బి విటమిన్‌తో కాలుష్యం నుంచి రక్షణ


వాయుకాలుష్యం గురించి మళ్లీ చెప్పుకోవాల్సిన అవసరం ఏముంది. పరిశ్రమలు, వాహనాల కారణంగా గాల్లోకి విపరీతంగా ధూళికణాలు చేరుకుంటున్న విషయం అందరూ మొత్తుకొంటున్నదే! మొహానికి మాస్క్‌ వేసుకోవడం తప్ప ఈ కాలుష్యం నుంచి తప్పించుకునేందుకు మరో మార్గం లేదని అందరూ నమ్మేవారు. కానీ బి విటమిన్‌తో, కాలుష్యం కలిగించే హాని నుంచి తప్పించుకోవచ్చునని ఇప్పుడిప్పుడే తెలుస్తోంది.

 

ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం దాదాపు 90 శాతం మంది ప్రజలు పరిమితి మించిన కాలుష్యం ఉన్న ప్రాంతాలలో నివసిస్తున్నారు. ఈ కాలుష్యంలో ఉండే ధూళికణాలని P.M అనే పరిమాణంలో లెక్క వేస్తారు. ఒక ప్రాంతంలోని ధూళి కణాలు 2.5 P.M కంటే తక్కువ ఉంటే... అక్కడి ప్రజలు మృత్యువుతో కలిసి జీవిస్తున్నట్లే! మన వెంట్రుకలో 30వ వంతు ఉండే ఈ ధూళి కణాలు నేరుగా మన ఊపిరితిత్తులలోకి చేరిపోతాయి.

 

ఊపిరితిత్తులలోకి చేరిన ధూళికణాలు తీవ్రమైన శ్వాసకోశ వ్యాధులకు దారితీస్తాయి. పసిపిల్లల పాలిట అయితే ప్రాణాంతకంగా మారతాయి. ఈ ధూళికణాలు నేరుగా మెదడులోకి కూడా చేరతాయనే ఈమధ్యే మరో పరిశోధన తేల్చింది. దీంతో మెదడులో ఊహించన మార్పులు జరుగుతాయనీ... మన ఆలోచనా సామర్థ్యం, జ్ఞాపకశక్తి మీద తీవ్ర ప్రభావం చూపుతాయనీ చెబుతున్నారు. ఇక శరీరంలోని చేరిన ధూళికణాలు ఏకంగా మన జన్యువుల పనితీరునే మార్చివేస్తాయన్నది మరో విశ్లేషణ. దీనివల్ల మన రోగనిరోధక శక్తి తీవ్రంగా దెబ్బతిని ఏకంగా కేన్సర్‌ వంటి వ్యాధులు దాడిచేసే ప్రమాదం ఉంది.

 

ఇదంతా కూడా వాయుకాలుష్యం వల్ల జరిగే అనర్థం. రోజూ పొట్ట చేతపట్టుకుని తిరిగేవారు ఈ అనర్థాల నుంచి తప్పించుకోవడం అసాధ్యం. అయితే బి విటమిన్‌ సప్లిమెంట్లను తీసుకోవడం వల్ల కాలుష్య కోరల నుంచి తప్పించుకోవచ్చునని ఓ పరిశోధన నిరూపిస్తోంది. ఈ విషయాన్నే నిరూపించేందుకు అమెరికాలోని పరిశోధకులు కొంతమందికి ఫోలిక్‌ యాసిడ్‌, B6, B12 ఉన్న మందులను అందించారు. ఆ తరువాత వీరిని 2.5P.M ధూళికణాలు ఉన్న వాతావరణంలోకి పంపించారు. ఆశ్చర్యకరంగా వీరి జన్యువుల మీద ఈ ధూళికణాల ప్రభావం దాదాపు 76 శాతం తగ్గిపోయినట్లు తేలింది.

 

కాలుష్యాన్ని ఎదుర్కొనేందుకు బీ విటమిన్‌ తోడ్పడుతుందని తేలడం ఇదే తొలిసారి. కాబట్టి ఈ విషయమై మరిన్ని పరిశోధనలు జరగాల్సి ఉంటుంది. ఏది ఏమైనా బీ విటమిన్‌ వంటి పోషకాలు అధికంగా ఉండే దంపుడు బియ్యం, పాలు, గుడ్లు, కాయగూరలని తరచూ తీసుకోవడం వల్ల అపరిమితమైన ఆరోగ్యం దక్కుతుందని వేరే చెప్పనవసరం లేదు. ఇక వాటిలోని పోషకాలు ఏకంగా కాలుష్యపు కోరల నుంచి రక్షిస్తాయంటే ఇక చెప్పేదేముంది.

 

- నిర్జర.