మా గవర్నర్ ని తక్షణమే మార్చండి ప్లీజ్!

 

అస్సాం మరియు నాగాలాండ్ రాష్ట్రాలకు గవర్నర్ గా వ్యవహరిస్తున్న పద్మనాభ బాలకృష్ణ ఆచార్య చాలా వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. అస్సాంలో జరిగిన ఒక పుస్తకావిష్కరణ సభలో ఆయన మాట్లాడుతూ, “హిందూస్తాన్ హిందువులదే. ఒకవేళ ముస్లింలకు ఇక్కడ ఉండటం ఇబ్బందికరంగా ఉన్నట్లయితే వారు పాకిస్తాన్ వెళ్లిపోవచ్చును,” అని అన్నారు.

 

దానిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తడంతో తన మాటలను మీడియా వక్రీకరించిందని, తను అలాగా అనలేదని వాదించారు. ఆ ప్రయత్నంలో ఆయన ఇచ్చిన వివరణ ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యల కంటే తీవ్రంగా ఉంది. “ఏదయినా ఒక దేశంలో ఒక మతానికి చెందినవారు వివక్ష ఎదుర్కొంటున్నట్లయితే వారు తమకు నచ్చిన దేశంలో శరణు పొందవచ్చును. పాకిస్తాన్, బంగ్లాదేశ్ లలో అనేకమంది హిందువులకు భారత్ ఆశ్రయం కల్పించి ఆదుకొంది. ఆ రెండు దేశాలే కాదు ప్రపంచంలో ఎక్కడ హిందువులు వివక్షకు గురయినా వారిని భారత్ ఆదుకొంటుంది. ఒకవేళ భారత సంతతికి చెందిన క్రీష్టియన్ లేదా ముస్లిం మతస్తుడు పాకిస్తాన్ లో వివక్షకు గురయితే ఎక్కడికి వెళతాడు? భారత్ కే రావాలి. అలాగే భారత్ లో ముస్లింలు వివక్షకు గురయినట్లు భావిస్తే వారు తమకు నచ్చిన దేశానికి (పాకిస్తాన్) స్వేచ్చగా వెళ్లిపోవచ్చునని మాత్రమే చెప్పాను. భారత్ చాలా విశాల హృదయం గల దేశం. అందుకే మన దేశంలో ఆశ్రయం పొందిన టాటాలు, గోద్రెజ్, వాడియా తదితర పార్సీలు ఎంతో ఉన్నత స్థాయికి ఎదగగలిగారు, అని గవర్నర్ పి.బి.ఆచార్య అన్నారు.

 

ఆయన వ్యాఖ్యలపై చాలా తీవ్రంగా స్పందించిన అస్సాం ముఖ్యమంత్రి తరుణ్ గగోయ్ ఆయన ఒక రాష్ట్ర గవర్నర్ లాగ కాకుండా ఒక సామాన్య రాజకీయ నాయకుడిలాగ, ఒక ఆర్.ఎస్.ఎస్.ప్రచారక్ లాగ మాట్లాడుతున్నారని, కనుక అతను అత్యున్నతమయిన గవర్నర్ పదవిలో కొనసాగడానికి ఏమాత్రం అర్హుడు కాడని కనుక ఆయనను తక్షణమే ఆ పదవిలో నుండి తప్పించి రాష్ట్రానికి కొత్త గవర్నర్ నినియమించాలని కేంద్రానికి లేఖ వ్రాసారు.