హైటెక్‌ సిటీని తీసేయాలి.. ఆ దమ్ము మీకుందా?

posted on: Dec 3, 2018 9:41AM

 

ఎన్నికల ప్రచారంలో భాగంగా శేరిలింగంపల్లి నియోజకవర్గం వివేకానందనగర్‌ కాలనీలో నిర్వహించిన రోడ్ షోలో నందమూరి బాలకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన తన స్పీచ్ తో అందరిని ఆకట్టుకున్నారు. కార్యకర్తల్లో నూతనోత్సాహాన్ని నింపారు. మీది లాటరీ. చంద్రబాబుది హిస్టరీ. చంద్రబాబు చరిత్రను చెరిపేయాలనుకొంటే దునియాపై మూకుడు కప్పేయడమే. నగరంలో 15 ఏళ్ల క్రితమే రాళ్ల గుట్టలపై ఐటీ సామ్రాజ్యాన్ని నిర్మించి.. ప్రపంచ మేధావులను రప్పించిన ఘనత చంద్రబాబుది. ఆయన చరిత్రను చెరిపేయాలన్నా, పేజీలు చించేయాలన్నా హైటెక్‌ సిటీని తీసేయాలి.. ఆ దమ్ము మీకుందా? ఫ్లైఓవర్లు మాయం చేయాలి.. ఆ ధైర్యం మీకుందా? అని ప్రశించారు. రింగురోడ్డును అదృశ్యం చేయాలి. శంషాబాద్‌ ఇంటర్‌నేషనల్‌ ఎయిర్‌పోర్టును తీసేయాలి. బిడ్డా.. తీసేసి చూడండి. చంద్రబాబు కట్టించిన స్పోర్ట్స్‌ సెంటర్లపై బట్టలు కప్పాలి.. కప్పి చూడండి అని వ్యాఖ్యానించారు. సైబరాబాద్‌ను సృష్టించింది చంద్రబాబేనని.. తెలంగాణలో భూస్వాములు, పెత్తందారులు, గడీల వ్యవస్థను రూపుమాపింది తెలుగుదేశమేనని గుర్తుచేశారు. ఎందరో త్యాగాలు చేస్తే వచ్చిన తెలంగాణలో ఉద్యోగాలు, ఉపాధి లేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని.. అమరవీరులు, విద్యార్థుల త్యాగాలను గుర్తించాల్సిన అవసరముందని అన్నారు.

తెలంగాణలో రైతు రాజ్యం వస్తుందనుకొంటే రాబందుల రాజ్యం వచ్చిందని ఆరోపించారు. ప్రభుత్వం రైతులను ఇబ్బంది పెట్టడంతోనే వందల మంది ఆత్మహత్యలు చేసుకొన్నారన్నారు. శేరిలింగంపల్లి టీడీపీకి కంచుకోటగా మారిందని, గత ఎన్నికల్లో టీడీపీ టికెట్‌పై గెలిచి వలస వెళ్లిన నయవంచకులకు తగిన బుద్ధి చెప్పాలని కోరారు. 'తెలుగుదేశం పార్టీ ఉండదని కొందరు కారు కూతలు కూస్తున్నారు. తెలుగుదేశం ఒక కులం కోసం పుట్టిన పార్టీ కాదు కూలిపోవడానికి.. మతం కోసం పుట్టిన పార్టీ కాదు మట్టిలో కలిసి పోవడానికి.. ధనదాహంతో పుట్టిన పార్టీ కాదు అడ్డదారులు చూసుకోవడానికి.. నాయకుల కోసం పుట్టిన పార్టీ కాదు వలస పోతే నట్టేట మునిగిపోవడానికి.. హైదరాబాద్‌ నగర నడిబొడ్డున పుట్టింది తెలుగుదేశం పార్టీ’ అని బాలకృష్ణ ఉద్వేగభరితంగా మాట్లాడారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...