Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...15 నిమిషాల్లో ఎఫ్ఐఆర్ నమోదా? పోలీసులపై హైకోర్టు సీరియస్.. జైలు నుండి సంజయ్ రిలీజ్
posted on: Jan 5, 2022 3:08PM
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కు హైకోర్టులో ఊరట లభించింది. సంజయ్‌ను విడుదల చేయాలని హైకోర్టు మద్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. జ్యూడీషియల్ రిమాండ్ పై హైకోర్టు స్టే విధించింది. వ్యక్తిగత పూచి 40 వేల బాండ్ పై విడుదల చేయాలని జైళ్ల శాఖ డీజీని హైకోర్టు ఆదేశించింది. కొవిడ్ నిబంధనలను ఉల్లంఘించారని రిమాండ్‌కు ఆదేశాలివ్వడం సరికాదని హైకోర్టు కామెంట్ చేసింది. ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈనెల 7కు హైకోర్టు వాయిదా వేసింది.
విచారణ సందర్భంగా బండి సంజయ్‌ని అరెస్టు చేసిన తీరును హైకోర్టు తప్పుబట్టింది. రాత్రి 10.50 గంటలకు అరెస్టు చేస్తే.. 11.15 గంటలకు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారని పేర్కొంది. అరెస్టు చేసిన 15 నిమిషాల్లోనే ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడం ఎలా సాధ్యమైందని ప్రశ్నించింది. ఎఫ్‌ఐఆర్‌లో అదనంగా 333 సెక్షన్‌ను ఎందుకు చేర్చారో వివరణ ఇవ్వాలని తెలిపింది. తోపులాటలో పోలీసులు గాయపడ్డారని పేర్కొన్నారని.. కానీ రిమాండ్ రిపోర్టులో మాత్రం పోలీసుల గాయాలపై ఎలాంటి మెడికల్ రిపోర్టులు అందించలేదని తెలిపింది. కొవిడ్ నిబంధనల ఉల్లంఘనకు 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ విధించడం సరికాదని ఉన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. ఈ మేరకు బండి సంజయ్ రిమాండ్‌పై స్టే విధించిన ధర్మాసనం.. పూర్తి వివరాలు సమర్పించాలని ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.
ఉద్యోగ, ఉపాధ్యాయుల బదిలీల కోసం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో 317ను సవరించాలని డిమాండ్ చేస్తూ బండి సంజయ్ ఆధ్వర్యంలో కరీంనగర్‌లో చేపట్టిన తలపెట్టిన జాగరణ దీక్ష ఉద్రిక్తతకు దారితీసింది. ఈ సందర్భంగా తనతోపాటు విధుల్లో ఉన్న మరో 11 మంది పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయని హుజూరాబాద్ ఇన్‌స్పెక్టర్ వి.శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదుతో సంజయ్, మరో 16 మందిపై 8 సెక్షన్ల కింద కేసులను నమోదు చేశారు. సంజయ్ సహా ఆరుగురిని ఈ నెల 2వ తేదీన అరెస్టు చేసి మరుసటి రోజు కోర్టులో హాజరుపరిచారు. మిగతా 11 మంది పరారీలో ఉన్నట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా కార్యక్రమాన్ని నిర్వహించడం, కొవిడ్ నిబంధనల్ని ఉల్లంఘించి.. విధి నిర్వహణలో ఉన్న పోలీసులను అడ్డుకుని ఆస్తినష్టాన్ని కలిగించారని, ఇందుకు సంజయ్‌తోపాటు మరికొందరు కారణమని కరీంనగర్ రెండో ఠాణా పోలీసులు రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. ఇందులో సంజయ్‌ను ప్రధాన నిందితుడిగా పేర్కొనడంతోపాటు గతంలో ఈయనపై ఉన్న 10 కేసులనూ రిమాండ్ నివేదికలో ప్రస్తావించారు. కేసులు నమోదుచేసి న్యాయస్థానంలో హాజరుపరచగా.. 14 రోజులు రిమాండ్‌కు తరలించాలని కరీంనగర్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఆదేశించారు. దీంతో సంజయ్‌ని కరీంనగర్ జిల్లా జైలుకు తరలించారు.



.webp)


