మందులు ఒంటికి ఎంత ఉపయోగపడతాయో... కొబ్బరినీరు దాదాపు అంతే ఉపయోగపడతాయి.

 

- ఎండాకాలం చాలామందిని వేధించే సమస్య తలనొప్పి. ఎండ తీక్షణత చేతనో, ఒంట్లో నీరు తగ్గిపోవడం చేతనో... ఈ కాలంలో తలనొప్పి తరచూ పలకరిస్తూ ఉంటుంది. ముఖ్యంగా మైగ్రేన్లతో బాధడేవారికి ఎండాకాలం నరకం చూపిస్తుంది. కొబ్బరినీరు ఈ తలనొప్పికి దివ్యౌషధంగా పనిచేస్తాయని చెబుతున్నారు. కొబ్బరినీరు ఒంట్లోని తేమని భర్తీ చేస్తుంది. పైగా ఇందులో ఉండే మెగ్నీషియం తలనొప్పి తీవ్రతని తగ్గిస్తుంది.

 

- మధుమేహంతో బాధపడేవారు దాహం తీరేందుకు పళ్లరసాలు, శీతల పానీయాలు తీసుకోవడం వల్ల అసలుకే మోసం వస్తుంది. కొబ్బరినీటితో ఈ ప్రమాదం లేకపోగా... ఇందులో ఉండే అమినో యాసిడ్స్ వల్ల రక్తంలో చక్కెర నిల్వలు తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారు.

 

- కిడ్నీలో రాళ్లతో బాధపడటం ఈ రోజుల్లో అతి సహజంగా మారిపోయింది. వీటిలో ఎక్కువశాతం కాల్షియం, ఆక్సిలేట్ వంటి పదార్థాలతో ఏర్పడతాయి. ఇలా కిడ్నీ లేదా మూత్రాశయంలో రాళ్లు ఏర్పడకుండా చూడటంలో కొబ్బరినీరు పనిచేస్తుందని తేలింది.

 

- ఎండాకాలంలో విరేచనాలు సర్వసాధారణం. వీటివల్ల శరీరం డీహైడ్రేషన్కు లోనవుతుంది. శరీరం కోల్పోయిన నీటిని తిరిగి భర్తీ చేసేందుకు కొబ్బరినీరు ఉపయోగపడుతుంది. WHO సంస్థ సూచించే ORS నీటితో సమానంగా కొబ్బరినీరు పనిచేస్తుందని చెబుతారు.

 

- కొబ్బరినీటిలో పొటాషియం ఎక్కువగానూ, సోడియం తక్కువగానూ ఉంటాయి. రక్తపోటుని అదుపులో ఉంచడంలో ఈ నిష్పత్తి చాలా ప్రభావం చూపుతుంది. అందుకే కొబ్బరినీరు తాగేవారిలో రక్తపోటు తగ్గుతుందని కొన్ని పరిశోధనలు నిరూపించాయి.

 

ఒక్కమాటలో చెప్పాలంటే... ఖరీదైన స్పోర్ట్స్ డ్రింక్స్కంటే కూడా కొబ్బరినీరే ఎక్కువ ఉపయోగం అని వైద్యులు సైతం తేల్చేశారు. మరింకెందుకాలస్యం... దాహం వస్తే కొబ్బరినీటికే ఓటు వేద్దాం.

- నిర్జర.