TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కేసీఆర్ కు మద్దతుగా అసద్.. ఎంఐఎం బీజేపీ బీ టీమ్ కాదంటూనే కాంగ్రెస్ పై విమర్శల వర్షం

Published on: Mon May 23, 2022 10:43AM

అసదుద్దీన్ ఒవైసీ. ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ. ఈయన గురించి రాజకీయాలు తెలిసిన వారికి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. దశాబ్డం కిందటి వరకూ కేవలం హైదరాబాద్ కే పరిమితమైన ఎంఐఎంను ఉత్తరాదిన విస్తరింప చేయాలన్న లక్ష్యంతో అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎంఐఎం బీజేపీకి బీ టీమ్ గా మారిపోయిందంటూ విమర్శలను కూడా ఎదుర్కొంటున్నారు.

తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీతో అనధికార పొత్తు కొనసాగిస్తున్నారన్న టాక్ కూడా ఉంది. అయితే అసదుద్దీన్ ఒవైసీ చట్ట సభల్లో చేసే ప్రసంగాలను ఆయన ప్రత్యర్థులు సైతం శ్రద్ధగా వింటారు. అతి ముఖ్యమైన సమస్యలను అడ్రెస్ చేస్తూ ఆయన మోడీ సర్కార్ ను ఎండగట్టే తీరును విపక్షాలు స్వాగతిస్తాయి. అయితే ఎన్నికల వేళ ఆయన పోటీ చేసే రాష్ట్రాలు, అభ్యర్థులను నిలపడానికి ఎంచుకునే నియోజకవర్గాలను బట్టి ఆయన బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని విపక్షాలు ఆరోపిస్తుంటాయి.

బీజేపీకి బలహీన అభ్యర్థులు ఉన్నారనుకున్న నియోజకవర్గాలను ఎంపిక చేసుకుని ఆయన తమ పార్టీ  అభ్యర్థులను నిలుపుతారనీ, దాని వల్ల మైనారిటీ ఓట్లు చీలి అంతిమంగా బీజేపీ లబ్ధి పొందుతోందని అంటారు. కానీ ఈ విమర్శలను ఎంఐఎం అధినేత కొట్టి పారేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీయే ఇటువంటి విమర్శలను ఉద్దేశ పూర్వకంగా చేస్తోందని ఎదురు దాడికి దిగుతున్నారు. గత ఎన్నికలలో కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ అమేథీలో పరాజయం పాలైన విషయాన్ని ప్రస్తావిస్తూ, అక్కడ ఎంఐఎం అభ్యర్థి రంగంలో లేడనీ, మరి అక్కడ రాహుల్ గాంధీ పరాజయానికి ఎంఐఎం ఎలా కారణమౌతుందని ప్రశ్నిస్తున్నారు. ఎవరైనా ఎక్కడైనా సరే ఎన్నికలలో విజయం సాధించాలంటే కావలసింది ప్రజా మద్దతేనని ఆయన సూత్రీకరిస్తున్నారు.

తాను మైనారిటీ ఓట్లు చీల్చి బీజేపీ విజయానికి సహకరిస్తున్నానంటూ వస్తున్న విమర్శలు గెలిచే సత్తా లేని కాంగ్రెస్ పార్టీ తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి చేస్తున్న విమర్శలేనని కొట్టి పారేస్తున్నారు.  ఇక ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ పై అయితే అసదుద్దీన్ ఓ రేంజ్ లో విమర్శలు గుప్పిస్తున్నారు. కేజ్రీవాల్ కు బీజేపీ అంటే భయమనీ, అందుకే దేశ రాజధాని నగరంలో అల్లర్లు జరుగుతుంటే కేజ్రీవాల్ ప్రజలకు ముఖం చాటేస్తున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు. ఉరుము లేని మెరుపులా ఆయన కేజ్రావాల్ పై విమర్శలు గుప్పించడానికి కారణం తన రాజకీయ మిత్రుడు కేసీఆర్ జాతీయ అజెండాపై ఆయన స్పందించకపోవడమేనని విశ్లేషకులు అంటున్నారు.

ఇక గుజరాత్ లో మిత్ర పక్షాలతో కలిసి ఎంఐఎం ఎన్నికల బరిలో దిగి మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేస్తున్న అసదుద్దీన్.. విపక్ష బాధ్యత నుంచి కాంగ్రెస్ తప్పుకుందంటూ విమర్శిస్తున్నారు. జ్ణానవాసి మసీదు అంశంపై ప్రధాని మోడీ స్పందించాలన్నారు. సంఘ్ పరివార్ దేశంలో సామరస్యాన్ని దెబ్బతీసే కుట్ర చేస్తున్నదని విమర్శించారు. దేశంలో మత సామరస్యం, శాంతి సౌభ్రాతృత్వం విలసిల్లాలంటే కాంగ్రెస్, బీజేపీలను చిత్తుగా ఓడించాల్సిందేనని దేశ ప్రజలకు పిలుపు నిచ్చారు. మొత్తంగా ఒవైసీ తాజా వ్యాఖ్యలు, విమర్శలు తన రాజకీయ మిత్రుడు కేసీఆర్ జాతీయ అజెండాకు మద్దతుగా ఉన్నాయన్నది పరిశీలకుల విశ్లేషణ. కేసీఆర్ జాతీయ అజెండా అలంబనగా  ఎంఐఎంను ఉత్తరాదిన విస్తరించాలన్న తన ఆకాంక్షను సాకారం చేసుకునే దిశగా అసద్ అడుగులు వేస్తున్నారని పరిశీలకులు అంటున్నారు.