అశోక్‌బాబు ఘనవిజయం

 

 

 

ఏపీఎన్జీవో ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు పరుచూరి అశోక్‌బాబు ప్యానల్ ఘనవిజయం సాధించింది. అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి సహా పదిహేడు పదవులకు మొత్తం పదిహేడు పదవులను అశోక్‌బాబు వర్గీయులే గెలుచుకున్నారు. వైసీపీ అధినేత జగన్ అండదండలు ఉన్నాయని ప్రచారం జరిగిన బషీర్ ప్యానల్ అశోక్ బాబుకు కనీస పోటీని కూడా ఇవ్వలేకపోయింది.


ఏపీఎన్జీవో సంఘంలో మొత్తం ఓట్లు 847 కాగా.. ఆదివారం జరిగిన ఎన్నికల్లో 815 పోలయ్యాయి. అశోక్ బాబు ప్యానల్‌కు 630 ఓట్లు రాగా.. బషీర్ ప్యానల్‌కు 174 ఓట్లు మాత్రమే దక్కాయి. అధ్యక్ష స్థానానికి పోటీ చేసిన అశోక్‌బాబు 456 ఓట్ల ఆధిక్యంతోనూ.. ప్రధాన కార్యదర్శి పదవికి పోటీ చేసిన చంద్రశేఖర రెడ్డి 425 ఓట్ల ఆధిక్యంతోనూ ఘన విజయం సాధించారు.  ప్రత్యర్థి వర్గమైన బషీర్ ప్యానల్‌లో ఏ ఒక్కరూ కూడా 180 ఓట్లను దాటలేకపోయారు. అధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల స్థానాలకు పోటీ చేసిన బషీర్, పీవీవీ సత్యనారాయణలకు 174.. 183 ఓట్లు మాత్రమే దక్కాయి.



సమైక్య ఉద్యమంలో మరింత ఉధృతంగా పనిచేస్తాననీ, ఈ గెలుపు మరింత బాధ్యతను పెంచిందనీ అశోక్‌బాబు చెప్పుకొచ్చారు. గెలుపోటముల్ని పక్కన పెట్టి, అన్ని సంఘాలతోనూ కలిసి సమైక్య ఉద్యమాన్ని కొనసాగిస్తానన్నారాయన. రేపు అన్ని సంఘాల నేతలతో ప్రత్యేకంగా భేటీ అయి, సమైక్య ఉద్యమానికి సంబంధించి భవిష్యత్‌ కార్యాచరణపై ఆలోచిస్తామని అశోక్‌బాబు చెప్పారు.