సభ జరుగు విదంబు ఎట్టిదనగా

 

నేటి నుండి మళ్ళీశాసనసభ శీతాకాల సమావేశాలు మొదలవనున్నాయి. ఈ నెల 23వరకు సాగే ఈ సమావేశాలలో సంక్రాంతి పండుగ సందర్భంగా మధ్యలో మూడు రోజుల పాటు అంటే 13నుండి 15వరకు విరామం ఉంటుంది. జరుగుతున్న పరిణామాలు చూస్తే అన్నిరాజకీయ పార్టీలు ఈ సమావేశాలలో ఏవిధంగా వ్యవాహరించబోతున్నాయో, సభలో ఏమి జరగబోతోందో కూడా ఊహించవచ్చును.

 

ఓం ప్రధమంగా సభ మొదలవగానే సీమాంధ్ర కాంగ్రెస్, వైకాపా సభ్యులు ‘జై సమైఖ్యాంధ్ర’ నినాదాలు చేస్తూ సమైక్యతీర్మానం కోసం పట్టుబడితే, తెలంగాణాకు చెందిన సభ్యులు ‘జై తెలంగాణా’ నినాదాలతో దానిని వ్యతిరేఖిస్తూ అందరూ కలిసి స్పీకర్ నాదెండ్ల మనోహర్ ను చుట్టుముడితే, ఆయన గంటకో, అరగంటకో సభను వాయిదావేస్తుంటారు. ఇక ఒకవేళ సభ జరిగే పరిస్థితే ఏర్పడితే, మొన్న శ్రీధర్ బాబు మంత్రిత్వ శాఖ మార్పు, దానికి నిరసనగా ఆయన రాజీనామా వ్యవహారం పుచ్చుకొని టీ-కాంగ్రెస్, తెరాస నేతలు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై నిప్పులు చెరగడం ఖాయం. అయితే నిన్న కాంగ్రెస్ యంపీ పొన్నం ప్రభాకర్ ముఖ్యమంత్రిపై చేసిన వివాదస్పద వ్యాఖ్యలను ఆయుధంగా చేసుకొని ముఖ్యమంత్రి అనుచరులు ఎదురుదాడికి దిగినప్పుడు వారి వాగ్వాదాలతో సభ దద్దరిల్లడం ఖాయం. కానీ, ఒకరు సమైక్యతీర్మానం కోసం, మరొకరు దానిని వ్యతిరేఖిస్తూ సభను స్తంభింపజేసే అవకాశాలే ఉన్నాయి గనుక బిల్లుపై చర్చ సంగతి దేవుడెరుగు, కనీసం శ్రీధర్ బాబు వ్యవహారంపై కసితీరా వాదోపవాదాలు చేసుకొనే భాగ్యానికి కూడా సభ్యులు నోచుకోకపోవచ్చును.