విజయశాంతిని పొగడ్తలతో ముంచెత్తిన బండి సంజయ్

posted on: Nov 3, 2020 3:48PM

తెలంగాణ కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి బీజేపీలో చేరనున్నారంటూ జోరుగా ప్రచారం సాగుతోన్న సంగతి తెలిసిందే. కరోనా ఉధృతి కారణంగానే ఆమె పార్టీ కార్యక్రమాలకు, దుబ్బాక ప్రచారానికి దూరంగా ఉన్నారని కాంగ్రెస్ పార్టీ నేతలు చెబుతున్నప్పటికీ.. ఆమె కాంగ్రెస్ పార్టీ తీరుపై అసంతృప్తిగా ఉన్నారని వార్తలొస్తున్నాయి. ఇటీవల కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి ఆమె నివాసానికి వెళ్లి మాట్లాడడంతో ఈ వార్తలకు ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక  తాజాగా తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ కుమార్ సైతం విజయశాంతిపై ప్రశంసలు కురిపించడం చూస్తుంటే త్వరలోనే ఆమె కాషాయదళంలో చేరుతారన్న వాదనలకు బలం చేకూరుతోంది.

 

విజయశాంతి గురించి బండి సంజయ్ మీడియా ఎదుట ప్రస్తావించారు. విజయశాంతి ప్రజాదరణ ఉన్న నాయకురాలని, తెలంగాణ ఉద్యమంలో విజయశాంతి కీలకంగా వ్యవహరించారని  కొనియాడారు. తెలంగాణ గ్రామాల్లో ప్రజలను ఆమె చైతన్యం చేశారని తెలిపారు. కానీ, తెలంగాణ వచ్చాక విజయశాంతిని పార్టీలు నిర్లక్ష్యం చేశాయని పేర్కొన్నారు. విజయశాంతి బీజేపీలో చేరికపై జోరుగా ప్రచారం సాగుతున్న ఈ తరుణంలో బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.

google-ad-img
    Related Sigment News
    • Loading...