TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మాజీ మంత్రి నారాయణకు బెయిలు- వైసీపీ ప్లాన్ అట్టర్ ప్లాప్

Published on: Wed May 11, 2022 7:13AM

పదో తరగతి ప్రశ్న పత్రాల లీక్ కేసులో అరెస్ట్ అయిన నారాయణ విద్యాసంస్థల అధినేత, ఏపీ మాజీ మంత్రి నారాయణకు బెయిలు మంజూరైంది. టెన్త్ పేపర్ల లీక్ కేసులో ఆయనను ఏపీ సీఐడీ మంగళవారం హైదరాబాద్‌లో అరెస్ట్ చేసిన  చిత్తూరు తరలించిన సంగతి తెలిసిందే. వైద్య పరీక్షల అనంతరం మేజిస్ట్రేట్ ఎదుట నారాయణను హాజరుపరిచారు.   పోలీసులు నారాయణపై మోపిన అభియోగాలను తోసిపుచ్చిన న్యాయమూర్తి సులోచనారాణి  ఆయనకు బెయిలు మంజూరు చేశారు. నారాయణ విద్యాసంస్థల చైర్మన్ పదవికి నారాయణ 2014లోనే రాజీనామా చేసినట్టు ఆయన తరపు న్యాయవాదులు కోర్టుకు ఆధారాలు చూపించారు. ఆ వాదనలతో  ఏకీభవించిన కోర్టు బెయిలు మంజూరు చేసింది.  

నారాయణ అరెస్టు కక్ష సాధింపు చర్చేనని తెలుగుదేశం అధినేత చంద్రబాబు పేర్కొన్న సంగతి తెలిసిందే.  ఇప్పుడు నారాయణపై అభియోగాలను కోర్టు తోసిపుచ్చి ఆయనకు బెయిలు మంజూరు చేయడంతో ఎలాగైనా జైలుకు పంపి వేధింపులకు గురి చేయాలన్న వైసీపీ ప్లాన్ అట్టర్ ప్లాప్ అయ్యిందని నెటిజన్లు సర్కార్ ను ట్రోల్ చేస్తున్నారు. ఒక పథకం ప్రకారం తెలుగుదేశం నేతలను టార్గెట్ చేస్తూ, వారిని కేసులు, అరెస్టులతో వేధింపులకు గురి చేస్తున్న వైసీపీ సర్కార్ కు నారాయణపై అభియోగాలను కోర్టు తోసిపుచ్చిబెయిలు మంజూరు చేయడం చక్కటి గుణపాఠం అని పరిశీలకులు అంటున్నారు.

అక్రమ కేసులతో వేధింపులకు గురి చేస్తే ఎదురు దెబ్బలు తప్పవన్న సంగతి ఇప్పటికైనా జగన్ అర్ధం చేసుకుంటే మేలని అంటున్నారు.  టెన్త్ పేపర్ల లీక్ విషయంలో బాధ్యత తీసుకోవలసిన బొత్స సత్యనారాయణ బాధ్యతా రహితంగా లీకే లేదని మాట్లాడుతుంటే.. ప్రభుత్వం పోలీసులు మాత్రం పేపర్లు లీక్ అయ్యాయంటూ అరెస్టులు చేయడాన్ని విద్యారంగ నిపుణులు తప్పుపడుతున్నారు. ముందు మంత్రి బొత్స సత్యనారాయణ పేపర్ల లీక్ కు బాధ్యత తీసుకుని రాజీనామా చేయాలని, లీకేజి వెనుక ఎవరున్నారన్నది నిష్పాక్షికంగా దర్యాపు జరిపి బాధ్యులకు శిక్షించాలని విద్యారంగ నిపుణులు సూచిస్తున్నారు.