చనిపోయేలోగా ఏం చేయాలనుకుంటున్నారు!

 


చావు ఎవరికైనా భయాన్ని కలిగించేందే! మనం ఈ లోకం నుంచి శాశ్వతంగా, హఠాత్తుగా సెలవు తీసుకునే సందర్భాన్ని ఊహించడానికే బాధగా ఉంటుంది. అందుకే జనం తాము చనిపోతామనే భావనని వీలైనంతగా మనసు లోలోతుల్లో మరుగున పెట్టేస్తూ ఉంటారు. కానీ చావు ఉంటేనే కదా జీవితానికి విలువ ఉండేది. మృత్యవు ఒకటి ఉందన్న భావన ఉన్నప్పుడే కదా, చేతిలో ఉన్న జీవితాన్ని సద్వినియోగం చేసుకోవాలన్న తపన కలిగేది. అందుకనే అమెరికాకు చెందిన ‘క్యాండీ చాంగ్‌’ అనే యువతి ఒక ప్రాజెక్టుని ప్రారంభించింది. అదే- Before I Die.

 

 

తోటివారిని కోల్పోవడంతో

క్యాండీ చాంగ్‌ అమెరికాలో స్థిరపడిని ఒక తైవాన్‌ చిత్రకారిణి. వృత్తిపరంగానూ, వ్యక్తిగతంగానూ ఆమె జీవితం సాఫీగానే సాగిపోతూ ఉండేది. కానీ కొన్నాళ్ల క్రితం ఆమె మనసుకు చాలా దగ్గరగా ఉన్న వ్యక్తి ఒకరు హఠాత్తుగా కాలేయం దెబ్బతినడంతో చనిపోయారు. చావు సహజమే అయినప్పటికీ, ఎన్ని రోజులు గడిచినా దానికి సంబంధించిన ఆలోచనల నుంచి బయటపడలేకపోయింది క్యాండీ. ‘మనుషులు బతుకుతున్నారు, చనిపోతున్నారు... మరి చనిపోయేలోపల తాము ఏం చేయాలో వారికి ఏమన్నా లక్ష్యం ఉందా?’ అన్న ఆలోచన వచ్చింది క్యాండీకి. ఆలోచన వచ్చిందే తడువుగా దాన్ని ఇతరులతో పంచుకోవాలని అనుకుంది.

 

 

పాడుబడ్డ గోడ మీద

క్యాండీ అమెరికాలోని ‘న్యూ ఆర్లియన్స్’ నగరంలో నివసిస్తోంది. తనకు వచ్చిన ఆలోచనకి ఒక రూపం ఇచ్చేందుకు ఆమె తన ఇంటి పక్కనే ఉన్న ఒక పాడుపడిన ఇంటిని ఎంచుకొంది. ఆ గోడ మీద "Before I die I want to ________" అంటూ రాసి ఉంచింది. దాని మీద దారిన పోయేవారు తమతమ అభిప్రాయాలను వెల్లడించవచ్చన్నమాట. క్యాండీ చేసిన ఈ ప్రయోగం ఊహించని ఫలితాలను ఇచ్చింది. అటుగా వెళ్లేవారంతా ఆగి ఆ ప్రశ్నని చూసి కాసేపు తమలో తాము మధనపడి, మనసు లోతుల్లోంచి రాసిన వాక్యాలన్నీ చూసి క్యాండీ ఆశ్చర్యపోయింది.

 

మనిషిలో కోరిక

ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన రావడంతో క్యాండీ ఇతర చోట్ల కూడా ఇలాంటి ప్రయోగమే చేసింది. క్యాండీ ప్రయోగాన్ని చూసి... ప్రపంచంలో ఎందరో ఆమెను అనుకరించడం మొదలుపెట్టారు. అలా ఇప్పటివరకూ 70కి పైగా దేశాలలో, 35కి పైగా భాషలలో వేయికి పైగా గోడల మీద ‘నేను చనిపోయేలోగా ఏం చేయాలనుకుంటున్నానంటే ______’ అంటూ ప్రజలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. అందులో ప్రతి ఒక్క కోరికా భిన్నమైనదే. ‘నా తల్లిదండ్రులకు గర్వకారణంగా నిలవాలని అనుకుంటున్నాను’ అని ఒకరంటే ‘నా కూతురు చదువు పూర్తిచేయడాన్ని చూడాలి’ అని ఇంకొకరు కోరుకున్నారు. ‘సమసమాజాన్ని చూడాలని’ ఒకరు ఆశిస్తే ‘కాలినడకన ప్రపంచాన్ని చుట్టాలని’ మరొకరు భావించారు. ఒకటా రెండా వేలకొద్దీ రాసిన రాతల మీద ప్రతి భావమూ భిన్నమైనదే!

 

ఉపయోగం

ఎందుకు జీవిస్తున్నామో కూడా తెలియనంత అయోమయంలో పరుగులెత్తుతున్న మనిషి ఒక్కసారి ఆగి, తన గురించి తాను ఆలోచించుకునే అవకాశమే ఈ Before I Die ప్రశ్న. పైగా ఒకోసారి చావు గురించిన ఆలోచన జీవితపు విలువను గుర్తుచేస్తుంది. తన లక్ష్యాలు ఏమిటి, ప్రాధాన్యతలు ఏమిటి అని నిర్ణయించుకోవాల్సిన హెచ్చరికను అందిస్తుంది. అలాంటి అవకాశం ఈ ప్రశ్న కల్పిస్తుంది. ఇంతకీ ఈ ప్రశ్నకు మీరిచ్చే జవాబు ఏమిటి???

 

- నిర్జర.