ఈఎస్ఐ స్కామ్ లో మంత్రి కుమారుడికి బెంజి కారు లంచం.. అయ్యన్న సంచలన ఆరోపణలు   

ఏపీ కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాంపై టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు సంచలన ఆరోపణలు చేశారు. కొద్దిసేపటి క్రితం విశాఖలో మీడియాతో మాట్లాడుతూ ఈఎస్ఐ స్కాంలో ఏ14 నిందితుడిగా ఉన్న కార్తీక్ మంత్రి జయరాం కుమారుడికి బెంజ్ కారును బహుమతిగా ఇచ్చాడని అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏ సంబంధంతో కార్తీక్ కారును కానుకగా ఇచ్చారో మంత్రి సమాధానం ఇవ్వాలి. ఏ 14 ఐన కార్తీక్ మంత్రి జయరాంకు బినామీ. ఆ కారు పుట్టినరోజు కానుక కాదు.. అది మంత్రికి అతడు ఇచ్చిన లంచం. అంతేకాకుండా కార్మిక శాఖలో అవినీతికి పాల్పడింది అచ్చెన్నాయడు కాదు.. మంత్రి జయరాం. దీనిపై న్యాయస్థానంతో విచారణ చేయించాలి. ఈఎస్ఐ స్కాంలో నిందితుడిగా ఉన్న ప్రమోద్ రెడ్డిని ఏసీబీ అధికారులు ఎందుకు ఇంతవరకు అరెస్ట్ చేయలేదని ఆయన ప్రశ్నించారు

 

సీఎం జగన్ కు కార్మికశాఖ మంత్రి జయరాంపై దర్యాప్తు చేసే దమ్ము ఉందా..? మేము ప్రశ్నిస్తే మమ్మల్ని ముఖ్యమంత్రి బూతులు తిట్టిస్తున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలపై సీఎం మాత్రం నోరు మెదపరు. ఒకవేళ జగన్‌కు చిత్తశుద్ధి ఉంటే మంత్రి జయరాంతో రాజీనామా చేయించాలి లేదంటే మంత్రి మండలి నుంచి జయరాంను తప్పించాల్సిందే. దీనిపై విచారణకు ఆదేశిస్తే తాను ఈ విషయాన్నినిరూపిస్తానని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అవినీతిపరులపై ఫిర్యాదు చేసేందుకు ప్రేవేశపెట్టిన 11440కు లైవ్‌లో కాల్ చేసి మంత్రి కుమారుడు ఈశ్వర్‌పై ఫిర్యాదు చేశారు. మంత్రి జయరాం అవినీతిలో సీఎం జగన్‌కు పోటీ పడుతున్నారని ఆయన ఆరోపించారు. ఈ సందర్భంగా మంత్రి కొడుకుకు ఈఎస్ఐ స్కామ్ లో ఏ 14 నిందితుడుగా ఉన్న కార్తీక్ గిఫ్ట్ అందిస్తున్న కారు ఫోటోను అయ్యన్నపాత్రుడు మీడియాకు విడుదల చేసారు. ఈ ఫోటోను కార్తీక్ తన ఫేస్‌బుక్ లో కూడా పోస్టు చేశాడని ఆయన చెప్పారు.