నడుంనొప్పితో డిప్రెషన్ తప్పదా!

 

నడుంనొప్పి- పిలవని అతిథిలాగా పలకరించే సమస్య! ఎందుక వచ్చిందో తెలుసుకునేలోపే నిలబడనీయనంత బాధని మిగులుస్తుంది. ఇక వచ్చిన తరువాత ఎలా వదిలించుకోవాలో తెలియక తలలు బాదుకోవాల్సి వస్తుంది. శరీరంలో ఏదో ఒక బాధ ఉన్నప్పుడు మనసు కూడా చికాకుగా ఉండటం సహజమే! కానీ డిప్రెషన్, చిత్తభ్రాంతిలాంటి తీవ్రమైన మానసిక సమస్యలకీ శారీరిక సమస్యలకీ మధ్య సంబంధాన్ని ఊహించడం కష్టం. నడుము నొప్పి ఉన్నవారిలో ఇలాంటి అదనపు సమస్యలు కూడా ఏర్పడతాయని హెచ్చరిస్తున్నారు పరిశోధకులు.

 

పేదదేశాలలోనే ఎక్కువ:

ఒక దేశం ధనిక దేశమా, పేద దేశమా అన్న అంశం మీద అక్కడి ప్రజలలో నడుము నొప్పి ఆధారపడి ఉంటుందంటే ఆశ్చర్యం కలుగక మానదు. కానీ ఇది నిజం! దనిక దేశాలతో పోల్చుకుంటే పేద, అభివృద్ధి చెందుతున్న దేశాలలో నడుం నొప్పితో బాధపడేవారి సంఖ్య చాలా ఎక్కువగా ఉన్న విషయాన్ని ‘ప్రపంచ ఆరోగ్య సంస్థ’ ఏనాదో ధృవీకరించింది. వెనుకబడిన దేశాలలో సగటున మూడోవంతు మంది జనం నడుము నొప్పితో బాధపడుతున్నట్లు తేల్చింది. వ్యవసాయం, భవన నిర్మాణం వంటి పనులలో పాల్గొనేవారి సంఖ్య ఎక్కువగా ఉండటం ఇందుకు ముఖ్య కారణం అయితే... నడుము నొప్పి వచ్చినా కూడా దానికి చికిత్స తీసుకునే ఆర్థిక స్తోమత లేక, బతుకుబండిని భారంగా లాగడం మరో కారణం. అందుకే బంగ్లాదేశ్, బ్రెజిల్ వంటి పేద దేశాలలో 50 శాతానికి పైగా జనం నడుము నొప్పితో బాధపడుతున్నట్లు సదరు గణాంకాలతో వెల్లడయ్యింది.

 

మానసిక సమస్యలు అదనం:

ఇవే గణాంకాలను ఆధారం చేసుకుని లండన్కు చెందిన కొందరు పరిశోధకులు మరో విషయాన్ని కనుగొనే ప్రయత్నం చేశారు. ఇతరులతో పోలిస్తే నడుము నొప్పి ఉన్నవారిలో ఏవన్నా మానసిక సమస్యలు కూడా ఉన్నాయేమో అని పరిశీలించారు. నిజంగానే వారిలో ఉద్వేగం (anxiety), క్రుంగుబాటు (depression), భ్రాంతి (psychosis), ఒత్తిడి (stress), నిద్రలేమి (sleep deprivation) అనే అయిదు రకాల మానసిక సమస్యలలో ఏదో ఒకటి ఉన్నట్లు తేల్చారు. ఇతరులతో పోలిస్తే నడుము నొప్పి ఉన్నవారిలో ఈ లక్షణాలు రెండు రెట్లు అధికంగా ఉన్నట్లు తేలింది. వీరిలో డిప్రెషన్ ఏర్పడే ప్రమాదం అయితే ఏకంగా మూడు రెట్లు అధికంగా ఉన్నట్లు తేలింది.

 

కారణం తేలలేదు కానీ...

నడుము నొప్పికీ మానసిక సమస్యలకీ మధ్య కార్యకారణ సంబంధం ఏమిటో పరిశోధకులు చెప్పలేకపోతున్నారు. అయితే ఈ గణాంకాలన్నీ కూడా పేద, అభివృద్ధి చెందుతున్న దేశప్రజలకు సంబంధించినవి కాబట్టి... వారి అర్థిక స్థితి కారణంగానే అటు నడుము నొప్పీ, ఇటు మానసిక సమస్యలు కూడా జంటగా కనిపిస్తున్నాయని కొందరి విశ్లేషణ. అందుకే నడుము నొప్పి రాగానే అదేదో సాధారణమైన సమస్యగా భావించి అశ్రద్ధ చేయకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని హెచ్చరిస్తున్నారు. తగినంత నిద్ర, అవసరమైనంత వ్యాయామం, వ్యసనాలకు దూరంగా ఉండటం, శరీర భంగిమను మార్చుకోవడం, వైద్యులని సంప్రదించడం... వంటి చిన్నపాటి చర్యలతో నడుమునొప్పిని అదుపులో ఉంచుకోవచ్చునని సూచిస్తున్నారు. 

-నిర్జర.