శాసనసభ సమావేశాలపై రాద్ధాంతం

 

రాష్ట్ర విభజనపై కేంద్ర మంత్రుల బృందం తన తుది నివేదికను ఈనెల 21న కేంద్ర మంత్రి మండలికి సమర్పించనుంది. దానిలో అవసరమయితే మార్పులు చేర్పులు చేసి, ఈనెల 28లోగా రాష్ట్రపతికి పంపనున్నారు. ఆయన దానిని పరిశీలించిన తరువాత రాష్ట్ర శాసనసభ ఆమోదానికి పంపుతారు. ఈ లెక్క ప్రకారం చూస్తే తెలంగాణా బిల్లు ఈనెలాఖరుకి లేదా వచ్చే నెల మొదటి వారంలోగానీ రాష్ట్ర శాసనసభ ముందుకు రాబోతోందని అర్ధం అవుతోంది.

 

అయితే శాసనసభ సమావేశాల తేదీలపై ముఖ్యమంత్రి, స్పీకర్ విభేదిస్తున్నట్లు అప్పుడే మీడియాలో కొన్నివార్తలు కూడా మొదలయ్యాయి. వచ్చేనెల 5న మొదలయ్యే శీతాకాల పార్లమెంటు సమావేశాలు, ఐదు రాష్ట్రాలలో శాసనసభ ఎన్నికలు జరుగుతున్నందున కేవలం 20వరకే జరుగుతాయి.

 

అందువల్ల రాష్ట్ర శాసనసభ సమావేశాలు వెంటనే జరుపకుండా పార్లమెంటు సమావేశాలు ముగిసే వరకు వాయిదా వేసినట్లయితే, పార్లమెంటులో తెలంగాణా బిల్లు ప్రవేశపెట్టకుండా అడ్డుకోవచ్చునని ముఖ్యమంత్రి భావిస్తున్నందున, శాసనసభ సభను ప్రోరోగ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లేఖ వ్రాస్తే దానిపై స్పీకర్ నాదెండ్ల మనోహర్ అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు వార్తలు వస్తున్నాయి.

 

అయితే ఈవిషయంలో ముఖ్యమంత్రి నిర్ణయమే అంతిమ నిర్ణయం గనుక దానిని స్పీకర్ శిరసావహించవలసి ఉంటుంది. తెలంగాణా బిల్లుకి రాష్ట్ర శాసనసభ ఆమోదం అవసరం లేకపోయినా, రాజ్యాంగ పద్దతుల ప్రకారం సభలో కనీసం దానిపై చర్చజరగాలంటే సభ నిర్వహించి తీరాలి. కానీ ముఖ్యమంత్రి అభీష్టానికి విరుద్దంగా సభ నిర్వహించడం సాధ్యం కాకపోతే, తప్పని పరిస్థితుల్లో ఆయనను తొలగించి వేరొకరిని ఆ స్థానంలో నియమించయినా సరే ఈ ప్రక్రియ పూర్తి చేయవలసి ఉంటుంది.

 

కానీ, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఈ తుది చర్చలో తను కూడా పాల్గొన్న తరువాతనే రాజీనామా చేద్దామని భావిస్తున్నందున బహుశః ఆయన వెనక్కి తగ్గి శాసన సభ సమావేశాలకు అంగీకరించవచ్చును. లేకుంటే ఆయన ఇంతకాలంగా చేస్తున్న వాదనలకు అర్ధం ఉండదు.