విశాఖ సాగర తీరంలో ఏపీఎల్ సందడి!

posted on: Aug 8, 2025 12:36PM

ఐపీఎల్ సీజన్ ముగిసింది. ఇండియా, ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ భారత్ క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించింది. ఇక ఏపీఎల్ సమారానికి తెరలేచింది. విశాఖపట్నంలో ఆంధ్ర ప్రీమియర్ లీగ్ సీజన్-4  శుక్రవారం (ఆగస్టు 8) సాయంత్రం  నుంచి ప్రారంభం కానుంది. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్  ఆధ్వర్యంలో జరిగే ఈ క్రీడా వేడుకలు క్రీడాభిమానులను అలరించనున్నాయి. యువ క్రికెటర్లకు వేదికగా, ప్రతిభకు నిలయంగా నిలిచిన ఏపీఎల్ ఈసారి మరింత రసవత్తరంగా ఉత్సాహభరితంగా సాగనుంది. ఈ సీజన్‌లో ఏడు జట్లు పోటీపడనున్నాయి. మొత్తం పాతిక మ్యాచ్‌లు జరగనున్నాయి. వీటిలో  21 లీగ్ మ్యాచ్‌లు, 4 ప్లే-ఆఫ్‌లు ఉన్నాయి. ఈ ప్రారంభోత్సవానికి కేంద్ర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు, ప్రముఖ సినీ నటుడు విక్టరీ వెంకటేష్ ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారు.

హీరో వెంకటేష్ ఈ సీజన్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్, మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ చరణ్ పాకాల ప్రత్యేక లైవ్ ప్రదర్శనలతో ఈ వేడుకలు  సందడిగా మారనున్నాయి. సాయంత్రం ఏడున్నర గంటలకు తొలి మ్యాచ్‌లో కాకినాడ కింగ్స్, అమరావతి రాయల్స్ జట్లు తలపడనున్నాయి. ఈ సీజన్‌లో విజయవాడ సన్‌ షైనర్స్, రాయల్ ఆఫ్ రాయలసీమ, సింహాద్రి వైజాగ్ లయన్స్, తుంగభద్ర వారియర్స్, భీమవరం బుల్స్ వంటి జట్లు కూడా బరిలో ఉన్నాయి. ఏసీఏ అధ్యక్షుడు కేశినేని శివనాథ్ ప్రేక్షకులకు ఉచిత ప్రవేశ సౌకర్యం కల్పించారు. స్టేడియం గేట్ నెంబర్ 15 నుంచి ప్రవేశం ఉంటుంది. ఆటగాళ్లను ప్రోత్సహించేందుకు భారీ ప్రైజ్ మనీ ప్రకటించారు. విజేత జట్టుకు రూ.35 లక్షలు, రన్నరప్ జట్టుకు రూ.20 లక్షలు బహుమతిగా అందనున్నాయి.

google-ad-img
    Related Sigment News
    • Loading...