అబ్దుల్ కలామ్ కాదు... అద్బుత కమాల్!

ఆయన పేరు కమాల్ కాదు! కలామ్! కాని, చేసిన కమాల్ అంతా ఇంతా కాదు! దేశపు చిట్ట చివరి చిరు గ్రామంలో పుట్టినా సరే... ఢిల్లీ దాకా వెళ్లాడు. రాష్ట్రపతిభవన్ లో కాలుమోపాడు. అంతకంటే ముందే పాకిస్తాన్ సరిహద్దులోని ప్రోఖ్రాన్ ఎడారి దాకా వెళ్లి వచ్చాడు! అక్కడ మన దేశం పేల్చిన అణుబాంబులో తన గర్జన శత్రు దేశానికి వినిపించాడు! నిజమైన భారతీయుడే కాదు... నిజమైన భారతీయ ముస్లిమ్ ఎలా వుంటాడో కూడా పాకిస్తాన్ కు చాటి చెప్పాడు! ఆయనే... అవుల్ పకీర్ జైనులాబ్దీన్ అబ్దుల్ కలామ్... మనందరి ఏపీజే కలామ్!

1931 అక్టోబర్ 15న కలామ్ రామేశ్వరంలో పుట్టారు. యుగయుగాలుగా మహా శైవ క్షేత్రంగా అదెంత ప్రఖ్యాతో చెప్పక్కర్లేదు కదా! కాని, కలామ్ పుట్టాక రామేశ్వరం జ్యోతిర్లింగం వల్ల మాత్రమే కాదు... జ్ఞాన జ్యోతి లాంటి కలామ్ జన్మస్థలంగా కూడా ఫేమస్ అయిపోయింది! ఇప్పుడు మతాలకతీతంగా రామేశ్వరం అందరికీ యాత్రా స్థలం అయిపోయింది!

తన జీవితాంతం నిరాడంబర గురువుగానే గడిపిన కలామ్ చనిపోయే క్షణంలో కూడా విద్యార్థులకి బోధిస్తూనే జీవిత యాత్ర ముగించారు. 83 ఏళ్ల వయస్సులో జులై 27న మేఘాలయ రాష్ట్రంలో ఆయన చనిపోయారు. అంటే... దక్షిణ తీరంలో వున్న రామేశ్వరంలో మొదలై ఈశాన్యంలో వున్న మేఘాలయ వరకూ ఆయన యావత్ భారతదేశాన్ని చుట్టేశారు, ఒక జీవిత కాలంలో! ఇది నిజంగా ఒక రాష్ట్రపతి స్థాయి వ్యక్తికి తగిన విషయం! అంతగా భారతదేశంతో మమేకం అయిన మరో ప్రెసిడెంట్ మనకు ఎవరున్నారు? అందుకే, ఆయన్ని మాత్రమే... పీపుల్స్ ప్రెసిడెంట్ అంటుంటారు ఇప్పటికీ!

అబ్దుల్ కలామ్ జన్మదినాన్ని యూఎన్ ఓ అంతర్జాతీయ విద్యార్థి దినోత్సవంగా ప్రకటించింది. ఇది దివంగత కలామ్ కి కాదుగాని... మనందరికీ ఎంతో గర్వకారణం! ఆయన చాలా ఉన్నత విద్యాసంస్థల్లో బోధించి వుండవచ్చు. కాని, ఆయన పేరున ఏ మిసైల్స్ డేనో, టెక్నాలజీ డేనో పెట్టకుండా స్టూడెంట్స్ డేనే ఎందుకు పెట్టారు? ఆయన టీచర్ కాబట్టి అలా నిర్ణయించేశారా? కానే కాదు! విద్యార్థుల పట్ల కలామ్ కు వున్న అపార నమ్మకం, ప్రేమే ఆయన జయంతి విద్యార్థి దినోత్సవంగా మారేలా చేసింది... 

ఒక్కసారి అయిదేళ్ల పాటూ దేశపు అత్యున్నత స్థానాన్ని అలంకరించాక ఎవరైనా ఏం చేస్తారు? అడపాదడపా మీటింగులకి అటెండ్ అవుతూ , ఆత్మ కథ రాసుకుంటూ ఖాళీగా కాలం వెళ్లదీస్తారు. గత రాష్ట్రపతుల్ని ఎవర్నీ చూసినా ఈ విషయం ఇట్టే చెప్పేయోచ్చు. చాలా మంది ప్రెసిడెంట్ గా రిటైర్ అయ్యాక పుణ్యక్షేత్రాలు దర్శిస్తూ శేష జీవితం గడుపుతారు. కాని, కలామ్ తన కలాన్ని వదల్లేదు. కలనీ వదల్లేదు. ఇండియా భవిష్యత్ అంతా స్టూడెంట్స్ చేతుల్లోనే వుందని ఆయన భావించారు. విశ్వసించారు. అందుకే, వాళ్లకు తన అపార జ్ఞానాన్ని పంచటం కోసమే గురువుగా అఖరు నిమిషం వరకూ కొనసాగారు! అటువంటి ఆయనకు తన జన్మదినాన్ని స్టూడెంట్స్ గా పరిగణించటం నిజమైన నివాళి....

నిజమైన శాంతి... ఊరికే అహింస అంటూ శత్రు దేశాల ముందు పిరికిపందల్లా చులకనైతే రాదు! మన వ్రతం అహింసే అయినా యుద్ధం చేయకపోవటం, చేయలేకపోవటం మన బలహీనత కాకూడదు. ఈ ఆలోచనకి కార్యరూపమే కలామ్ తన సుదీర్ఘ కెరీర్ లో రూపొందించిన అనేక మిసైల్ ప్రొగ్రామ్స్. ఇవాళ్ల సర్జికల్ స్ట్రైక్స్ చే్స్తూ భారత్ పాకిస్తాన్ గుండెల్లో నిద్రపోతోంది అంటే అందుకు ఈ మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఎంతో కారణం. వాజ్ పేయి టైంలో జరిగిన అణు పరీక్షల్లో కూడా కలామ్ కమాల్ ఎంతో వుంది! మొత్తంగా, లెక్కకు ఒక సైంటిస్ట్ , టీచర్ అయినప్పటికీ ఇండియాకు ఆయన ఆర్మీ యూనిఫామ్ వేసుకోని... ఒకానొక సైన్యాదిపతి! అంతలా ఆయన అందించిన మిసైల్స్, ఇరత టెక్నాలజీ మన రక్షణ వ్యవస్థను పటిష్టం చేసింది!

కలామ్ గొప్పతనం కేవలం చదవులు చెప్పటం, ఆయుధాలు, అణు బాంబులు తయారు చేయటం వరకే పరిమితం కాలేదు. పుట్టుకతో ముస్లిమ్ అయినప్పటికీ హిందూ సంప్రదాయాల్ని, సనాతన దర్మాన్ని, భారతీయతని ఆయన క్షణ క్షణం గౌరవించారు. ఆపాదించుకున్నారు. అదే ఆయనకు బీజేపీ నుంచీ కాంగ్రెస్ వరకూ ఆరెస్సెస్ తో సహా అందరి మద్దతూ సాధించి పెట్టింది! శత్రువుల గుండెలు చీల్చే మిసైల్స్ తయారు చేసినా... ఒక్క శత్రువూ లేకుండా చేయగలిగింది!