బిజెపి నేతకు సమైక్యాంధ్ర సెగ

posted on: Oct 26, 2011 9:39AM

విశాఖపట్నం: బిజెపి సీనియర్ నేత బండారు దత్తాత్రేయకు విశాఖపట్నంలో సమైక్యాంధ్ర సెగ తగిలింది. దత్తాత్రేయకు వ్యతిరేకంగా సమైక్యాంధ్ర జెఎసి కార్యకర్తలు ఆందోళనకు దిగారు.బండారు దత్తాత్రేయ దిగిన హోటల్ వద్ద వారు నినాదాలు చేస్తూ ఆందోళన సాగించారు. హోటల్లో దత్తాత్రేయ మీడియా ప్రతినిధుల సమావేశాన్ని అడ్డుకోవడానికి వారు ప్రయత్నించారు. గో బ్యాక్ అంటూ దత్తాత్రేయకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బిజెపి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును బలపరుస్తుండడంతో దత్తాత్రేయకు వ్యతిరేకంగా సమైక్యాంధ్ర జెఎసి ప్రతినిధులు ఆందోళనకు దిగారు.రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలనే డిమాండు సీమాంధ్ర ప్రాంతంలో రోజు రోజుకూ ఉధృతమవుతోంది. విశాఖ జిల్లా శాసనసభ్యుడు ద్రోణంరాజు శ్రీనివాస్ ఇంటిని సమైక్యాంధ్ర విద్యార్థి ఐక్య కార్యాచరణ సమితి నేతలు మంగళవారం ముట్టడించారు.

 సమైక్యాంధ్రకు మద్దతుగా కేంద్ర ప్రభుత్వంతో స్పష్టమైన ప్రకటన చేయించాలని వారు డిమాండ్ చేశారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని ముక్కలు చేస్తే సహించేది లేదన్నారు.కాగా సమైక్యాంధ్ర ఐక్య కార్యాచరణ సమితి రాష్ట్రాన్ని సమైక్యాంగానే ఉంచుతామని ప్రకటన చేయాలని కేంద్రానికి నవంబర్ 1వ తేది డెడ్ లైన్ విధించిన విషయం తెలిసిందే. ఐకాస ప్రకటన మేరకు గత నాలుగైదు రోజులుగా సీమాంధ్రలో సమైక్య రాష్ట్రం కోసం ఆందోళనలు జరుగుతున్నాయి. డెడ్ లైన్ లోగా కేంద్రం సమైక్య రాష్ట్రానికి అనుకూలంగా ప్రకటన చేయకుంటే ఆ తర్వాత అసెంబ్లీ ముందు దీక్షకు దిగుతామని హెచ్చరించారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...