రాహుల్ కంటే ఆమాద్మీయే బెస్ట్ అట!

 

ఉవ్వెత్తున ఎగసిపడి వెనక్కి వెళ్లిపోయిన కెరటంలా, ఆమాద్మీ పార్టీ యావత్ భారతదేశాన్ని ఒక ప్రభంజనంలా కమ్ముకొని, కేవలం 49 రోజులలోనే కుంటిసాకులతో చేతులెత్తేసి అధికారం వదులుకొని, తనపై మాన్యులు, సామాన్యులు పెట్టుకొన్న నమ్మకాన్ని వమ్ము చేసింది. అయితే, ఉట్టికెగురలేనమ్మ స్వర్గానికి ఎగురుతాననట్లు డిల్లీ వంటి చిన్నరాష్ట్రాన్ని గట్టిగా రెండు నెలలు కూడా పరిపాలించలేని ఆమాద్మీ నేతలు, యావత్ దేశాన్ని పరిపాలించేసేందుకు, దేశ వ్యాప్తంగా ఎన్నికలలో పోటీకి సిద్దమయిపోయారు. అయితే ఎన్నికల ప్రచారానికి బయలుదేరిన ఆమాద్మీ నేత మరియు మాజీ డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు అనేక చోట్ల ఆ సామాన్యుల చేతిలోనే చెంప దెబ్బలు తిన్న తరువాత కానీ జ్ఞానోదయం కాలేదు. తాను చాలా తొందరపడి ప్రజలు అప్పజెప్పిన భాధ్యతని నిర్వర్తించకుండా తప్పించుకొని వారి నమ్మకాన్ని వమ్ము చేసానని అనేక మార్లు ప్రజల ముందు లెంపలు వేసుకొన్నారు. అలాగని తమ తీరు మాత్రం ఎన్నటికీ మారదని తెలియజేస్తున్నట్లు, ప్రముఖుల మీద పోటీకి దిగుతూ ప్రజల దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు.

 

అయితే అదేమీ ప్రజాస్వామ్య, చట్ట విరుద్దం కాదు గనుక వారినెవరూ తప్పుపట్టలేరు. కాని ఆవిధంగా పోటీ చేయడంలో వారి వెనుక ఉన్న సూత్రదారులెవరు? ఏ ప్రయోజనం ఆశించి ఆవిధంగా చేస్తున్నారు? అని సామాన్యులకి కూడా అనుమానాలు కలుగుతున్నాయి. వారి ఉద్దేశ్యాలు ఏమయినప్పటికీ, వారు కూడా పోటీలో ఉన్నారు. అన్ని రాజకీయ పార్టీల లాగే వారు కూడా ఎన్నికల ప్రచారం చేసుకొంటున్నారు. విజయం సాధించాలని కోరుకొంటున్నారు. అయితే ఈ ఆమాద్మీ గురించి దేశంలో ఆమాద్మీలు ఏమనుకొంటున్నారు? అనే ప్రశ్నకు జవాబుని టైమ్స్ అనే ప్రముఖ వార్త పత్రిక క్లుప్తంగా తెలియజెప్పింది.

 

ఆ పత్రిక 2014లో 100 మంది అత్యంత ప్రజాకర్షక వ్యక్తులు ఎవరనే సంగతి కనిపెట్టేందుకు తన పాటకుల అభిప్రాయాలు కోరితే వారిలో ఆమాద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ కి అనుకూలంగా 2,61,114 మంది ఓటువేయగా, దేశంలో ప్రభంజనం సృష్టిస్తున్నారని అందరూ భావిస్తున్న గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీకి ఆయనకంటే సరిగ్గా లక్షవోట్లు తక్కువగా పడ్డాయి. అంటే మోడీకి కేవలం 1,64,572 మంది మాత్రమే సానుకూలంగా ఓట్లు వేసారు.

 

మరి వీరిద్దరి సంగతీ తెలుసుకొన్నపుడు, ‘ప్రధానమంత్రి పదవి నా జన్మహక్కు!’ అని భావిస్తున్న యువరాజు రాహుల్ గాంధీకి ఎంతమంది అనుకూలంగా ఓట్లు వేసారో తెలుసుకోవాలని ఎవరికయినా ఆసక్తి కలగడం సహజం. రెండు రోజుల క్రితం ఆయన ఒక ప్రముఖ టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యులో తాను నూటికి 103 శాతం ప్రధాన మంత్రి పదవి చేపట్టడానికి సంసిద్దంగా ఉన్నానని తన మనసులో మాటను బయటపెట్టారు. కానీ ఆయనని అరవింద్ కేజ్రీవాల్, మోడీలతో పోలిస్తే 50శాతం మంది కూడా సానుకూలంగా స్పందించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆయనకు అనుకూలంగా కేవలం 96,070 మంది మాత్రమే ఓట్లు వేసారు. సామాన్యుల చేతిలో చెంప దెబ్బలు తింటున్నపటికీ నేటికీ అరవింద్ కేజ్రీవాలే యువరాజా వారి కంటే అన్ని విధాల మిన్నఅని సామాన్య ప్రజలు అనుకొంటుంటే, ఆయన మాత్రం నూటికి 103 శాతం ప్రధాన మంత్రి కుర్చీలో తానే కూర్చోవాలని ఆశించడం నిజంగా ఆశ్చర్యం కలిగిస్తుంది. జనాలు నవ్వితే నవ్విపోదురు గాక నాకేటి? అని ఆయన అనుకొంటున్నారేమో?